హైదరాబాద్ సిటీ, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జేబీఎస్ మెట్రో స్టేషన్ ను ఇంటర్నేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఇందుకోసం జేబీఎస్ మెట్రో స్టేషన్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వానికి, రక్షణ శాఖకు చెందిన 30 ఎకరాల భూమిని సేకరిస్తామని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలోని జిల్లాల నుంచి సిటీకి వచ్చే ప్రజల రాకపోకలకు అనుగుణంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రజల అవసరాలను తీర్చేలా వరల్డ్ క్లాస్ సదుపాయాలతో జేబీఎస్ హబ్‌ను డెవలప్ చేయాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్ పేట వెళ్లే మెట్రో మార్గాలను సీనియర్ ఇంజనీర్లు, సాంకేతిక సలహాదారులతో కలిసి ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ప్యారడైజ్– మేడ్చల్ మార్గంలో సాంకేతిక సమస్యల కారణంగా మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు.
జేబీఎస్ నుంచే మేడ్చల్ మార్గం
ఫేజ్–2 పార్ట్ బీలో నిర్మించ ప్రతిపాదించిన ప్యారడైజ్ – మేడ్చల్ (23 కి.మీ), జేబీఎస్ – శామీర్ పేట్ (22 కి.మీ) కారిడార్ అలైన్ మెంట్ విషయంలో సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఇంజినీర్లు, సాంకేతిక సలహాదారులు ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్యారడైజ్– మేడ్చల్ మార్గాన్ని సాంకేతిక సమస్యల కారణంగా మార్పులు చేయాలని నిర్ణయించామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మొదట ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు నిర్మించనున్న మార్గంలో కొంత దూరాన్ని హెచ్ఎండీఏ నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్పైనుంచి డబుల్ డెక్కర్ మోడల్ లో తీసుకెళ్లాలలని ప్రతిపాదించామని తెలిపారు.
అయితే, హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ మార్గాన్ని ఎయిర్‌పోర్టులో రన్ వే వద్ద 600 మీటర్ల పొడవు అండర్ గ్రౌండ్ నిర్మించాలని తలపెట్టడంతో మెట్రోకు ఇంజినీరింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అలాగే, ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు బేగంపేట ఎయిర్‌పోర్టు సరిహద్దు వెంబడి రోడ్డు చాలా వంపులు ఉండడం, తదితర కారణాలతో మేడ్చల్ మార్గాన్ని జేబీఎస్ నుంచి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. జేబీఎస్ నుంచే రెండు మెట్రో కారిడార్‌లు ప్రారంభించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు.