- కేసీఆర్ లెక్కనే మనం చేస్తే ఎట్ల?
- రాహుల్ గాంధీ చెప్పిందేంటి? మనం చేస్తున్నదేంటి?
- పోచారం.. ఫిరాయింపుల ముఠా నాయకుడు
- నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలదే పెత్తనం
- ఎమ్మెల్యే సంజయ్ అండతోనే గంగారెడ్డి హత్య జరిగిందని ఆరోపణ
- రాష్ట్రంలోని పరిస్థితులపై అగ్ర నేతలకు లేఖ
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ కు సరిపడా బలమున్నా ఇతరులను ఎందుకు చేర్చుకుంటున్నారన్నారు. గురువారం సీఎల్పీ ఆఫీసులో మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడారు. ‘‘పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విధానమేంటి? రాహుల్ గాంధీ చెప్పిందేంటి? ఇక్కడ మనం చేస్తున్నదేంటి?” అని రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసినట్టే.. ఇప్పుడు మనం చేస్తున్నం.
కేసీఆర్ ఆనాడు గంపగుత్తగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని ప్రతిపక్షం అనేది లేకుండా చేశాడు. ఆయన అప్పుడు అలా చేయడంతోనే ఇప్పుడు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం అదే చేస్తే ఎలా?’’ అని నిలదీశారు. ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటైనా.. సుస్థిర ప్రభుత్వాన్ని నడిపేంత బలం కాంగ్రెస్ కు ఉందని, అయినప్పటికీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
పోచారం.. ఏం సలహాలిస్తడు?
కొందరు కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తూ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ‘‘పార్టీ ఫిరాయింపుల ముఠా అధ్యక్షుడు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన పోచారం.. ఏం సలహాలు ఇస్తారో నాకైతే అర్థం కావడం లేదు. ఫిరాయింపులను ఏ విధంగా చట్టబద్ధం చేయాలనే విషయంలో పోచారం ఎక్స్ పర్ట్. దళిత నాయకుడు భట్టికి ప్రతిపక్ష నేత హోదా పోవడానికి ఆనాడు స్పీకర్ గా ఉన్న పోచారం కారణం కాదా?’’ అని ప్రశ్నించారు. ఇప్పుడున్న స్పీకర్ కాంగ్రెస్ వ్యక్తే కదా.. అలాంటప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను బహిష్కరించవచ్చు కదా? అని అడిగారు.
ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తుంది. ఆనాడు కేసీఆర్ ప్రతిపక్షాన్ని చంపేసినందుకే ఈనాడు ఇంటికి పరిమితమయ్యారు. ప్రతిపక్షం లేకుంటే ప్రభుత్వం కళ్లు నెత్తికెక్కుతాయి. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో లేకపోతే ప్రభుత్వం కొనసాగదా?’’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పెత్తనం చలాయిస్తున్నారని మండిపడ్డారు. దీంతో అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
జగిత్యాలలో బీఆర్ఎస్ ఆగడాలు పెరిగినయ్..
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆగడాలు పెరిగిపోయాయని జీవన్‌రెడ్డి అన్నారు. ‘‘నా అనుచరుడు గంగారెడ్డి తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కోసం పని చేస్తున్నాడు. అతణ్ని హత్య చేసిన సంతోష్ బీఆర్ఎస్ కార్యకర్త. ఎమ్మెల్యే సంజయ్ అండతోనే గంగారెడ్డిని సంతోష్ హత్య చేశాడు” అని ఆరోపించారు. కాంగ్రెస్ ముసుగులోనే ఈ హత్య జరిగిందన్నారు. ‘‘ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా కోరుకున్నారు.. నువ్వు గెలిచావు. కానీ అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటే ప్రజాస్వామ్యం ఉంటుందా?. కాంగ్రెస్ పార్టీ.. మీ ఇంట్లో పుడితే, పరాయి ఇంటికి ఎందుకు వెళ్లావు” అని సంజయ్ ని ప్రశ్నించారు.
మాజీ ఎంపీ చొక్కారావు అంటే తనకెంతో గౌరవం ఉందని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడి, ఆయన పేరు ఎందుకు బద్నాం చేస్తున్నావని ఫైర్ అయ్యారు. ‘‘బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు.. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు అని ఎమ్మెల్యే సంజయ్ అంటున్నడు. అప్పుడు బీఆర్ఎస్ లో ఉండి దౌర్జన్యం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ముసుగు వేసుకొని దౌర్జన్యం చేస్తుండా?” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానని.. అవసరమైతే ఆయనను కలుస్తానని చెప్పారు.
నా భవిష్యత్తు.. మీరే నిర్ణయించండి
పార్టీలో తనకు ఎదురైన పరిస్థితులను వివరిస్తూ హైకమాండ్ కు జీవన్ రెడ్డి లేఖ రాశారు. ‘‘నేను నమ్మిన కాంగ్రెస్ లోనే నాకు ఇంతటి అవమానం, అగౌరవం ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నా భవిష్యత్తు కార్యాచరణ గురించి మీరే మార్గదర్శనం చేయండి” అని అందులో పేర్కొన్నారు. ఈ లేఖను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు పంపించారు.
రాజకీయ పార్టీకి నైతిక విలువలు అవసరం..
రాజకీయ పార్టీకి నైతిక విలువలు ఉండాలని జీవన్‌రెడ్డి అన్నారు. ‘‘చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. కేసీఆర్ అలాంటి పనులు చేయడంతోనే జనాలు ఆయనకు తగిన బుద్ధి చెప్పారు” అని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు కఠిన చట్టం తెస్తామని ‘‘పాంచ్ న్యాయ్’’లో రాహుల్ గాంధీ పేర్కొన్నారని గుర్తు చేశారు. కొందరు స్వార్థపూరిత శక్తులు అభివృద్ధి పేరిట పార్టీలు ఫిరాయించారని మండిపడ్డారు. ‘‘టీడీపీ నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభమైంది.
ఇందిరాగాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ లో చేరాను. 40 ఏండ్లుగా కాంగ్రెస్ లోనే ఉన్నాను. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. బీఆర్ఎస్ లోకి రావాలని ఎందరు ఒత్తిడి చేసినా వెళ్లలేదు. జగిత్యాలను కాంగ్రెస్ కు కంచుకోటగా మార్చాను. పదేండ్లు బీఆర్ఎస్ అక్రమ పాలనను వ్యతిరేకించాను. కానీ ఇప్పుడు ఆ పార్టీ వాళ్లే కాంగ్రెస్ లోకి వచ్చారు. పదేండ్లు కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టిన వాళ్లే.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి పదవులు పొందుతున్నారు” అని అన్నారు.