హైదరాబాద్ తెలంగాణకు ఆయువుపట్టు, జీవనాడి లాంటిది. హైదరాబాద్ లేకపోతే తెలంగాణకు ఉపాధి కల్పన, పెట్టుబడులు కష్టం. ప్రభుత్వాలకు ఆదాయం ఉండదు. హైదరాబాద్ నుంచి ఆదాయం తీసుకుంటున్న రాష్ట్ర సర్కారు..ఈ నగరం గురించి కావాల్సినంతగా పట్టించుకోవడం లేదు. సిటీపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. పదేండ్ల క్రితమే రూ.6,600 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ నిర్మించారు.
ఇక్కడ బస్సులు తిరిగేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండవు. దీనిపై ఎన్ని బస్సులు కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఒక బస్సుకు ఒక కోటి చొప్పున లెక్కేసినా వంద బస్సులకు రూ.100 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ప్యారలల్‌గా మెట్రో వేస్తే.. ఒక కిలోమీటర్‌కు రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఖర్చవుతుంది.
అదే భూగర్భంలో అయితే ఒక కిలోమీటర్‌కు రూ.400 కోట్లకు తగ్గకుండా రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుంది. కోటి రూపాయలతో బస్సు వేస్తే పోయేదానికి అవుటర్ చుట్టూ మెట్రో వేయడం సరికాదు. 6,600 కోట్ల రూపాయలతో హెచ్‌ఎండీఏ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మించింది. ప్రభుత్వమే దానికి హామీ ఇచ్చింది. ఇంకా దాని అప్పు తీరలేదు.
హైదరాబాద్నగరంలో ట్రాఫిక్ నరకంగా మారింది. ఒక్కసారి సాయంత్రం 6 గంటలకు ఏ సెక్యూరిటీ, పోలీసుల హడావిడి లేకుండా సీఎం లేదా ఎవరైనా మంత్రి సిటీలో తిరిగితే తెలుస్తుంది. కాబట్టి సిటీలో మనకు తప్పకుండా మెట్రో కావాలి. గ్రేటర్ మొత్తంలో ఇప్పటి వరకు 75 కిలోమీటర్ల వరకు వేసి ఉంటారంతే. అదీ ప్రైవేటు రంగం ముందుకొచ్చింది కాబట్టి. దానికి రూ.20 వేల కోట్లు ఖర్చయ్యాయి.
ఇందులో వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ప్రభుత్వం దాదాపు1,750 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టింది. సిటీలో జన సమర్థం ఎక్కువ ఉన్న చోట మెట్రో రావాలి. లాస్ట్ మైల్కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉన్నది. సపోజ్ నేను ‘ఏ’ నుంచి ‘బీ’ కి వెళ్లాలి అనుకుంటే.. ‘ఏ’ వరకు ఏ ఆటోనో, ట్యాక్సీనో పట్టుకొని.. ‘ఏ’ నుంచి మెట్రో పట్టుకొని మళ్లీ ఏదో ఆటోనో, బస్సునో పట్టుకొని ‘బీ’కి చేరాల్సి వస్తున్నది.
ఇలా చివరి వరకు లాస్ట్మైల్కనెక్టివిటీ లేకపోవడం వల్ల.. మెట్రోలో ప్రయాణం చేయాలని ఉన్న వ్యక్తులు కూడా సొంత కారో, సొంత బండిపైనో రోడ్లపైకి వస్తున్నారు. లండన్ సహా పలు నగరాల్లో మెట్రో, ట్రైన్, బస్సు అన్నిటినీ ఒకే సంస్థ నడుపుతుంది. ఒక టికెట్‌తో ఎక్కడికి వెళ్లాలన్నా, ఎందులోనైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు. హైదరాబాద్‌లో అలాంటి చొరవ తీసుకోవచ్చు. ఎమ్ఎమ్‌టీఎస్ ఉంది, ఆర్టీసీ ఉంది, మెట్రో ఉంది. ఈ మూడింటినీ సంధానం చేసి ఒకే సంస్థగా మార్చవచ్చు.
అవసరం అనుకుంటే జీహెచ్‌ఎంసీ పరిధిలో అదనంగా బస్సులు పెట్టడమో లేదా మెట్రోను పొడిగించడమో చేసి కనెక్టివిటీని పెంచాలి. ఫుట్‌పాత్‌లు ఎక్కువగా పెట్టాలి, సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలి. కొన్నిచోట్ల వేరే మార్గం లేకపోతే రాపిడ్ బస్ ట్రాన్స్‌ఫోర్ట్ సిస్టంను పెట్టొచ్చు. దానికి కిలో మీటర్‌కు రెండు మూడు కోట్ల ఖర్చు అవుతుంది. ఇవన్ని పెద్ద కష్టమేమీ కాదు. గోటితో పోయేదానికి గొడ్డలెందుకు? జనం ఉన్నచోట మెట్రోలు ఏర్పాటు చేయకుండా జనం లేనిచోట, భవిష్యత్‌లో నగరం పెరుగుతుందేమో అన్న ఊహతో కిలోమీటర్‌కి రెండు మూడువందల కోట్ల రూపాయలు పెట్టడమనేది ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.
పార్కింగ్ నియంత్రణ
నగరం లోపల పనులు చేపట్టాలంటే భూసేకరణ అడ్డొస్తోందని కొందరంటున్నారు. చిన్న చిన్న సమస్యలున్నాయని అవసరమున్నచోట వదిలేసి అవసరం లేని చోట అభివృద్ధి పనులు చేయడం ఎంత వరకు కరెక్ట్? జనం ఉన్న చోట మెట్రోనిర్మించాలి కానీ, దాని అవసరం లేనిచోట నిర్మాణం దేనికి? నగరం మధ్యలో 20 వేల కోట్ల రూపాయలతో మెట్రో నిర్మిస్తే, ఏడాదికి13 వందల కోట్ల రూపాయలు నష్టమొచ్చి వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. జనం లేని చోట కోట్లు పెట్టి మెట్రోలు కడితే లాభం ఏమిటి? కాబట్టి హైదరాబాద్ సిటీలో పౌర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి.
నిత్యం కారు, బైక్‌లపై వెళ్లే వారు తమ వాహనాలు వదిలేసి బస్, మెట్రో, ఎమ్‌ఎమ్‌టీఎస్‌లను ఉపయోగించుకొని హాయిగా, ఎలాంటి భయం లేకుండా ప్రయాణం చేయవచ్చు అన్న నమ్మకం ప్రభుత్వం కల్పించాలి. దానికి తగ్గట్లే ఏర్పాట్లూ ఉండాలి. అలాగే గ్రేటర్‌లో పార్కింగ్ మీద నియంత్రణ లేదు. పార్కింగ్‌కోసం ప్రత్యేకించి సౌకర్యాలు ఉండటం లేదు. రోడ్డుకు అడ్డంగా కారు పార్క్ చేసి పక్క షాపులోకెళ్లి పని చూసుకుంటున్నారు. దాంతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు రోడ్డుపై వేచి ఉండాల్సి వస్తున్నది. అందుకే పార్కింగ్ కోసం ప్రత్యేక నిర్మాణాలు చేయాలి.
విధిగా అక్కడే పార్కింగ్ చేయాలని ప్రభుత్వం శాసించాలి. వినకుంటే పెనాల్టీలు వేయాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన తర్వాత రోడ్లమీద కార్లు తిరగడాన్ని కఠినతరం చేయాలి. లండన్‌లో కారులో వెళ్లాలంటే ఆ రోజుకు ఇరవై ముప్పై పౌండ్లు అదనంగా పే చేయాల్సి ఉంటుంది. సింగపూర్‌లో కారులో తిరగాలంటే.. ఖర్చు ఎక్కువ అవుతుందని భయపడతారు. అందుకే జీహెచ్‌ఎంసీ పరిధిలో జనం ఎక్కువగా ఉండే ఓఆర్‌ఆర్ లోపల ప్రత్యామ్నాయాలు బలంగా ఏర్పాటు చేయాలి. అంతేగానీ ఓఆర్‌ఆర్ పెద్దగా ఉందని అక్కడే మెట్రోలు వేస్తామనడం సరికాదు. ఒకవేళ ఆచరణలో మెట్రో రైలు నిర్మించినా కూడా ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ.
పెట్టిన ఖర్చుకు ఫలితం ఉండాలి..
పెట్టే ఖర్చుకు, వచ్చే ఫలితానికి సంబంధం లేకపోవడం వల్లే అప్పుల పాలవుతున్నామని గత 25 ఏండ్లుగా నేను చెబుతూనే ఉన్నా. కచ్చితంగా నగరంలో మౌలిక సదుపాయాలు అవసరం. మెట్రో అవసరం, బస్సులు పెంచడం అవసరం. ఎమ్‌ఎమ్‌టీఎస్‌ను బలోపేతం చేయడం అవసరం. కానీ ఈ మూడు కూడా కుడి చెయ్యి, ఎడం చెయ్యి అన్నట్లు సంబంధం లేకుండా నడిస్తే ఫలితం ఉండదు. వీటిని సంధానం చేయాలి. అవసరమైతే విలీనం చేయాలి. వీటి వల్ల అందరకీ ప్రయోజనం చేకూరాలి. మెట్రోను మరింత విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, మౌలిక సంకల్పాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. కానీ అవుటర్ రింగ్ రోడ్డు చూట్టూ కాకుండా జనం ఉన్న చోట, రద్దీ ఉన్న చోట మెట్రో విస్తరణ జరగాలి. ఎప్పుడో ఆనాటి పాలకుల, ఎల్‌అండ్‌టీ పుణ్యమా అని ఢిల్లీ తర్వాత మనకి మంచి మెట్రో వచ్చింది. ఆ తర్వాత అలాంటి దాని గురించి మరచిపోయారు.
కానీ ఇతర నగరాలు మనకంటే ముందుకు దూసుకుపోతున్నాయి. ఢిల్లీలో రెండు ఫేజుల్లో ముంబయి, బెంగళూరు, చెన్నైలలో చేపట్టారు. మన దగ్గర ఆలస్యమైంది. మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా నగర జీవనాన్ని బాగు చేసే దిశగా ఉండాలి. వంద మీటర్ల దూరం నుంచి ప్రయాణ సౌకర్యాలు ఉండి, ఒకచోటు నుంచి ఇంకో చోటుకి ఈజీగా జర్నీ చేసేలా నగర జీవితం బాగుపడితే, ఖర్చు ఎక్కువైనా దాన్ని సంతోషంగా భరించొచ్చు. హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, డబ్బు వృథా కాకుండా పనికి వచ్చేలా ఖర్చు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్న.
- డా. జయప్రకాశ్‌నారాయణ, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు