న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) మంగళవారం విడుదల చేసింది. టాపర్స్ జాబితాలో తెలంగాణ విద్యార్థి బనిబ్రత మాజీ నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్ వచ్చినట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ కూడా టాపర్స్ జాబితాలో నిలిచింది. టాప్ 14 జాబితాలో గుత్తికొండ సాయి మనోజ్ఞ తప్ప మిగిలిన టాపర్స్ అంతా అబ్బాయిలే కావడం గమనార్హం. ఎస్టీ కేటగిరీలో రాజస్థాన్కు చెందిన పార్థ్ సెహ్రా, పీడబ్ల్యూబీడీ కేటగిరీలో ఛత్తీస్ ఘర్కు చెందిన హర్షల్ గుప్తా జేఈఈ మెయిన్ ఎగ్జామ్లో టాపర్స్గా నిలిచారు.
జనవరి 22 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా 12.58 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్ష రాశారు. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష జరగనుంది. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారనే కారణంగా 39 మంది విద్యార్థుల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించలేదు. ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో ఢిల్లీకి చెందిన దక్ష్, ఎస్సీ కేటగిరీలో ఉత్తరప్రదేశ్కు చెందిన శ్రేయాస్ లోహియా 14 మంది టాపర్స్ జాబితాలో నిలిచారు.
జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాల్లో సత్తా చాటిన టాపర్స్ జాబితా:
* బనిబ్రత మజి-తెలంగాణ
* గుత్తికొండ సాయి మనోజ్ఞ-ఆంధ్రప్రదేశ్
* కుషగ్ర గుప్త-కర్ణాటక
* ఆయుష్ సింఘాల్-రాజస్థాన్
* హర్ష్ ఝా-ఢిల్లీ(NCT)
* దక్ష్-ఢిల్లీ(NCT)
* శ్రేయాస్ లోహియా-ఉత్తర్ ప్రదేశ్
* సాక్షం జిందాల్-రాజస్థాన్
* సౌరవ్-ఉత్తర్ ప్రదేశ్
* రైత్ గుప్తా-రాజస్థాన్
* విషద్ జైన్-మహారాష్ట్ర
* అర్నవ్ సింగ్-రాజస్థాన్
* శివెన్ వికాస్ తోష్నివాల్-గుజరాత్
* ఎస్ఎం ప్రకాష్ బెహెరా-రాజస్థాన్