హైదరాబాద్, వెలుగు: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా ఏడుగురు స్టూడెంట్లు వంద పర్సంటైల్ సాధించారు. మంగళవారం జేఈఈ మెయిన్1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా 23 మంది స్టూడెంట్లు 300 మార్కులకు 300 మార్కులు సాధించి వంద పర్సంటైల్ సాధించారు. దీంట్లో తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ముగ్గురు విద్యార్థులున్నారు.
తెలంగాణ నుంచి రిషీ శేఖర్ శుక్లా, రోహాన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హెచ్ విధిత్, వెంకట సాయితేజ, మోహన్ కల్లూరి, తవ్వ దినేశ్‌రెడ్డి ఉండగా, ఏపీకి చెందిన షేక్ సూరజ్, తోట సాయికార్తీక్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డి ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో తెలంగాణకు చెందిన స్టూడెంట్లు శ్రీసూర్య వర్మ దట్ల (99.9991524), డి. శ్రీనివాసరెడ్డి (99.9991524) నేషనల్ టాపర్లుగా నిలిచారు. ఎస్టీ కేటగిరిలో జగన్నాథం మోహిత్ (99.9991524), పీడబ్ల్యూడీ కేటగిరిలో చుంకికల శ్రీచరణ్ (99.98729) నేషనల్ టాపర్లుగా నిలిచారు. కాగా, త్వరలోనే జనవరి 24న జరిగిన పేపర్ 2(బీఆర్క్) ఫలితాలను త్వరలోనే రిలీజ్ చేస్తామని ఎన్టీఏ తెలిపింది.