![గ్రోత్‌పై ఇప్పుడు మరిన్ని ఆశలు..](https://static.v6velugu.com/uploads/2023/10/jayant-r-verma-about-indias-economic-growth_Grv9x0b7CS.jpg)
- గ్రోత్‌పై ఇప్పుడు మరిన్ని ఆశలు..
- మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎఫెక్ట్ తక్కువే:ఆర్బీఐ ఎంపీసీ మెంబర్ జయంత్ వర్మ
న్యూఢిల్లీ: ఇండియా ఎకనమిక్ గ్రోత్‌పై కొన్ని నెలల కిందటి కంటే ఇప్పుడు ఆశలు మరింత పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మెంబర్ జయంత్ ఆర్ వర్మ చెప్పారు. హౌస్‌హోల్డ్ స్పెండింగ్పైనే ప్రధానంగా గ్రోత్ ఇప్పుడు ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఇన్ఫ్లేషన్ 4 నుంచి 5 శాతం వద్ద చాలా క్వార్టర్లు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయని వెల్లడించారు.
మన ఎకనమిక్ గ్రోత్‌పై నాలుగు నెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు నమ్మకం పెరిగిందని జయంత్ ఆర్ వర్మ వివరించారు. కన్జూమర్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ కావడంతోపాటు, వివిధ ఇండికేటర్లు కూడా గ్రోత్ మొమెంటమ్‌ను సూచిస్తున్నాయన్నారు. గ్లోబల్ గ్రోత్3 శాతంగానే కొనసాగుతుందన్న ఐఎంఎఫ్ ఇటీవల ఇండియా గ్రోత్‌ను మాత్రం కొద్దిగా పెంచిన విషయం తెలిసిందే.
వరల్డ్ ఎకానమీలో మందగమనం కారణంగా బయట నుంచి డిమాండ్ పెద్దగా లేదని, ప్రైవేట్ పెట్టుబడులు కూడా ఇంకా జోరందుకోలేదని వర్మ వెల్లడించారు. 2021–22 లో 9.1 శాతం గ్రోత్ సాధించిన మన ఎకానమీ 2022–23 లో 7.2 శాతంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఆర్బీఐ ఈ ఏడాది ఎకానమీ 6.5 శాతం గ్రోత్ రికార్డు చేయనుందని అంచనా వేస్తోంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు దిగొస్తుందనే ప్రశ్నకు బదులుగా, ఆగస్టు నెలలోనే ఇన్ఫ్లేషన్ పెరిగిందని, సెప్టెంబర్‌లో అది తగ్గిందని, అక్టోబర్ నెలలో కూడా తగ్గుముఖంలోనే ఉంటుందని జయంత్ వర్మ్ చెప్పారు.
దేశంలో ఇన్ఫ్లేషన్ 4 నుంచి 5 శాతం దాకా కొనసాగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. జయంత్ ఆర్ వర్మ ఐఐఎం అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్‌గానూ ఉన్నారు. గత రెండేళ్లుగా దేశంలో కమొడిటీ, ఫుడ్ ప్రైసెస్లలో హెచ్చు–తగ్గులు ఎక్కువయ్యాయని ఆయన చెప్పారు. అందుచేత, ఒకటి – రెండు నెలల్లో ఇన్ఫ్లేషన్ పెరగడం లేదా తగ్గడం వల్ల పెద్దగా సమస్యలేవీ ఉండవని పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్‌లోని యుద్ధం వల్ల వరల్డ్ ఎకానమీకి పెద్ద ముప్పు ఏమీ వచ్చే అవకాశాలు కనబడటం లేదని వర్మ స్పష్టం చేశారు. గ్లోబల్ డిమాండ్ తగ్గడంతో చమురు ధరలు మరీ ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉండకపోవచ్చని వివరించారు.