తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ చెప్పడమే గానీ.. ఎక్కడా నీటి సమస్య తీరలేదన్నారు ఎమ్మెల్సీ, జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. గతంలో తవ్వించిన బావులు తప్ప తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా చేసిందేమీ లేదని చెప్పారు. ఇంటింటా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డులను నిరంతరం జారీ చేస్తామని, ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామం పరిసర తాండాలలో ఎమ్మెల్సీ, జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారం చేశారు.
ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పారు. వయసుతో నిమిత్తం లేకుండా వివాహమైన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2 వేల 500 అందిస్తామన్నారు. ఆడబిడ్డ పెళ్లికి లక్షకు అదనంగా పెళ్లి కూతురుకు తులం బంగారం కానుకగా ఇస్తామన్నారు. సిలిండర్ రూ.500 కే అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను మభ్యపెట్టెందుకు కేసీఆర్ సిలిండర్ రూ.400కే ఇస్తామంటున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు రూ. 400 కే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.