చెప్పుకున్నంత మాత్రాన జాతీయ పార్టీ అయిపోదు

నా  ఊరు, నా కులమూ, నా వర్గమూ, నా ప్రాంతమూ అనే కాకుండా నా దేశం అన్నది విస్తరించే ఉంది. కనుక  ఏ పార్టీ అయినా, ఏ మనిషైనా సరే ఈ సంకుచితత్వం నుంచి బయటపడి మరింత విస్తృతంగా ఆలోచిస్తే మన జాతి సంతోషపడాలి. మానవ సమాజం ఒకప్పుడు ట్రైబల్‌ సమాజంగా ఉండేది. తెగలతో ఉండేది. నా కుటుంబం, నా సమాజం అనే ఉండేది. అది క్రమక్రమంగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా  ప్రపంచంలో ఆరోవంతు కంటే ఎక్కువ అంటే 18 శాతం జనాభా మనదేశంలోనే ఉన్నది.  అందువల్ల మన ఆలోచనా పరిధి ఒక ఊరికి, మండలానికే కాకుండా దేశమంతా విస్తరించాలి. ప్రాంతీయ అంశాలే కాదు, ఈ దేశం గురించి పట్టించుకుంటే ఎవరినైనా ఆహ్వానించాలే కాని, విమర్శించకూడదు. ఇక ఏ మేరకు అది నడుస్తుందనేది ఎన్నికల వ్యవస్థను బట్టి ఉంటుంది మనదేశంలో ఓ పక్క వైవిధ్యత ఉంది. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు. రాజకీయంగా ఎప్పుడు ప్రజల మనసులోకి వెళ్లగలుగుతామంటే ఆ ప్రాంతాల్లో ఉన్న సంస్కృతులు, పరిస్థితులు, అవసరాలు, ఆర్థిక వ్యవస్థను, సామాజికవ్యవస్థను బాగా ఆకళింపు చేసుకొని దానికనుగుణంగా విధానాలు రూపొందించుకొని ప్రజల మనసుల్లోకి వెళ్లినప్పుడు. ఒక రాజకీయ పార్టీగా అవతరించవచ్చు. 

ప్రధాన పోటీదారులకే ఓటేస్తున్నరు

ఎన్నికల వ్యవస్థ  చాలా సంక్లిష్టమైంది. నా దృష్టిలో అది మనదేశానికి అనువుకానిది. కేవలం బ్రిటిషర్లను అనుకరించి మాత్రమే దాన్ని మనదేశంలో ప్రవేశపెట్టాం. పెద్దగా ఆలోచించి ఏమీ చేయలేదు. మనకలవాటైంది, మనలను పరిపాలించిన వారికున్నది, కనుక మనం తీసుకొచ్చాం, అది ఏమిటంటే ఫస్ట్‌ పాస్ట్‌ ద పోస్ట్‌ వ్యవస్థ. అంటే ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ల మధ్య ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాడు నెగ్గినట్టే, వాడికంటే ఒక్క ఓటు తక్కువొచ్చినా వాడు ఓడినట్టే. అంటే 40 శాతం ఓట్లు వచ్చినప్పుడు, అపోజిషన్‌లో 60 శాతం వస్తే వాళ్లు ఓట్లు పంచుకున్నట్టే, మిగతా వాడికి 39 శాతం రావచ్చు, అలాంటప్పుడు 40 శాతం వచ్చినవాడు గెలిచినట్టే కదా! సెకెండ్‌ ప్రైజెస్‌ ఏమీ ఉండవిక్కడ. అలాంటప్పుడు ఓటు వేసే వాళ్ల ఫీలింగ్స్‌ ఎలా ఉంటాయంటే మీరు మంచివాళ్లు, మీకు ఓటు వేయాలన్న కోరిక మాకు ఉండొచ్చు, మీరు పాలన బాగా చేస్తారన్న నమ్మకం మాకుంది, కానీ మీకు ఓటు వేస్తే మీరు గెలవరు, కనుక మీకు ఓటు వేయడం వల్ల నా ఓటు వేస్టయిపోతుంది. ఇంకొకడికి వేస్తాం అని అపొజిషన్‌ వాడికి వేయొచ్చు. అందుకే మన ఎన్నికల వ్యవస్థలో పోటీ ప్రజల మనసులో బరి ఉన్న వాళ్లలో ప్రధాన పార్టీలు ఆ రెండు ఎవరు? లేదా ప్రధాన అభ్యర్థులెవరు? వాళ్ల మధ్య ఒకరికి ఓటు వేయడం జరుగుతుంది. ఉదాహరణకు మునుగోడు మునుగోడు ఉపఎన్నికను తీసుకుందాం. ఇంతకు ముందు హుజూరాబాద్‌లో ఎన్నిక జరిగింది. అక్కడ చాలా బలమైన, ప్రభావం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏమయింది? అది మూడో స్థానానికి వెళ్లిపోతుందని ప్రజలు సరిగ్గా ఓటు వేయలేదు. మూడో స్థానంగా ఓ మూడు నాలుగు వేల ఓట్లకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు మునుగోడు పరిస్థితి కూడా అంతే. అక్కడ నిజమైన పోటీ టీఆర్‌‌ఎస్‌కు మిగతా పార్టీలకు మధ్య కాదు, బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్యనే. ఎన్నికల్లో ఎవరు నెగ్గినా కూడా మూడో పార్టీల్లో ఒకరు ఓడిపోక తప్పదు కదా! అప్పుడు టీఆర్‌‌ఎస్‌ ఒకటో స్థానానికో, రెండో స్థానానికో వెళుతుంది.అక్కడేమీ అనుమానం లేదు. కనుక అక్కడ అమీతుమీ తేల్చుకునేది రెండో పార్టీ ఎవరు అన్నదే. మనం మొదటి రెండులో ఉంటామా? మూడో స్థానానికి వెళ్లిపోతామా అన్నదే తేలాలి. మూడో స్థానానికి వెళ్లిపోతే మరీ తక్కువ ఓట్లు వస్తాయా? బీజేపీ కాని, కాంగ్రెస్‌ కాని మూడో స్థానంలో ఉండి చాలా తక్కువ ఓట్లు పొందింది అనుకుందాం. అప్పుడు జనం ఇంక ఆ పార్టీని పట్టించుకోరు,  వచ్చే ఎన్నికల్లో వారికి ఓటు వేయడం మానేస్తారు. అలా ఉంది మన ఎన్నికల వ్యవస్థ. 

పేరు మార్చుకుంటే సరిపోదు

ఒక గొప్ప పార్టీ, ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీ దేశమంతా రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఆ పార్టీకి ఉంది.  కానీ ప్రభావం ఎంత ఉంటుంది అనేది మన ఎన్నికల వ్యవస్థ నిర్దేశిస్తుంది. అదంత తేలికైన విషయం కాదు. రెండోది ఒక పార్టీ తను పెట్టుకున్న పేరును బట్టి అది జాతీయ, ప్రాంతీయ అనుకోవడం తప్పు. మా లోక్‌సత్తా పార్టీ ఆనాడు ఆంధ్రా, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో పోటీ చేసింది. పోటీ ఎక్కడైనా చేయొచ్చు. కానీ జాతీయ పార్టీగా గుర్తింపు ఎప్పుడొస్తుంది అంటే నాలుగు రాష్ట్రాల్లో మీరు కనుక గెలుపొందినట్లయితే అక్కడ తగిన సంఖ్యలో ఓట్లు, సీట్లు వచ్చినట్లయితే లేదా పార్లమెంట్‌ ఎన్నికల్లో కనీసం మూడు రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో ప్రాతినిధ్యం ఉండి 11 సీట్లు వచ్చినట్లయితే అప్పుడు జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. మనం చెప్పుకున్నంత మాత్రాన జాతీయ పార్టీ అయిపోదు. పేరు మార్చుకోవడం అన్నది ఒక సంకేతమే. మేం తెలంగాణకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా రాజకీయంగా ఎన్నికల బరిలో నిలబడతాం, రాజకీయ ప్రభావాన్ని చూపించే ఆలోచన మాకుంది అని ప్రజలకు చాటిచెప్పే ప్రయత్నం చేయడం.  కనుక పేరు మార్చుకున్నంత మాత్రాన రాజకీయంగా పెద్ద మార్పులొచ్చే అవకాశమేమీ ఉండదు. ఇక ఎన్నికల్లో ఫలితమెట్లా వస్తుందనేది ఎన్నికల వ్యవస్థ, ఆయా ప్రాంతాలను మనం అర్ధం చేసుకున్న తీరును బట్టి ఉంటుంది.  నూట ముప్ఫై ఏండ్ల నుంచి ఎంతో చరిత్ర ఉండబట్టి కాంగ్రెస్‌ జాతీయపార్టీ కాగలిగింది, అలాగే అరవై డెబ్భై ఏండ్ల పాటు అపారమైన త్యాగాల ఫలితం బీజేపీ కావొచ్చు, దాని వెనుక ఉన్న ఆర్‌‌ఎస్‌ఎస్‌ కావొచ్చు. వారికి ఏనాడూ ఓట్లు సీట్లు లేకపోయినా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాయి. దశాబ్దాల తరబడి కృషి చేస్తే ఈ రోజు ఆ రెండు జాతీయపార్టీలు ఈ స్థాయిలో ఉన్నాయి. 

కొత్త పార్టీ నిలదొక్కుకోవడం సులభం కాదు

కచ్చితంగా ఎవరికైనా సరే జాతీయస్థాయిలో తమ ప్రభావం చూపించాలి అనుకుంటే దేశ పరిస్థితులకనుగుణంగా అడుగులు వేయాలి. కానీ ఎంత వరకూ సఫలీకృతులవుతారు అన్నది మాత్రం దేశ ఎన్నికల వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుంది. ఎంతో బలమైన కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్​లో మూడో పార్టీగా ముద్రపడి ఓట్లను కోల్పోయింది. లోక్‌సత్తాకు ఎంఐఎం కంటే ఓట్లు ఎక్కువొచ్చాయి. అది అప్పుడు రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. లోక్‌సత్తాకు విస్తరించిన ఓట్లు రావడం వల్ల, వీళ్లకు ఓట్లు వేస్తే సీట్లు రావన్న భావం ప్రజలకు కలిగి తర్వాత ఓట్లు వేయడం మానేశారు.  అది మామీద నమ్మకం లేక కాదు, ఓటు వేస్ట్‌ అయిపోతుందన్న భయం. కనుక ఒక పార్టీ నిలబడటం అన్నది ఎన్నికల వ్యవస్థ శాసిస్తుంది. కొత్తపార్టీ నిలదొక్కుకోవడమనేది ఈ దేశంలో అంత సాధ్యం కాదు. కాని ఒక పార్టీ ఎక్కువ రోజులు నిలబడాలి అంటే ఆరోగ్యకరమైన పోటీ ఉంటే అది సాధ్యపడుతుంది. అందువల్ల బీఆర్​ఎస్​ మంచి విధానాలను తీసుకువచ్చి, ప్రజల ఆదరణను పొందగలిగి, మంచి పాలన అందిస్తే అది అందరూ  ఆహ్వానించదగిన పరిణామమే అవుతుంది. - జయప్రకాశ్​ నారాయణ్, వ్యవస్థాపక అధ్యక్షుడు, లోక్​సత్తా పార్టీ