రెవెన్యూ విలేజ్​గా జయశంకర్ స్వగ్రామం

రెవెన్యూ విలేజ్​గా జయశంకర్ స్వగ్రామం
  • ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా సీఎం రేవంత్​రెడ్డి
  • ఉదయమే గ్రామానికి కలెక్టర్​
  • ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఆఫీసర్లు  
  • త్వరలోనే ప్రకటన ఉంటుందని వెల్లడి

ఆత్మకూరు, వెలుగు : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ మహేందర్, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ సురేశ్​ కుమార్ గ్రామానికి వచ్చి సర్వే చేశారు. సర్పంచ్ విజయ , ఎంపీటీసీ పొగుల ఇందిర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకుని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రెవెన్యూ గ్రామంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు.  

రేవంత్​రెడ్డి హామీ మేరకు...

2022 మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సమస్యలు తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం చేపట్టింది. దీన్ని జయశంకర్ సొంత ఉరైన అక్కంపేట నుంచి ప్రారంభించారు. ఆ సమయంలో గ్రామస్తులు రేవంత్​రెడ్డికి సమస్యలు చెప్పుకున్నారు. అక్కంపేట రెవెన్యూ పరంగా పెద్ద గ్రామమైనప్పటికీ హామ్లెట్​గానే ఉండిపోయిందన్నారు. జయశంకర్ స్మృతి వనం, హాస్పిటల్, రెవెన్యూ గ్రామం ఏర్పాటు వంటి అంశాలను బీఆర్ఎస్​ నెరవేర్చలేదన్నారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కేసీఆర్ తమ గ్రామానికి రాలేదని చెప్పారు. కార్యక్రమం తర్వాత ఓ దళితుడి ఇంట్లో భోజనం చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీని అక్కంపేటకు తీసుకువస్తానని, సమస్యలు పరిష్కరించి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, రెవెన్యూ గ్రామంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మర్చిపోకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు పంపించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండడంతో గ్రామస్తులు రేవంత్ రెడ్డి ఫొటోకు పాలాభిషేకం చేశారు.