భారతదేశంలో ఏడాదికి 10 మిలియన్ల వివాహాలు జరుగుతున్నాయి. సాలీనా రూ.10.7 లక్షల కోట్ల వివాహ పరిశ్రమ ఖర్చులు ఉంటూ, ప్రపంచ దేశాల్లోనే భారత వివాహ పరిశ్రమ 2వ అతి పెద్దది అని ఇటీవల జాఫ్రీస్ సంస్థ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. భారతీయులు ఆహారం ఖర్చుల తర్వాత అత్యధిక ఖర్చు పెళ్లిళ్లలో పెడుతున్నారని, తమ పిల్లలు పాఠశాల నుంచి పీజీ వరకు విద్యాభ్యాసానికి వెచ్చించే ఖర్చుల కంటే రెట్టింపు ఖర్చులను వారి వివాహాల సమయంలో చేస్తున్నట్లు వివరించారు. నేటి ఆధునిక పెళ్లిళ్లలో ఎంగేజ్‌మెంట్, ప్రీవెడ్డింగ్ షూట్‌లు, హల్దీ మంగళ స్నానాలు, మెహందీ అలంకరణలు, సంగీత్ సరదాలు లాంటి పలు సంబరాలతో వారం పది రోజుల పాటు ఆర్భాటంగా వివాహాలు చేయడం చూస్తున్నాం.
భారత్‌లో నాలుగో అతి పెద్ద పరిశ్రమ
ఎకానమిస్ట్‌ల వివరాల ప్రకారం భారతదేశంలో వివాహ పరిశ్రమ నాలుగో అతి పెద్దదిగా వర్గీకరించారు. వివాహ పరిశ్రమ ద్వారా మిలియన్ల ఉద్యోగాలు లభిస్తున్నాయని, చాలామంది భారతీయ తల్లిదండ్రులు తమ ఆదాయాలను మరిచి గొప్పల కోసం, తమ స్థాయి - సంపదలను ప్రదర్శించడానికి వివాహాలను అతి ఆడంబరంగా, అనవసర ఖర్చులతో పెళ్లిళ్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది. కరోనా విపత్తు మేఘాలు తొలగిన తర్వాత గత 3 ఏండ్లలో పెళ్లి ఖర్చులు విపరీతంగా పెరగడం, డిజిటల్ టెక్నాలజీ రాకతో కొత్త కొత్త విచిత్రాలు చోటు చేసుకోవడం చూస్తున్నాం. భారతీయులు నిర్వహించే వివాహాల్లో సగటున రూ. 12.7 లక్షల ఖర్చు చేస్తున్నట్లు, మన తలసరి జిడిపీతో పోల్చితే ఐదు రెట్లు అధికంగా నమోదు అవుతున్నట్లు వివరించబడింది.
డెస్టినేషన్ మ్యారేజెస్ ఇన్ ఇండియా
సాధారణ కుటుంబాలు నిర్వహించే ఇంటిముందు పందిరివేసి చేసే పెళ్లిళ్ల నుంచి విశాలమైన ఫంక్షన్ హాల్ వివాహాలకు తోడుగా దేశ విదేశాల్లో నిర్వహించే విలాసవంతమైన ‘డెస్టినేషన్ వెడ్డింగ్’లను కూడా నేడు చూస్తున్నాం. 2023 నవంబర్ - డిసెంబర్ ముహూర్తాల్లో 3.5 మిలియన్ల వివాహాలు జరిగాయని, వాటిలో రూ.4,74,000 కోట్లు ఖర్చు పెట్టారని వివరించారు. నేటి సమాజంలో దేశ విదేశాల్లో కనీసం రూ. 18 మిలియన్ల ఖర్చుతో డెస్టినేషన్ మ్యారేజీలను చేయడంతో మన ప్రధానమంత్రి మోదీ ‘వెడ్ (వెడ్డింగ్) ఇన్ ఇండియా’అనే నినాదమిచ్చి తమ పిల్లల వివాహాలను దేశంలోనే అద్భుత వేదిక మీద చేయాలని విజ్ఞప్తి చేసేవరకు పరిస్థితి రావడం ఆశ్చర్యకరం. మన దేశంలోని రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, హర్యానా, కేరళ, గోవా రాష్ట్రాల్లో ఇప్పటికే డెస్టినేషన్ వివాహాలు అధికంగా జరగడం గమనించారు.
వివాహ వ్యవస్థలో వివిధ సేవలు
భారతీయ వివాహానికి అవుతున్న మొత్తం ఖర్చులో 30 శాతం భోజనాలు-, ఫంక్షన్ హాల్‌కు, 19 శాతం కానుకలకు, 14 శాతం డెకరేషన్‌కు, 12 శాతం ఈవెంట్ ప్లానింగ్‌కు, 8 శాతం హనీమూన్ ప్రయాణాలకు, 9 శాతం లాజిస్టిక్స్‌కు, 3 శాతం ఫోటో-, వీడియోగ్రఫీలకు, 2 శాతం ఆహ్వానాలకు, 3 శాతం మేకప్‌లకు వ్యయం చేస్తున్నారు. ఇదే కాకుండా బంగారు ఆభరణాలు, పెళ్లి జంట వస్త్రాలకు ఖర్చు అదనంగా, అధికంగా అవుతున్నాయి. భారత్‌లో జరుగుతున్న వివాహాలతో సంబంధం ఉన్న హోటల్స్, ఫంక్షన్ హాల్స్, హాస్పిటాలిటీ, టూరిజమ్, రిటైల్, టెక్నాలజీ, లాజిస్టిక్స్ లాంటి రంగాలు కూడా మనగలుగుతున్నాయి. భారతీయ వివాహ వ్యవస్థతో దేశ ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతున్నది. వివాహ పరిశ్రమతో ఉద్యోగ కల్పన, ద్రవ్య వినిమయాలు, సంబంధిత రంగాలు పెరుగుతున్నాయి. అయితే, కుటుంబ ఆదాయ పరిస్థితులను బట్టి వివాహాల ఖర్చులను పరిమితం చేయడం శ్రేయస్కరం.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి