శాసనసభ కౌరవ సభను తలపిస్తోంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణ శాసన సభ కౌరవ సభను తలపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. విద్యుత్ కోతలపై శాసన మండలిలో వాస్తవాలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. కరెంట్ తీగలు పట్టుకోవడం కోసమేనా తెలంగాణ తెచ్చకున్నదని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో  విద్యుత్ ఎప్పుడు వస్తుందో విద్యుత్ శాఖకే తెలియదని ఎద్దేవా చేశారు. 

వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామంటున్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదన్నారు. కరెంటు ఇస్తున్నామని  ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు చేస్తోందని మండిపడ్డారు. రైతులకు నిర్ణీత సమయాల్లో విద్యుత్ ను సరఫరా చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్న ఆయన.. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగితే మండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర మంత్రిలా వ్యవహరిస్తూ  ప్రశ్నలకు సమాధానం చెప్పారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.