![జేఈఈ మెయిన్స్ లో 14 మందికి 100 పర్సంటైల్.. తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కొక్కరికి..](https://static.v6velugu.com/uploads/2025/02/jee-main-results-telangana-student-among-14-with-perfect-100_Rt1XW5dK00.jpg)
- దేశవ్యాప్తంగా 14 మందికి 100 పర్సంటైల్
- తెలంగాణ టాపర్ గా బణి బ్రత మాజి
- సెషన్ 1 ఫలితాలు రిలీజ్ చేసిన ఎన్టీఏ
హైదరాబాద్, వెలుగు: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్-–1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. తెలంగాణ నుంచి బణి బ్రత మాజి 100 పర్సంటైల్ సాధించి స్టేట్ టాపర్ గా నిలిచాడు. ఏపీకి చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించి స్టేట్‌టాపర్‌గా నిలవడంతో పాటు విమెన్ కేటగిరీలో ఆలిండియా టాపర్‌గా నిలిచింది.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీకి చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99.99% స్కోర్‌తో ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. దేశవ్యాప్తంగా 304 సిటీల్లోని 618 పరీక్షా కేంద్రాల్లో జనవరి 22,23,24,28,29 తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్ 1 ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 13,11,544 మంది అప్లై చేసుకోగా.. 12,58,136 (95.93%) మంది హాజరయ్యారు.
తెలంగాణ, ఏపీ నుంచి దాదాపు 2 లక్షల మంది పరీక్ష రాశారు. పరీక్షలు రాసిన వారిలో ఎస్సీలు 1.22 లక్షలు, ఎస్టీలు 39,959 మంది, ఓబీసీలు 4.90 లక్షలు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1.38 లక్షల మంది ఉండగా.. 4.66 లక్షల మంది జనరల్ విద్యార్థులు ఉన్నారు. కాగా, ప్రస్తుతం జేఈఈ మెయిన్ సెషన్ 2 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెల 24 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
వెబ్ సైట్ లో ఫలితాలు..
సెషన్ 1 ఎగ్జామ్స్ ఫైనల్కీని సోమవారం రిలీజ్ చేసిన ఎన్టీఏ.. మంగళవారం ఫలితాలను విడుదల చేసింది. jeemain.nta.nic.in వెబ్ సైట్లో ఫలితాలను పెట్టింది. మెయిన్ స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 39 మంది విద్యార్థుల ఫలితాలను వివిధ కారణాలతో రిలీజ్ చేయలేదని ఎన్టీఏ ప్రకటించింది.
కాగా, మెయిన్ 1లో వివిధ షిఫ్టుల్లో ఆరు క్వశ్చన్లను తొలగించగా.. వాటికి మార్కులు యాడ్ చేశారు. జేఈఈ మెయిన్స్ రెండు సెషన్లలో వచ్చే మెరిట్ స్కోర్ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు
ఎంపిక చేయనున్నారు.