జీపీ విధులపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

జీపీ విధులపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి అర్బన్, వెలుగు: గ్రామ పంచాయతీ స్పెషల్​ఆఫీసర్లు పంచాయతీ విధులపై అవగాహన కలిగి ఉండాలని జయశంకర్​భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ ఆఫీస్​లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని మండల, గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో గ్రామపంచాయతీ విధులు, బాధ్యతలు, పారిశుధ్యం, చెట్లు పెంపకం, అభివృద్ధి తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

అధికారులకు పీపీటీ ద్వారా వివరించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలను గ్రామాల్లో అమలు చేయాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారలదేనన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రత్యేక అధికారుల విధులు చాలా కీలకమైనవని, సేవల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. 

గ్రామాల్లో అభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. పంట, వరద ప్రభావిత నష్టాలను అంచనాలు వేసి కలెక్టర్ కు నివేదిక అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయ లక్ష్మి, డీపీవో నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.