ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై కలెక్టర్ స్పందించనప్పుడు స్పందన (ప్రజాదర్బార్) కార్యక్రమం ఎందుకంటూ మండిపడ్డారు. ఏపీలో ప్రతి సోమవారం ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండి ప్రజల ఫిర్యాదులు స్వీకరించి.. వాటిని ఆన్ లైన్ చేసి.. పరిష్కారం చేయడం జరుగుతోంది. గతంలో ప్రజాదర్బార్ పేరుతో నిర్వహించే ఈ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ‘స్పందన’గా మార్చింది.
ఇవాళ సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుండడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టరేట్ కు వచ్చారు. సాధారణ ప్రజల తరహాలోనే తన ఫిర్యాదు గురించి ప్రశ్నించడానికి వచ్చారు. గతంలో తాము ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ..కలెక్టర్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జలదిన్నె గ్రామంలోని భూసమస్యపై గతంలో కంప్లెంట్ చేసినా ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు. అధికార పార్టీ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నారని..తమ సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదని పెద్దస్వరంతో ప్రశ్నించారు.
కలెక్టర్ ఇక వెళ్లండి అని చెప్పటంతో తన చేతిలో ఉన్న కాగితాలను పక్కనున్న అధికారికి ఇస్తూ.... మీకు గతంలోనే ఇచ్చాను.. వీటిని మళ్లీ చూడమన్నారు. కలెక్టర్ వైపు చూసి.. చేతులెత్తి మొక్కుతూ.. అందరూ ఐఏఎస్ లు కాలేరు.. మీరు అయ్యారంటే.. అది మీ అదృష్టం.. నిజాయితీగా పనిచేసి న్యాయం చేయండి.. మీకు దయచేసి మొక్కుతా.. ప్రజలను.. ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటూ వేదిక వద్ద నుంచి వెళ్లిపోయారు.