కేసీఆర్ కాలు పెట్టిన తర్వాత కర్ణాటకలో కుమారస్వామి పార్టీ జేడీఎస్ కు గతం కంటే సగం సీట్లు పడిపోయాయని ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు ఇంకా ఆరు నెలలే టైం ఉందని..ఆ తర్వాత బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ మాటల గారడిలో పడి రెండు సార్లు అధికారాన్ని కట్టమెట్టామని..కానీ ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, అహంకారం, చిత్తశుద్ధి తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు.
90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల గేట్లకు రంగేసి తామే పూర్తి చేసామని చెప్పటం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ కుటుంబం కోసమే లక్ష కట్లు పెట్టి కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. చట్ట విరుద్దంగా సోమేశ్ కుమార్ లాంటి వ్యక్తులకు దొడ్డిదారిన సంతకాలు పెట్టే పదవులిచ్చావని మండిపడ్డారు. ఇలాంటి రాష్ట్రం కోసమా అమరవీరులు ఆత్మబలిదానం చేసుకున్నది అని ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తిలో సేవ్ వనపర్తి పేరుతో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.
ఎనిదేండ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ. 18 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని... ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని పొంగులేటి మండిపడ్డారు. ప్రతి గింజా కొంటామన్న కేసీఆర్... వర్షంలో ధాన్యం కొట్టుకుపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. క్యాప్సికంతో రూ. 10 కోట్లు లాభమొచ్చిందన్న కేసీఆర్,,, వ్యవసాయ శాఖ మంత్రి ఎంత మంది రైతులను చైతన్యవంతుల్ని చేశారని నిలదీశారు. రైతులకు మాయమాటలు చెప్పి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ కలలుకంటున్నారని విమర్శించారు.
రుణమాఫీ చేయకపోవటం వల్ల బ్యాంకులు రైతులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. అక్రమంగా సంపాదించిన వేల కోట్లతో ప్రధానమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారని..అది జరిగే పనికాదన్నారు. కేసీఆర్ కు ప్రజలు సరైన సమయంలో బుద్ది చెప్తారన్నారు. తాను ఏ పార్టీ లో చేరతామన్నది ఇంకా ఫైనల్ కాలేదని...త్వరలోనే ఏ పార్టీలో చేరే విషయాన్ని వెల్లడిస్తామన్నారు.