ఖమ్మం, వెలుగు: జేఈఈ జాతీయ స్థాయి ర్యాంకర్ భుక్యా అపర్ణకు జీఎస్ఆర్ ట్రస్ట్ అధినేత, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డా. గడల శ్రీనివాసరావు రూ.1.64 లక్షల ఆర్థికసాయం అందిస్తానని హామీ ఇచ్చారు. తనికెళ్ల గ్రామానికి చెందిన అపర్ణ భద్రాద్రి జిల్లా ములకలపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో చదివి జేఈఈ మెయిన్స్ లో ఆలిండియా స్థాయిలో 157 ర్యాంకు సాధించింది. దీంతో వరంగల్ నీట్(ఇంజినీరింగ్)లో సీటు సంపాదించింది. అపర్ణ ఇంటర్ పరీక్ష రాస్తున్న సమయంలో అపర్ణ తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. అయినప్పటికీ 901మార్కులు సాధించింది. ఎలాంటి శిక్షణ లేకుండానే జేఈఈలో ర్యాంకు సాధించింది. విషయం తెలుసుకున్న హెల్త్ డైరెక్టర్ నాలుగేండ్ల పాటు ఏడాదికి రూ.41 వేల చొప్పున చెల్లిస్తానని ప్రకటించారు. తొలి ఏడాది కాలేజీ ఫీజు కింద రూ.41వేలు ఆదివారం అందజేశారు. ఇక గ్రామస్తుల అభ్యర్ధన మేరకు తనికెళ్లలో పల్లె దవాఖానా మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
పారదర్శకంగా వడ్లు కొనుగోలు చేయాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టాలని జిల్లా సహకార అధికారి ఎన్ వెంకటేశ్వర్లు సూచించారు. కొత్తగూడెంలోని సహకార సంఘం ఆఫీస్‌లో అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సహకార వ్యవస్థ బలోపేతానికి రైతులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకులకు దీటుగా రైతులకు రుణాలు అందిస్తున్నామని చెప్పారు. జడ్పీ వైస్ చైర్మర్ కంచర్ల చంద్రశేఖర్, ఎంపీపీ బాదావత్ శాంతి, ఏఎంసీ చైర్మన్ భుక్యా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, డీసీసీబీ మేనేజర్ కూచిపూడి జగన్నాథరావు, డైరెక్టర్లు గూగుల్ చందర్, విజయకుమారి, సేవ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, సీఈవో పి సారయ్య, మానిటరింగ్ ఆఫీసర్ కె సందీప్ కుమార్ పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి రూ.10 లక్షల విరాళం
భద్రాచలం, వెలుగు: శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లికి చెందిన తీగల భూంలింగం గౌడ్ ఆదివారం రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. రవికాంత్‌గౌడ్, విజయ్సాత్విక్ గౌడ్ పేరిట నిత్యం అన్నదానం చేయాలని కోరారు. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన ఈవో శివాజీతో భేటీ అయ్యారు. ఆలయ భూముల అన్యాక్రాంతం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు అమరనేని రామారావు, డివిజన్ అధ్యక్షుడు డెక్కా నర్సింహారావు ఉన్నారు.
‘కమీషన్ల కోసమే దళితబంధు’
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రజాప్రతినిధుల కమీషన్ల కోసమే దళితబంధు ఉపయోగపడుతుందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేశ్ ఆరోపించారు. కొత్తగూడెంలోని జిల్లా పార్టీ ఆఫీస్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. దళితబంధు కావాలంటే రూ.2 లక్షలతో పాటు ఆధార్, రేషన్, పాన్‌కార్డులు ఇవ్వాలని కొందరు దళారులు దందా సాగిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం దళితబంధు సెలక్షన్ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల్లో పారదర్శకంగా చేపట్టాలన్నారు. మాలోత్ వీరు నాయక్, నాగుల రవికుమార్, ధనుంజయ్, వంశీ, జగన్ పాల్గొన్నారు.
సంబురంగా వన మహోత్సవం
ఖమ్మం నగరంలో ఆదివారం కమ్మ, కాపు, ముదిరాజ్, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవాలతో సందడి నెలకొంది. మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో ఖమ్మం ధర్నాచౌక్‌లో జనభోజనాల కార్యక్రమం జరిగింది. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఆర్కే చారిటబుల్ ట్రస్ట్ సర్వీస్ సొసైటీ చైర్మన్ కేవీ రంగాకిరణ్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. పరిపూర్ణానంద స్వామి, బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, సత్యనారాయణ పాల్గొన్నారు. శ్రీ సద్గురు సాయి తత్వ జ్ఞాన మందిరం ఆధ్వర్యంలో సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో కోటి దీపోత్సవం నిర్వహించారు. సత్తుపల్లి, అశ్వరావుపేట ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరావు హాజరయ్యారు.
- వెలుగు, నెట్వర్క్
చదువుతోనే మనుగడ
ఖమ్మం, వెలుగు: ఆస్తిపాస్తుల కంటే చదువే విలువైందని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. టీఎన్జీవోస్ ఫంక్షన్ హాలులో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం విద్యా సేవా పురస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలినాలి చేసుకొనే వారు కూడా తమ పిల్లలను కష్టపడి చదివిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం విద్యాపరంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని తెలిపారు. అనంతరం ప్రైవేట్ టీచర్స్ ను సన్మానించి పురస్కారాలు అందజేశారు. రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, టీపీటీపీ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ, ప్రైవేట్ లెక్చరర్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు అంబేద్కర్, నారాయణ స్కూల్స్ ఏజీఎం కోటేశ్వరరావు, ఐఐటీ ప్రొఫెసర్ వంశీకృష్ణ పాల్గొన్నారు.
న్యూజిలాండ్ పర్యటనకు భద్రాద్రి ప్లేయర్
భద్రాచలం, వెలుగు: న్యూజిలాండ్ అండర్–-19 మహిళల క్రికెట్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టుకు భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష ఎంపికైంది. ఆదివారం బీసీసీఐ ప్రకటించిన 15మంది టీమ్‌లో త్రిషకు స్థానం కల్పించారు. జిల్లా స్థాయి క్రికెట్‌కు ఎంపికైన ఆమెను తండ్రి రాంరెడ్డి హైదరాబాద్ తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు.త్రిష ఎంపికైనట్లు తెలుసుకున్న భద్రాచలంలోని క్రికెట్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. మన్యం నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికైన త్రిషకు శుభాకాంక్షలు తెలిపారు.
లైబ్రరీలను డెవలప్ చేస్తున్నాం
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: రాష్ట్రంలో లైబ్రరీలను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న అనేక గ్రంథాలయాలను డెవలప్ చేసి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి రూ.5కే నగరపాలక సంస్థ ద్వారా భోజనం అందిస్తున్నామని చెప్పారు. నగర మేయర్ పూనుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.