జడ్చర్ల టౌన్/నవాబుపేట, వెలుగు: నిరుపేద విద్యార్థులందరికీ అండగా ఉంటానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి తెలిపారు. బుధవారం జడ్చర్ల పట్టణంలోని బాలుర, బాలికల జూనియర్ కాలేజీలతో పాటు నవాబుపేట మండలం యన్మన్గండ్ల జూనియర్ కాలేజీలో తన సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయని స్టూడెంట్స్ అంతా శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని 1,300 మంది విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేంత వరకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
నిరుపేద విద్యార్థులు వారి కుటుంబ పరిస్థితులు సరిగా లేక మధ్యాహ్న భోజనం తెచ్చుకోకుండా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కాలేజీల డెవలప్మెంట్ కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని గవర్నమెంట్ కాలేజీల్లో చదువుతున్న 100 మందిని ఎంపిక చేసి వారి ఉన్నత చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు. ఫర్నిచర్ సమకూరుస్తానని హామీ ఇచ్చారు.