ఆయన పక్కా పుడమి బిడ్డ, సింగరేణి ఉద్యోగి, అలుపు ఎరగని, మానవత్వం ఉట్టి పడే మనిషి, ఆయనే జయరాజ్! ప్రకృతికి అందరూ సమానమే. పేద, ధనిక, ఉన్నత వర్గం, అట్టడుగు వర్గం అనే తారతమ్యాలు ఉండవు అంటున్నారు మన ప్రజా గాయకుడు, నల్ల నేల ఆణిముత్యం, మట్టి బిడ్డల గళం, కలం జయరాజ్. ప్రకృతిని మానవులే కలుషితం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో నిష్ణాతులవుతుంటారని, వీరు నేర్చుకున్నదంతా ప్రకృతిని చూసేనని అన్నారు. ఆయన ఈ నెల 9 న ప్రముఖ కవి కాళోజి నారాయణరావు అవార్డు 2023 స్వీకరిస్తున్న సందర్బములో జయరాజ్ మనోభావాలు ఇలా.. మానవుడి అభివృద్ధి వెనుక ప్రకృతి పాత్ర కీలకం. అగ్గిపెట్టెలో ఇమిడే ఆరు గజాల చీరెను నేసి ప్రపంచాన్ని అబ్బురపర్చిన నేతన్నకు సాలీడు ఆది గురువు. భూమికి ఆకర్షణ శక్తి ఉంటుందని న్యూటన్ కనుగొన్నట్లుగానే, చెట్టు పైనుంచి యాపిల్ కిందకు పడ్డప్పుడే మధుర గీతాలతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసే గాయకులు కోకిల రాగాల నుంచే నేర్చుకున్నారు. ఇలా మానవుడు నేర్చుకున్నవన్నీ ప్రకృతిని చూసే. అందుకే, ప్రకృతిలో చెట్టూ, చేను, రాయీ రప్పా, వాగులు, వంకలు, పిల్లగాలి, సెలయేరు కవులకు కవితా వస్తువులయ్యాయి.
జగతికి మార్గం అంబేద్కర్
మనిషి ముందుగా తనను తాను ప్రేమించు కోవాలని, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆలోచించుకోవాలని అన్నారు. ఆకలి, అవమానాలు, కష్టాలు, కడు దారిద్ర్యం అనుభవించి..సమాజంలో వెళ్లగొట్టబడిన వారు అదే వేగంతో లేవాలని అన్నారు. అప్పుడే ప్రయోజకులవుతారని. సమాజాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తారని అభిప్రాయపడ్డారు. ఇందుకు బీఆర్ అంబేద్కర్ విధానమే ఆదర్శమన్నారు. జాగోరే జాగో అంబేద్కర్... జగతికి మార్గం అంబేద్కర్... మా చల్లని టీచర్ అంబేద్కర్... మా చారికి టార్చి అంబేద్కర్.. భారత్ కు మార్క్స్ అంబేద్కర్.. అని తన గాన మాధుర్యంతో కొనియాడారు. తల్లిదండ్రులను ప్రేమించిన వారే ఉత్తములన్నారు. అమ్మా నీ పిలుపులోనే అమృతం ఉన్నది, అమ్మా నీ పిలుపులోనే అనురాగం ఉన్నది అంటూ మాతృమూర్తి మమతానురాగాలపై రాగం ఆలపించారు. 'నాయనా నీ మట్టికాళ్లకు దండమే... నీ మంచి మనసుకు దండమే..' అంటూ తండ్రిపై ఉన్న వాత్సల్యాన్ని తన పాటతో చాటిచెప్పారు. 'కొమ్మల్లో కోకిల పాటలు పాడాలి.. పల్లెల్లో అక్షర దీపంవెలగాలి' అంటూ అక్షరాస్యత ఆవశ్యకతను ఎత్తి చూపారు. ప్రాంతం పట్ల అవగాహన
ఏడు మండలాలు ఏపీలో కలపడం వెనక కుట్ర ఖమ్మం జిల్లా రాజకీయ, సాంస్కృతిక, సాహితి రంగాలకు పెట్టింది పేరు. నదీజలాలు, అపారమైన ఖనిజ సంపదకు ఇక్కడ కొదువలేదు. గిరిజనుల సంస్కృతి కనుమరుగైన ఖమ్మం జిల్లాను ఊహించాలంటే ఎవరికైనా దుఃఖం వస్తుంది. ఆరు దశాబ్దాల పోరాటాల అనంతరం తెలంగాణను సాధించుకున్నాం. అయినా మనకు పూర్తిస్థాయిలో ఊరట కలగలేదు. జిల్లాలోని 7 మండలాలు ఏపీలో కలిపారు. దీని వెనక పెద్ద కుట్రే దాగుంది. సమాజ హితం కోసమే నా పాట సమాజ హితం కోసమే తన పాట అని జయరాజ్ అన్నారు.
చెట్లను నరకొద్దు
ప్రకృతికి దగ్గరగా ఎవరుంటారో వారే సుఖంగా జీవిస్తారు. వారికి ఏ కష్టమూ ఉండదు. చెట్లను నరకడం, వాతావరణాన్ని కలుషితం చేయడం మూలంగా మనిషి అనేక కష్టాలను కొనితెచ్చుకుంటున్నాడు. సకాలంలో వర్షాలు పడటం లేదు. పంటలు పండటంలేదు. కరెంట్ కొరత తీవ్రంగా ఉంది. వీటన్నింటికీ కారణం మానవుడు ప్రకృతిని నాశనం చేయడమే. చెట్లను విరివి గా పెంచినప్పుడే పచ్చని తెలంగాణ సాధ్యం. నిజాం కాలంనాటి గొలుసుకట్టు చెరువులు పూడుకుపోయాయి. వాటిని పునరుద్ధరిస్తే ప్రకృతిని కాపాడినట్టవుతుంది. సాగునీరు, తాగునీరుకు ఇబ్బంది ఉండదు. చెరువులు నిండుగా ఉన్నచోటికే పశువులు, పక్షులు, చేపలు, సకల జంతువులు వస్తాయి – ఇదీ కవి జయరాజ్ మాట.
- ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్టు