అక్షర్ ధామ్ ఆలయాన్ని దర్శించుకున్న వాన్స్ ఫ్యామిలీ

అక్షర్ ధామ్ ఆలయాన్ని దర్శించుకున్న వాన్స్ ఫ్యామిలీ
  • నాలుగు రోజులు భారత్​లో అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన
  • యూఎస్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై మోదీతో భేటీ
  • ట్రంప్  టారిఫ్  వార్  నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న పర్యటన

న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్  సోమవారం భారత్ కు చేరుకున్నారు. తన భార్య ఉషా చిలుకూరి వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి వాన్స్   ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టారు. అధికారులతో కలిసి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. వాన్స్ కుటుంబానికి  ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు వాన్స్  మన దేశంలో పర్యటించనున్నారు. భారత్ లో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటిసారి. ఢిల్లీలోని అక్షర్ ధామ్  యాత్రతో ఆయన తన పర్యటనను ప్రారంభించారు. ఉష, పిల్లలు ఇవాన్, వివేక్, మిరబెల్ తో కలిసి స్వామినారాయణ్  అక్షర్ ధామ్  ఆలయాన్ని వాన్స్  సందర్శించారు. ఎంతో సుందరంగా చెక్కిన గజేంద్ర పీఠాన్ని చూసి ఆయన మంత్రముగ్ధులయ్యారు. 

ఈ సందర్భంగా అధికారులు వాన్స్  దంపతులకు ఆలయ విశేషాల గురించి వివరించారు. టెంపుల్  పరిసరాలను మొత్తం చూపించారు. ‘‘నన్ను, నా ఫ్యామిలీని ఇంత అందమైన చోటుకు ఎంతో సాదరంగా ఆహ్వానించారు. మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు. స్వామినారాయణ్  అక్షర్ ధామ్  ఆలయాన్ని ఎంతో అందంగా, కచ్చితత్వంతో నిర్మించారు. మా పిల్లలు ఈ ఆలయాన్ని ఎంతో ఇష్టపడ్డారు. దేవుడు మా పిల్లలను దీవించుగాక” అని టెంపుల్  గెస్ట్ బుక్ లో వాన్స్  రాశారు. ఆలయంలో తనకు ఎంతో మన:శాంతి దొరికిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వాన్స్  దంపతులకు చెక్కతో చేసిన ఏనుగు బొమ్మ, ఆలయ నమూనా, పిల్లలకు పుస్తకాలను గిఫ్ట్ గా ఇచ్చారు. వాన్స్  కుటుంబం ఆలయ సందర్శనపై అధికారులు ‘ఎక్స్’ లో పోస్టు చేశారు.అనార్కలీ సూట్, కుర్తా పైజామాలో వాన్స్  పిల్లలు వాన్స్  పిల్లలు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇవాన్, వివేక్  కుర్తా పైజామా.. మిరబెల్  అనార్కలీ సూట్  ధరించారు. ఆలయాన్ని దర్శించిన తర్వాత వారు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్​గా మారాయి.

ప్రధాని నరేంద్ర మోదీతో వాన్స్  భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్  భేటీ అయ్యారు. అమెరికా, భారత్  ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారిద్దరూ చర్చించారు. ప్రాంతీయ అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపైనా మాట్లాడుకున్నారు. కాగా.. భారత్​తో పాటు పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో వాన్స్​ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ట్రంప్ టారిఫ్​లపైనా ప్రముఖంగా చర్చించారు. రెండు దేశాల మధ్య ట్రేడ్  డీల్ ను వేగవంతం చేయడంపై ప్రముఖంగా దృష్టి పెడుతున్నారు. ఈ చర్చల్లో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా 
సలహాదారు అజిత్  దోవల్  కూడా పాల్గొన్నారు.