కేసీఆర్.. పోలీసులను ప్రైవేట్ ఆర్మీగా వాడుకుంటుండు: జీవన్ రెడ్డి

లిక్కర్ స్కామ్ నుంచి కవితను కాపాడేందుకు సీఎం కేసీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చే ముందు.. ఈడీ వస్తాడన్న కేసీఆర్..  ఇక్కడ చేస్తున్నదేంటని  ప్రశ్నించారు. తన కొడుకు, బిడ్డలు తప్పు చేస్తే జైల్లో పెడతానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు కవితను కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈడీ అధికారులు వచ్చిన గంటకే.. కవిత ప్రగతిభవన్‭కు ఎందుకు పోతుందని.. ఇందుకేనా ప్రగతి భవన్ కట్టిందంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. 

మాదాపూర్‭లోని కాంగ్రెస్ స్పోక్ పర్సన్ సునీల్ ఆఫీస్ పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జీవన్ రెడ్డి చెప్పారు. పోలీసులను ప్రైవేట్ ఆర్మీగా వాడుకుంటున్న కేసీఆర్.. బీఆర్ఎస్ పెట్టి ప్రజాస్వామ్యన్ని ఏం కాపాడతారని విమర్శించారు. చేసిన అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు అధికార దర్పం కోసమే బీఆర్ఎస్ పార్టీని పెట్టారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 112 ఎమ్మెల్యేల్లో 90 శాతం మంది కేసీఆర్ కే వంత పాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగితే ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలి లేదంటే రాష్ట్రపతి, సుప్రీంకోర్టును ఆశ్రయించాలని జీవన్ రెడ్డి అన్నారు.