- సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ
- సోషల్ మీడియాలో గంటల తరబడి గడపవద్దని సూచన
- వరంగల్ జిల్లా గురజాలలో కాళోజీ గ్రంథాలయం ప్రారంభం
నర్సంపేట, వెలుగు : సోషల్ మీడియాలో గంటల తరబడి కాలయాపన చేయడం కన్నా పాఠశాల స్థాయి నుంచే నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకై శ్రమించాలని విద్యార్థులకు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామంలో హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జేడీ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన కాళోజీ గ్రంధాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యాలయం, దేవాలయం, గ్రంధాలయం మాత్రమే ఆలయాలుగా చరిత్రలో గుర్తింపు పొందాయని అన్నారు.
గ్రంథాలయంలో రోజూ రెండు గంటల పాటు పుస్తకాలను చదవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు. అంబేద్కర్, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద జీవితాలే ఇందుకు నిదర్శనమన్నారు. తల్లిదండ్రులు శభాష్ అనేలా, మనం చదువుకున్న పాఠశాలకు ముఖ్య అతిథిగా ఏదో ఒకరోజు హాజరయ్యేలా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆయన హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు వేములపల్లి రాజు, జేడీ ఫౌండేషన్ కన్వీనర్ కవితా రెడ్డి, కన్జ్యూమర్ కౌన్సిల్ స్టేట్ వైస్ చైర్మన్ బూరుగుపల్లి శ్రవణ్ కుమార్, జిల్లా కార్యదర్శులు సత్యనారాయణ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు
ఓటు హక్కు వినియోగంతో ప్రజాస్వామ్యం బలోపేతం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారానే బలమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. కన్జ్యూమర్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సాధారణ ఓటు హక్కు ఆవశ్యకతపై ఓటర్లను చైతన్యపరుస్తూ రూపొందించిన పాంఫెట్లను కన్జ్యూమర్స్ కౌన్సిల్, జేడీ ఫౌండేషన్
హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు వినియోగదారుల మండలి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. తన వంతుగా ట్విటర్ లో ఈ కరపత్రాలను షేర్ చేస్తానని ఆయన తెలిపారు.