రామలింగేశ్వరుడి టెంపుల్ దొంగలు దొరికిన్రు

రామలింగేశ్వరుడి టెంపుల్ దొంగలు దొరికిన్రు
  • 12 గంటల్లో పట్టుకున్న జీడిమెట్ల పోలీసులు 
  • ఎత్తుకుపోయిన ఆభరణాలు స్వాధీనం
  • కఠినంగా శిక్షించాలంటూ భక్తుల ఆందోళన
  • చెదరగొట్టిన పోలీసులు

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ గాంధీనగర్​లోని శ్రీరామలింగేశ్వర, శ్రీఆంజనేస్వామి ఆలయాల్లో సోమవారం తెల్లవారుజామున జరిగిన చోరీ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్​చేశారు. బాలానగర్​డీసీపీ సురేశ్​కుమార్​మంగళవారం ఉదయం వివరాలు వెల్లడించారు. ఓ దొంగ బయట ఉండగా, లోపలకు చెప్పులతో వెళ్లిన మరో దొంగ అక్కడి స్వామివారి ఆభరణాలను, ఇతర వస్తువులను చోరీ చేశాడు. పోలీసులు వెంటనే సీసీఎస్, ఎస్వోటీ , జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో 10 టీమ్స్​ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. 

లంగర్​హౌస్, టోలీచౌకికి చెందిన ఇద్దరు గంజాయి సేవించి ర్యాపిడో బుక్​చేసుకుని, గాంధీనగర్​లోని టెంపుల్​కు వచ్చి చోరీ చేశారని తేలింది. 12 గంటల్లో నిందితులని పట్టుకుని నాగపడిగ, అయ్యప్ప విగ్రహం, అభిషేక పాత్ర, హారతి పల్లెం, దీపాలు, కాపర్ గోబ్లెట్​స్వాధీనం చేసుకున్నారు. వాటిని బాలానగర్​ డీసీపీ, ఏసీపీ, సీఐలు ఆలయంలో అప్పగించారు. తర్వాత అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఇద్దరిలో ఓ నిందితుడు గతంలో రౌడీ షీటర్​ అని, అతడిపై అటెంప్ట్​టు మర్డర్​కేసు ఉంది.  

ముందస్తు అరెస్టులు 

ఆలయాన్ని దొంగలు అపవిత్రం చేశారని, వారిని కఠినంగా శిక్షించాలంటూ కొన్ని హిందూ సంఘాలు సోమవారం ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు తెల్లవారుజామునే బీజేపీ, హిందూవాహిని, భజరంగ్​దళ్​లీడర్లను ముందస్తు అరెస్ట్​చేశారు. పోలీసులు పట్టుకున్న నిందితుల పేర్లు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హిందూ సంఘాల లీడర్లు మంగళవారం గాంధీనగర్​లోని ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. నిరసనకు అనుమతులు లేవని చెప్పిన పోలీసులు వారిని చెదరగొట్టి కూకట్​పల్లి పోలీస్ స్టేషన్​కు తరలించారు. 

పద్మారావునగర్​ ఆలయంలో చోరీకి యత్నం

పద్మారావునగర్: పద్మారావునగర్ శ్రీసాయిబాబా టెంపుల్​పక్కనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం ఓ ఆగంతుకుడు చోరీకి విఫలయత్నం చేశాడు. 50 ఏండ్ల వయస్సు వ్యక్తి ఆలయంలోని అమ్మవారి నగలు, వస్తువులను ఎత్తుకువెళ్లడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఓ పిల్లవాడు చూసి అరవగా అమ్మవారి వస్తువులను అక్కడే వదిలేసి, ఆలయ గంటను పట్టుకొని పరిగెత్తాడు. దీంతో స్థానికులు వెంటపడి పట్టుకొని చితకబాదారు. తర్వాత చిలకలగూడ పోలీసులకు అప్పగించారు.