మహదేవపూర్, వెలుగు : కాళేశ్వరంలో జరిగే సరస్వతీ పుష్కరాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని జయశంకర్భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో పుష్కరాల నిర్వహణపై దేవాదాయ, పంచాయతీ రాజ్, సమాచార, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని విభాగాల అధికారుల సమన్వయం కీలకమన్నారు. ఏర్పాట్ల సమాచారం భక్తులు సులభంగా తెలుసుకోవడానికి వీలుగా మ్యాపింగ్ తయారు చేయాలని సూచించారు. వివిధ అంశాలపై ఆయా డిపార్ట్మెంట్ల అధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, డీపీవో నారాయణరావు, డీపీఆర్ వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.