జగిత్యాల అభివృద్ధిపై చర్చకు రెడీ.. ఎమ్మెల్సీ కవితకు జీవన్ రెడ్డి సవాల్

ఇందిరాగాంధీ హయంలో ఆకలి, మన్ను తప్ప ఒరిగిందేమీ లేదు అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ, జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఫ్రస్టేషన్ లో ఉండి.. అహంకారంతో ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్​పార్టీపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హై కమాండే తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసిందని చెప్పారు. పీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి అనుచరులకు ఎమ్మెల్యే టికెట్లు రాలేదన్నారు. 

జగిత్యాల అభివృద్ధిపై చర్చకు ఎమ్మెల్సీ కవిత విసిరిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమే అన్నారు. ప్రెస్ క్లబ్ అయినా, టవర్ సర్కిల్ అయినా, అంబేడ్కర్ చౌరస్తా అయినా సరే సమయం చెబితే తాను జగిత్యాల అభివృద్ధిపై చర్చకు రెడీగా ఉంటానన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అభివృద్ధిలో పోటీ పడ్డానన్నారు. సిద్దిపేట, సిరిసిల్లలో లేని న్యాక్ సెంటర్, అగ్రికల్చర్, జేఎన్ టీయూ కళాశాలలు జగిత్యాలలోనే ఉన్నాయన్నారు. జగిత్యాలలో  బీఆర్ఎస్ ప్రభుత్వం డివైడర్లు, చెరువుకట్టలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.