సాధారణంగా కొన్ని వస్తువులను వాటిని తయారుచేసిన వ్యక్తుల పేర్లతోనే పిలుస్తుంటారు. లేదంటే.. ఆ వస్తువుని మొదటగా మార్కెట్లోకి తెచ్చిన కంపెనీ పేరుతో పిలుస్తుంటారు. జిరాక్స్, జీప్, డంప్‌స్టర్, డాల్డా అలా వచ్చినవే. అలాగే కొన్నేండ్ల క్రితం బుల్డోజర్లు(ఎక్స్‌కవేటర్లు) మార్కెట్లోకి వచ్చినప్పుడు దాన్ని తెచ్చిన కంపెనీ, తయారుచేసిన వ్యక్తి జేసీబీ(జోసెఫ్ సిరిల్ బామ్‌ఫోర్డ్) పేరుతోనే పిలవడం మొదలైంది. ఏండ్లు గడిచినా, కొత్త టెక్నాలజీలు వచ్చినా జేసీబీకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. నిర్మాణరంగంలో ప్రపంచంవ్యాప్తంగా గొప్ప విప్లవం తెచ్చిన జోసెఫ్ సిరిల్ బామ్‌ఫోర్డ్ పేరులోని మొదటి అక్షరాలతో జేసీబీ కంపెనీకి ఆ పేరుపెట్టారు.
జేసీబీ స్టోరీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైంది. జోసెఫ్‌ది ఇంగ్లాండ్‌లోని ఉటోక్సెటర్. అతను యువరైతు. వ్యవసాయం చేస్తున్నప్పుడు అతనికి మరింత ఎఫెక్టివ్‌గా పనిచేసే పరికరాలు అవసరం అనిపించింది. అందుకే అతనికి వ్యవసాయంలో తలెత్తిన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవాలని అనుకున్నాడు. అందులో భాగంగానే తన పొలంలో ఒక చిన్న వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనే తనకు కావాల్సిన పరికరాలు తయారుచేసుకునేవాడు.1945లో యుద్ధం ముగిశాక తన గ్యారేజీలో వ్యవసాయ టిప్పింగ్ ట్రైలర్‌లను డెవలప్ చేయడం మొదలుపెట్టాడు.
అందుకోసం రెండో ప్రపంచ యద్ధం నాటి స్క్రాప్‌ని వాడుకున్నాడు. అలా తయారుచేసిన మొదటి టిప్పింగ్ ట్రైలర్‌ను అదే టౌన్లో ఉన్న మార్కెట్‌లో 45 డాలర్లకు అమ్మాడు. ఆ తర్వాత వారం రోజుల్లో మరో ట్రైలర్ రెడీ చేశాడు. దాన్ని కూడా 45 డాలర్లకు అమ్మాడు. దాంతో అలాంటి ట్రైలర్లకు డిమాండ్ ఉందనే విషయం అర్థమైంది. దాంతో భారీగా ప్రొడక్షన్ మొదలుపెట్టాడు. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు అతనికి. 1947 నాటికి కంపెనీ తయారుచేసే అన్ని వస్తువులకు మంచి పేరొచ్చింది.
క్వాలిటీకి మారుపేరుగా నిలిచాయి. దాంతో కంపెనీ ఫుల్‌టైం ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. ఆ తర్వాత1949లో ‘జేసీబీ మేజర్ లోడర్’ పేరుతో ఒక లోడర్ని తీసుకొచ్చింది. ఇది వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఈ లోడర్ ఇచ్చిన సక్సెస్‌తో ‘ఎంకే 1’ పేరుతో ఎక్స్‌కవేటర్‌ని తీసుకొచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న ఎక్స్‌కవేటర్లకు కూడా ఇదే ఇన్స్పిరేషన్.
మొదటి కంపెనీ
ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చి బాగా డెవలప్ అయిన కంపెనీల లిస్ట్‌లో జేసీబీ మొదటి వరుసలో ఉంది. యుద్ధం వల్ల కలిగిన నష్టాల నుంచి కోలుకుంటున్న ఇంగ్లాండ్ అగ్రికల్చర్ మార్కెట్‌ను జేసీబీ స్వాధీనం చేసుకుంది. 1948 నుంచి తీసుకొచ్చిన ‘హైడ్రాలిక్స్’ వల్ల కంపెనీకి బాగా పేరొచ్చింది. యూరప్‌లో హైడ్రాలిక్ లోడర్‌ను తీసుకొచ్చిన మొదటి కంపెనీ ఇది. ఈ లోడర్కి రకరకాల అటాచ్‌మెంట్స్ చేసుకునేలా తయారుచేశారు. అందుకే అంతలా సక్సెస్ అయ్యింది. అంతేకాదు.. జేసీబీ ఎంకే1లో హైడ్రాలిక్ రియర్ ఎక్స్‌కవేటర్, ముందు మౌంటెడ్ లేయర్ ఉన్నాయి. ఇలా రెండు పనులు చేసే ఒకే మెషిన్ని తయారుచేయడం అదే మొదటిసారి. దాంతో వాటికి బాగా గిరాకీ పెరిగింది. అప్పుడే ఎక్స్‌పోర్ట్స్ కూడా మొదలుపెట్టడడంతో జేసీబీ ‘లోగో’- ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. -
మ్యాన్ పవర్ తగ్గింది
జేసీబీ తీసుకొచ్చిన బ్యాక్‌హో వల్ల1960ల నాటికి వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో కార్మికుల సంఖ్య తగ్గింది. చాలా పనులకు జేసీబీలను వాడడం మొదలైంది. ఆ సక్సెస్‌తో కంపెనీని విస్తరించారు. వాస్తవానికి అందరూ జేసీబీ కేవలం నిర్మాణ, వ్యవసాయ రంగ ఉత్పత్తులు మాత్రమే తయారుచేస్తుంది అనుకుంటారు. కానీ.. ఈ కంపెనీ 1961లోనే ఏవియేషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. కంపెనీ మొట్టమొదటి విమానం ట్విన్ ఇంజిన్ ‘డి హావిలాండ్ డోవ్’ని తీసుకొచ్చింది. ఇప్పుడున్న ఎన్నో ఏవియేషన్ కంపెనీల కంటే జేసీబీ చాలా పాత కంపెనీ.
ఈ కంపెనీ విమానరంగంలో కూడా సక్సెస్ కావడంతో 1962లో మొదటిసారిగా హాలాండ్ దేశంలో అమ్మకాలు మొదలుపెట్టింది.1964లో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అప్పుడే కంపెనీ మొదటిసారిగా అమెరికాకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది.1969లో జేసీబీ రికార్డు స్థాయిలో 4,500 మెషిన్లను ఉత్పత్తి చేసింది. వాటిలో సగానికి పైగా ఎగుమతి చేసింది. 1971 –1973 మధ్య టర్నోవర్ రెండింతలు పెరిగింది. ఆ తర్వాత 1979లో ఇండియాలో తయారీని ప్లాంట్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం జేసీబీకి న్యూ ఢిల్లీ, పూనే, జైపూర్‌లలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. యూకే తర్వాత జేసీబీకి అతిపెద్ద మార్కెట్ ఇప్పటికీ ఇండియాలోనే ఉంది.
కొత్త రంగాల్లోకి...
1990 నాటికి జేసీబీ ఫాస్ట్‌ట్రాక్ ట్రాక్టర్‌ను ప్రారంభించడంతో మరో కొత్త రంగంలోకి ప్రవేశించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హై-స్పీడ్, ఫుల్ సస్పెన్షన్ ట్రాక్టర్. దీన్ని డెవలప్ చేయడానికి కంపెనీ 12 మిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. అప్పట్లో దీని సేల్స్ చాలా బాగా జరిగాయి. ఇలా కంపెనీ సక్సెస్‌కి ఎన్నో రకాలుగా కారణమైన జోసెఫ్ సిరిల్ బామ్‌ఫోర్డ్ 2001 మార్చి1న చనిపోయాడు. అప్పటినుంచి కంపెనీని అతని వారసులే నడుపుతున్నారు.
సక్సెస్‌కు కేరాఫ్
ఒక చిన్న షెడ్డులో వ్యవసాయ టిప్పింగ్ ట్రైలర్‌ల తయారీతో మొదలైన కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు ఎగుమతులు చేస్తోంది. కంపెనీకి నాలుగు ఖండాల్లో 22 ప్లాంట్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా డీలర్లు ఉన్నారు. దాదాపు 50 ఏండ్లుగా వరల్డ్ ఫేమస్ బ్రాండ్‌గా ఉంది. ముఖ్యంగా ఇండియాతో కంపెనీకి మంచి అనుబంధం ఉంది. నాలుగు దశాబ్దాల క్రితం భారతదేశంలోకి అడుగుపెట్టిన కంపెనీ ‘బ్యాక్‌హో, లోడర్ల’ను పరిచయం చేసింది. కంపెనీకి ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ మనదేశంలో ఉంది. ప్రస్తుతం కంపెనీ ట్రాక్డ్ ఎక్స్‌కవేటర్లు, వీల్డ్ లోడర్లు, స్కిడ్ స్టీర్ లోడర్‌లు, టెలిహ్యాండ్లర్‌లు, డీజిల్ జనరేటర్లు, డీజిల్ ఇంజన్ మెషిన్లు తయారుచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా150 దేశాల్లో అమ్మకాలు చేస్తోంది.
సక్సెస్‌కు కారణాలివి...
కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్నొవేషన్లకు ప్రాధాన్యం ఇస్తుంది. జోసెఫ్ మొదటి నుండి పరికరాలను తయారుచేయడంలో కొత్త, మెరుగైన మార్గాలను వెతికేవాడు. అందుకే తక్కువ ఖర్చుతో క్వాలిటీ పరికరాలను తయారుచేయగలిగేవాళ్లు. కంపెనీ ఇప్పటికీ ఆ స్ఫూర్తితోనే నడుస్తోంది. అంతేకాకుండా కంపెనీ తన ప్రొడక్ట్స్‌ని ఇంకా బెటర్ చేయడానికి ఎప్పుడూ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది. ఉదాహరణకు.. ఫ్యుయెల్ వాడకం తగ్గించేందుకు ఈ మధ్య హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని కూడా డెవలప్ చేసింది ఈ కంపెనీ.
సేఫ్టీ విషయంలో జేసీబీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఉపయోగించే వాళ్ల సేఫ్టీ కోసం కొత్త మార్గాలను కనుగొనడానికి చాలా ఖర్చు చేస్తుంది. ఉదాహరణకు.. నిర్మాణ ప్రదేశాల్లో జరిగే యాక్సిడెంట్స్ తగ్గించడానికి ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్స్ డెవలప్ చేసింది. అంతేకాదు.. కంపెనీ వెహికల్స్ సరిగ్గా ఆపరేట్ చేసేందుకు కస్టమర్లకు ట్రైనింగ్, సపోర్ట్ కూడా ఇస్తోంది.
కంపెనీ తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ సక్సెస్ అయ్యాయని అంతటితో ఆగలేదు. పోర్ట్‌ఫోలియో
డైవర్సిటీని పాటించింది. వెహికల్స్ తయారీతోపాటు పవర్ సొల్యూషన్స్, వ్యవసాయ పరికరాలు, రీసైక్లింగ్ టూల్స్.. ఇలా అనేక రకాల ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేసింది. ఈ డైవర్సిఫికేషన్ కంపెనీ కొత్త మార్కెట్లలోకి అడుగులు వేసేలా చేసింది. దాంతో ఆదాయ మార్గాలు పెరిగాయి.
వెహికల్స్ తయారీలో కార్మికులు ఇబ్బంది పడకుండా, ప్రొడక్షన్ వేగంగా జరిగేలా ఎప్పటికప్పుడు సౌకర్యాలు కల్పిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక మాన్యుఫాక్చరింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ఉదాహరణకు, యూకేలోని స్టాన్ఫోర్డ్షైర్లోని జేసీబీ ఫ్యాక్టరీలో త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్ లాంటి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు.
క్వాలిటీ విషయంలో కంపెనీ ఎప్పుడూ రాజీపడలేదు. కఠినమైన క్వాలిటీ కంట్రోల్ విధానాలను పాటిస్తుంది. జేసీబీ ప్రొడక్ట్స్ ఛాలెంజింగ్ కండిషన్స్‌ని కూడా తట్టుకుని పనిచేస్తాయి. సేవలో కూడా ముందే. ఈ సంస్థ అనేక స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఉదాహరణకు.. జేసీబీ కంపెనీ ఉన్న దేశాల్లో స్కూల్స్, హెల్త్ క్లినిక్స్ కట్టించింది. ఎన్విరాన్మెంట్ సేఫ్టీ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది.
ఇన్నొవేషన్ మైల్‌స్టోన్స్
1949: జేసీబీ మేజర్ లోడర్ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 1952: ఎంకే1 ఎక్స్‌కవేటర్‌తో జేసీబీ బ్యాక్‌హో లోడర్ని తెచ్చింది. 1963 : జేసీబీ 3సీ బ్యాక్‌హో పర్ఫార్మెన్స్ని పెంచారు. 1964 : జేసీబీ7 అనే మొదటి క్రాలర్ ఎక్స్‌కవేటర్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1971 : జేసీబీ 110 హైడ్రోస్టాటిక్ క్రాలర్ లోడర్ ఇన్నొవేషన్. 1977: జేసీబీ 520 టెలిస్కోపిక్ హ్యాండ్లర్. 1980: జేసీబీ3సీఎక్స్.. ఒకే వెహికల్తో రెండు రకాల పనులు చేసుకోవచ్చు.
1990: జేసీబీ ఫాస్ట్‌ట్రాక్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుల్ సస్పెండెడ్, హై-స్పీడ్ డ్రాఫ్ట్ ట్రాక్టర్. 1993: జేసీబీ రోబోట్ స్కిడ్ స్టీర్ లోడర్.. ప్రపంచంలోనే అత్యంత సేఫ్టీ స్కిడ్ స్టీర్. 1997: జేసీబీ టెలీట్రక్. 2006: జేసీబీ 444 డీజిల్ ఇంజిన్లు. 2010: జేసీబీ ఎకో మెషిన్లు.. మెషిన్ కెపాసిటీని, ప్రొడక్షన్‌ని పెంచాయి.
ఒకే ఏడాదిలో లక్ష
జేసీబీ1985లో 3సీఎక్స్ సైట్‌మాస్టర్ బ్యాక్‌హో లోడర్ని మార్కెట్లోకి తెచ్చింది. కంపెనీ తెచ్చిన బ్యాహోల్లో అత్యధికంగా అమ్ముడైంది ఇదే. అంతేకాదు.. ఒకే ఏడాదిలో లక్ష బ్యాక్‌హోలను ప్రొడ్యూస్ చేసింది కంపెనీ. ఆ సక్సెస్‌ని చూసిన బ్రిటన్ మొదటి మహిళా ప్రధాన మంత్రి మార్గరెట్ థాచర్ 1987లో జేసీబీ కంపెనీకి వెళ్లింది కూడా.
ఎక్స్‌కవేటర్లు– ఇవి నిర్మాణ రంగంలో, పొలాల్లో రకరకాల పనులు చేస్తుండటం చూసే ఉంటారు. కానీ వాటిని ఎక్స్‌కవేటర్లు అంటారనే విషయం చాలామందికి తెలియదు. వీటిని ‘జేసీబీ’ అనే పిలుస్తుంటారు. వాస్తవానికి జేసీబీ అంటే ఎక్స్‌కవేటర్లు తయారుచేసే కంపెనీ పేరు. అదే ఆ కంపెనీ యజమాని పేరు కూడా.
ఒక పొలంలో చిన్న గ్యారేజీలో మొదలైన జేసీబీ చెక్కర్లు కొడుతూ.. 150 దేశాలకు ట్రావెల్ చేసింది.