నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి.. నెక్స్ట్ సీఎం లోకేష్.. టీడీపీ ఫ్యూచర్ లోకేష్.. ఇదీ గత కొంతకాలంగా టీడీపీలో వినిపిస్తున్న వాదనలు. నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ క్యాడర్ తెరపైకి తీసుకొచ్చిన డిమాండ్ టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఏ రేంజ్ లో మాటల యుద్దానికి దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ అంశంపై ఎవ్వరు మాట్లాడొద్దంటూ ఇరు పార్టీల అధిష్టానాలు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో వివాదం సద్దుమనిగింది. అయితే, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో టీడీపీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అన్న చర్చ మళ్ళీ తెరమీదకు వచ్చింది.
చంద్రబాబు నేషనల్.. లోకేష్ లోకల్:
ఆరోగ్య కారణాలు, వయసు రీత్యా గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న జేసి దివాకర్ రెడ్డి తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు, లోకేష్ లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏపీ రాజకీయాల్లో పెనుమార్పు చోటుచేసుకోబోందని.. సీఎం చంద్రబాబు స్థానంలో ఆయన కొడుకు లోకేష్ సీఎం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ.
చంద్రబాబు బలవంతంగా దిగిపోవాలని తాను కోరుకోవట్లేదని.. ఆయన అనుభవం నేషనల్ పాలిటిక్స్ కి అవసరమని భావించి ఇలా చెబుతున్నానని అన్నారు.చంద్రబాబుకు జాతీయ రాజకీయాలు నడిపే సామర్థ్యం, నైపుణ్యం ఉన్నాయని అన్న జేసి.. వచ్చే ఎన్నికల్లో తాను అంచనా వేసిన మార్పు జరగచ్చని అన్నారు.
పవన్ కళ్యాణ్ గురించి నో కామెంట్స్:
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మీడియా అడుగగా.. సున్నితంగా తిరస్కరించారు జేసి.తనకు పవన్ కల్యాణ్ తో అంతగా వ్యక్తిగత సంబంధాలు లేవని.. పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి తాను ఎలాంటి కామెంట్స్ చేయదలచుకోలేదని అన్నారు.
మొత్తానికి జేసీ వ్యాఖ్యలతో టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు మళ్ళీ తెరపైకి వచ్చేలాగే ఉంది.. సీరియస్ వార్నింగ్ తో క్యాడర్ ని సైలెంట్ చేసిన చంద్రబాబు.. జేసీ వ్యాఖ్యల పట్ల ఎలా రియాక్ట్ అవుటారన్నది ఆసక్తిగా మారింది.