
- హర్షగుప్తా, అజయ్ రెడ్డి, బనిబ్రతకు 300/300 మార్కులు
- జేఈఈ అడ్వాన్స్డ్కు 2.50 లక్షల మంది ఎంపిక
- 23 నుంచి రిజిస్ట్రేషన్లు.. మే18న ఎగ్జామ్
హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్–2 ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారు. ముగ్గురు స్టూడెంట్లు 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించి.. 100 పర్సంటైల్ పొందారు. వంద పర్సంటైల్ పొందిన వారిలో హర్షగుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మాజీ ఉన్నారు. ఏపీకి చెందిన సాయిమనోజ్ఞ గుత్తికొండ కూడా ఈ ఘనత సాధించింది. జేఈఈ మెయిన్ ఫలితాలను శనివారం అర్ధరాత్రి ఎన్టీఏ రిలీజ్ చేసింది. జనవరి, ఏప్రిల్ నెలల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలకు 15.39 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా.. వారిలో 14.75 లక్షల మంది అటెండ్ అయ్యారు.
జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ 1 పరీక్షలకు 12.58 లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 2 నుంచి 9 వరకు జరిగిన పరీక్షలకు 10.61 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వారిలో 9.92 లక్షల మంది పరీక్షలు రాశారు. కాగా, ఈ రెండు పరీక్షలు రాసిన వారిలో మెరిట్ ఆధారంగా మొత్తం 2,50,236 మందిని జేఈఈ అడ్వాన్స్ డ్ కు ఎంపిక చేశారు.
23 నుంచి అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
ఈ నెల 23 నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. మే 18న దేశవ్యాప్తంగా ఎగ్జామ్ నిర్వహించనున్నారు. దీంట్లోంచి సీట్ల సంఖ్యకు అనుగుణంగా మెరిట్ ఆధారంగా 45 వేల నుంచి 50 వేల మందిని ఎంపిక చేస్తారు. వారందరికీ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర విద్యా సంస్థల్లో బీటెక్, బీఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు లభించనున్నాయి. ప్రస్తుతం ఐఐటీల్లో సుమారు 17,800 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా.. జనరల్, ఓబీసీ కేటగిరీల్లో గతేడాదితో పోలిస్తే కటాఫ్ స్వల్పంగా తగ్గగా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో పెరిగింది.