నితీశ్​ ఎటు పోతున్నట్టు?

పాలిటిక్స్​లో వేసే ఎత్తులు ప్రతిసారీ పైఎత్తులు కాలేవు. జనతాదళ్​(యునైటెడ్​) బాస్​, బీహార్​ బిగ్​బాస్​ నితీశ్​ కుమార్​కి ఈ విషయం ఇటీవలి లోక్​సభ ఎలక్షన్​లో తెలిసొచ్చింది. ఎన్​డీఏని లీడ్​ చేస్తున్న బీజేపీకి తక్కువ సీట్లొచ్చి, తన పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిస్తే కమలదళాన్ని ఇరుకున పెట్టొచ్చని ఆయన భావించారు. కానీ.. అనుకున్నదొకటి అయిందొకటి. దీంతో ఆ కూటమిలో నితీశ్​కి ప్రత్యేక గుర్తింపు దొరికేలా లేదు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే ఐదేళ్లలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి

లోక్​సభ ఎన్నికల ఫలితాలు రాకముందే ఎన్​డీఏ కూటమిపై మిత్రపక్షం జేడీ(యూ) బాంబు పేల్చిన విషయం తెలిసిందే. జాతిపిత మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథురాం గాడ్సేని దేశభక్తుడన్న బీజేపీ భోపాల్​ అభ్యర్థి సాథ్వీ ప్రజ్ఞాసింగ్​ ఠాకూర్​​పై తక్షణం చర్య తీసుకోకపోవటాన్ని బీహార్​ సీఎం నితీశ్​కుమార్​ నాయకత్వంలోని ఆ పార్టీ ప్రశ్నించింది. అంతేకాదు. సాధారణ ఎన్నికల్లో అసాధారణ విజయాన్ని సొంతం చేసుకొని కేంద్రంలో రెండోసారి కొలువుదీరిన మోడీ కేబినెట్​లో తమకు సింగిల్​ బెర్తే ఇవ్వటంతో సింపుల్​గా వద్దని చెప్పింది.

రెండు వారాల వ్యవధిలో జరిగిన ఈ రెండు సంఘటనలు బీజేపీ సారథ్యంలోని ఎన్​డీఏ కూటమి​కి, అందులోని ఒక భాగస్వామి​ అయిన జేడీ(యూ)కి మధ్య నెలకొన్న తాజా సంబంధాలకు అద్దం పడుతున్నాయి. మోడీ మంత్రివర్గంలో చేరకపోయినా ఎన్​డీఏలోనే కొనసాగుతామని చెబుతూనే అలయెన్స్​లోని పార్ట్నర్ పార్టీల ప్రాధాన్యతల ప్రకారం కేబినెట్​లో చోటు కల్పిస్తే బాగుండేదని జేడీ(యూ) చీఫ్​ నితీశ్​కుమార్ నిన్న గాక మొన్నే అన్నారు. పైకి ఇలా అభిప్రాయపడ్డా లోపల అసంతృప్తే ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.

ఆ అసంతృప్తి ఇప్పటిది కాదు

బీహార్​ రాజకీయాల్లో లాలూ ప్రసాద్​ యాదవ్​ తర్వాత అంతటి పాపులారిటీ గల నితీశ్​కుమార్​లో బీజేపీ పట్ల (ముఖ్యంగా మోడీపై) ఈ అసంతృప్తి ఇప్పటిదికాదు. 2014 లోక్​సభ ఎన్నికలకు ముందు గుజరాత్​ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీని కమలనాథులు ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. దీన్ని నితీశ్​ వ్యతిరేకించారు. అయినా ఆ పార్టీ లెక్కచేయలేదు. ఎన్​డీఏని ముందుండి నడిపిస్తున్న బీజేపీ ఈ విషయంలో తన మాటకు విలువ ఇవ్వలేదని నొచ్చుకున్న నితీశ్​ అప్పుడే ఆ కూటమి నుంచి బయటకు వచ్చేశారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 40 సెగ్మెంట్లలో బీజేపీ 22 సీట్లు పొందగా జేడీ(యూ) 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎన్నికల్లో పార్టీ పూర్​ పెర్ఫార్మెన్స్​కి బాధ్యత వహిస్తూ నితీశ్​ ముఖ్యమంత్రి పదవికి​ రాజీనామా చేశారు. 2015 నవంబర్​లో అసెంబ్లీ ఎలక్షన్​ నేపథ్యంలో ఏడాది తిరక్కముందే సీఎం పీఠమెక్కి మహాకూటమి కట్టారు. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయంతో బీజేపీ హవాను విజయవంతంగా అడ్డుకున్నారు. ఎన్​డీఏతో దోస్తీ వద్దనుకున్నందుకు నితీశ్​ ఒకసారి​ తీవ్రంగా నష్టపోగా మరోసారి భారీ లాభం పొందారు.

రాజకీయ ఎత్తులు ఒక్కోసారి చిత్తవుతాయని, ఒక్కోసారి పైఎత్తులు అవుతాయని చెప్పటానికి ఏడాది వ్యవధిలో నితీశ్​ పొందిన ఓటమి, గెలుపులే ఉదాహరణ. అనంతరం ఎన్​డీఏలో చేరిన ఆయన 2019 లోక్​సభ ఎన్నికల విషయంలోనూ ఇదే మాదిరిగా వ్యవహరించారు. ఈ కూటమికి పార్లమెంట్​ దిగువ సభలో పూర్తి మెజారిటీ రాకపోవచ్చని, అదే సమయంలో బీహార్​లో జేడీ(యూ)కి బ్రహ్మాండమైన ఆధిక్యం వస్తుందని అనుకున్నారు. ఇదే జరిగితే కేంద్రంలో తన పార్టీ చక్రం తిప్పుతుందని, మోడీకి తానే కీలకం కావొచ్చని ఊహించారు.

తొందరపడి..

లోక్​సభ ఎన్నికల చివరి దశ పోలింగ్​లో (మే 19న) ఓటు హక్కు వినియోగించుకున్న బీహార్​ సీఎం.. ఎగ్జిట్​ పోల్స్​ వెల్లడికాకముందే బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేత, భోపాల్​ క్యాండిడేట్​ సాథ్వీ ప్రజ్ఞాసింగ్​ ఠాకూర్ వ్యాఖ్యలను సాకుగా చూపి కమలనాథులపై విరుచుకుపడ్డారు. ఆమెను బీజేపీ బహిష్కరించాలని డిమాండ్​ చేశారు. ఇలాంటివాటిని తాము సహించబోమని చెప్పుకొచ్చారు. గాడ్సే దేశ భక్తుడు అనటాన్ని ప్రజలు ఏమాత్రం మెచ్చరని అన్నారు.

అసలు విషయం ఏంటంటే ప్రజ్ఞాసింగ్ ఆ కామెంట్లు చేసి అప్పటికి రెండు రోజులైంది. సాథ్వీపై ఇమ్మిడియెట్​గా యాక్షన్​ తీసుకోకపోవటాన్ని తప్పుపట్టిన జేడీ(యూ) అధినేత కూడా ఆమె వ్యాఖ్యలను తక్షణం ఖండించకుండా రెండు రోజుల వరకు వేచిచూడటం గమనార్హం. లోక్​సభ ఎన్నికలను ఏడు విడతలుగా ఎండాకాలంలో నిర్వహించటం సరికాదని కూడా నితీశ్ విమర్శించారు. రెండు మూడు దఫాల్లో ఎలక్షన్​ పూర్తి చేసే విషయంలో దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగడతానని చెప్పారు.

మనోడా? పరాయోడా?

అప్పటికే వివిధ అంశాలపై ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం తీరును ఖండిస్తున్నారు. అలాంటి సమయంలో అధికార పక్షంలోనే ఉన్న జేడీ(యూ) సుప్రీం నితీశ్​ అపొజిషన్​ లీడర్​లా స్పందించటం బీజేపీకి కాస్త ఇబ్బంది అనిపించింది. ఎన్నికల్లో కమలదళానికి ఎక్కువ సీట్లు రాకపోతే భవిష్యత్​లో కూడా ఇలాగే రెబల్​లా రియాక్ట్​ కావాలని బీహార్​ సీఎం నిర్ణయించుకున్నట్లు అనిపించింది. దీంతో ఆయన ఎన్​డీఏకి ఫ్రెండ్​ కాదని, ఎనిమీలా తయారవుతున్నాడని కూటమిలోని ఇతర పార్టీలు మరోసారి భావించటానికి నితీశ్​ కారణమయ్యారు.

మోడీపై వ్యతిరేకతతో ఎన్​డీఏ నుంచి బయటకెళ్లిన నితీశ్​ మళ్లీ ఆయన చెంతకే చేరటంతో ప్రజల్లో రాజకీయంగా నమ్మకం కోల్పోయారు. సెక్యులర్​, సోషలిస్ట్​ లీడర్​ అనే గుర్తింపూ దూరమైంది. ఎన్​డీఏతో 1996లోనే జట్టు కట్టిన జేడీ(యూ) సందర్భాన్ని బట్టి బీజేపీతో విభేదిస్తూనే ఉంది. ఆర్టికల్​–370, యూనిఫాం సివిల్​ కోడ్​, రామ మందిర వంటి అంశాలను కమలం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడాన్ని తప్పుపట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్​ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భవిష్యత్​లో ఎలా ముందుకు పోతుందనే ఆసక్తి నెలకొంది.

– ‘ది వైర్​’ సౌజన్యంతో