
మహదేవపూర్, వెలుగు: మర్డర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ. 10 వేల జరిమానా విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి. నారాయణ బాబు మంగళవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన సంగిశెట్టి కిశోర్(22) భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం బ్రాహ్మణపల్లి ఇసుక క్వారీలో సూపర్ వైజర్ గా పని చేసేవాడు. 2018లో కిశోర్ ఫ్రెండ్ ఇసుక క్వారీ ఇన్ చార్జ్ చోడవరపు నర్సింహమూర్తి, మహదేవ్ పూర్ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన గోగుల లలితను లవ్ మ్యారేజ్ చేసుకునేందుకు తన సొంతూరు విజయనగరం తీసుకెళ్లాడు.
నర్సింహమూర్తికి ఫ్రెండ్ కిశోర్ సహకరించాడని యువతి తమ్ముడు గోగుల విజయ్ కక్షకట్టాడు. అదే ఏడాది ఆగస్ట్ 28న రాత్రి ఇసుక క్వారీ వద్ద కిశోర్ ఉండగా వెళ్లి విజయ్ గొడ్డలితో నరికి చంపాడు. మృతుడి తండ్రి దుర్గారావు మహదేవ్‌పూర్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. కేసు దర్యాప్తు చేసిన సీఐ అంబటి నర్సయ్య కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ శ్రీనివాస్ వాదనలు వినిపించారు