
- బీజేపీకి జేడీయూ, ఎల్జేపీ డిమాండ్
- కులగణన చేపట్టాలని, యూసీసీపై అందరి అభిప్రాయాలూ తీసుకోవాలి
- నీతి ఆయోగ్‌ను సరిదిద్దాలని, బిహార్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని మిత్రపక్షాల విజ్ఞప్తులు
న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమి పక్షాల నుంచి బీజేపీకి అప్పుడే డిమాండ్లు ఎదురవుతున్నాయి. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను సమీక్షించాలని నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ డిమాండ్ చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీంపై యువత, నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉందని.. లోక్‌సభ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించిందన్నారు. ‘‘అగ్నిపథ్ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు సాయుధ దళాల నుంచే అసంతృప్తి వ్యక్తమైంది. ఎన్నికల సమయంలో వారి కుటుంబాలు కూడా నిరసన తెలిపాయి.
ఆ స్కీమ్ పై రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. కేంద్రం 2022లో అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో నాలుగేండ్ల అగ్రిమెంట్‌తో సిబ్బందిని నియమిస్తారు. ఏడాది మొత్తం రిక్రూట్ అయిన వారిలో 25 శాతం మందిని మాత్రమే కొనసాగేందుకు అనుమతిస్తారు. మిగతా 75 శాతం మందిని తొలగిస్తారు. ఈ స్కీం పై యూపీ, బీహార్ లో భారీ నిరసనలు జరిగాయి. అయితే, బీజేపీ విధానమైన ‘ఒక దేశం.. ఒక ఎన్నిక’ కు మాత్రం జేడీయూ అనుకూలంగా ఉందని త్యాగి చెప్పారు. బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) హామీపై ఆయన మాట్లాడుతూ.. యూసీసీపై భాగస్వామ్య పక్షాలన్నింటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
బిహార్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి..
కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని ఎన్డీఏ మిత్రపక్షం ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. అలాగే అగ్నిపథ్ స్కీమ్ ద్వారా దేశంలోని యువతకు ఏం ఇస్తున్నామనే విషయంపై కూడా సమీక్షించాలని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, ఆ తర్వాత దీనిపై చర్చిస్తామన్నారు. గురువారం చిరాగ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
దేశవ్యాప్త కుల గణనకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. గతంలో ప్రణాళికా సంఘం అమలులో ఉన్న సమయంలో పెద్దగా ఇబ్బందులు లేవని, నీతి ఆయోగ్ వచ్చాక పరిస్థితులు మారాయన్నారు. అందుకే దానిని కూడా పరిశీలించి సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా తాము బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజీని కోరుకోవడం లేదని ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు.