హిందీ టెలివిజన్‌‌లో వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్

హిందీ టెలివిజన్‌‌లో వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్

హిందీ సీరియల్ ప్రపంచంలో ఆమె ఒక మహారాణి. హిందీ టెలివిజన్‌‌లో వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్. ఇండియన్ టీవీ యాక్ట్రెస్​లలో అత్యధిక రెమ్యూనరేషన్ పొందిన ఆమె, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక బెంచ్ మార్క్ సృష్టించుకుంది. ఆమే జెన్నిఫర్ వింగెట్. పేరు చూసి చాలామంది ఫారిన్ యాక్ట్రెస్ అనుకుంటారు. కానీ, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఇండియన్ యాక్ట్రెస్. ఆమె జర్నీ ఇది.

‘‘నేను లీడ్ రోల్ చేసిన ‘కోడ్ ఎమ్ సీజన్–1’ సూపర్ హిట్ అయ్యాక రీసెంట్‌‌గా ‘కోడ్ ఎమ్ సీజన్–2’ వూట్​లో విడుదలైంది. కోడ్ ఎమ్‌‌లో చేసిన మేజర్ మోనికా మెహ్రా పాత్ర సాహసంతో కూడుకున్నది. ఒక ఆర్మీ ఆఫీసర్​గా చేయడం ఎంత కష్టంగా ఉంటుందో, అలా నటించడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. కోడ్ ఎమ్ తాలూకు రెండు సీజన్స్​లో ఒక ఆర్మీ ఆఫీసర్ స్కిల్స్ నేర్చుకోవడానికి నాకు చాలా టైమ్ పట్టింది. దీనికోసం నేను ట్రైనింగ్ సెషన్స్​కి వెళ్లాను. ఎందుకంటే, నేనేం సౌకర్యవంతంగా చేయగలనో స్టంట్ మాస్టర్​కి తెలియడం చాలా ముఖ్యం. నేను చేసే ప్రతి స్టంట్ ఎఫర్ట్ లెస్​గా కనిపించాలి. చెప్పి చేయించినట్టు కనిపించకూడదు. సీరియల్స్ చేశాక మొదటిసారి వెబ్ సిరీస్​లో నటిస్తుండటంతో, ఫస్ట్ సీజన్​లో చాలా నెర్వస్ ఫీలయ్యా. అప్పుడు ట్రైనింగ్ సెషన్స్​లో,  నేను చేసిన యాక్షన్ మొత్తం రికార్డు చేసుకునేదాన్ని. ఇంటికొచ్చాక దాన్ని చూసుకునేదాన్ని. అలా నెమ్మదిగా నా పనిని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టా.

సాహసం చేసినట్టుగా...

ఆర్మీ ఆఫీసర్ పాత్ర అంటేనే చాలా సవాళ్లు ఉంటాయి. కానీ, నేను అదృష్టవంతురాలిని. ఆర్మీ ఆఫీసర్​గా చేసే అవకాశం వచ్చింది కాబట్టి, ఆ పాత్ర చేయడంలో ఎదురయ్యే ప్రతీ సవాలు నా నటనను మరింత మెరుగుపరిచింది. ఇందులో ఫిజికల్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షూటింగ్​లో అలిసిపోయేదాన్ని. కానీ, నా పనిని టీవీలో చూసుకున్నప్పుడు మాత్రం ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందనే సంతోషం కలిగేది. ‘కోడ్ ఎమ్’ షూటింగ్​కి వెళ్తుంటే, ఒక అడ్వెంచర్​ చేయడానికి వెళ్తున్నట్టు ఉండేది. టీవీ సీరియల్ ప్రపంచంలో నుంచి బయటకు అడుగుపెట్టి,  నా జీవితంలో ఎప్పుడూ చేయని క్యారెక్టర్ ‘కోడ్ ఎమ్’ లో చేశా. దానివల్ల చాలామందిని కలుసుకునే అవకాశం కలిగింది. రజత్ కపూర్, స్వననద్ కిర్కిరే లాంటి గొప్పనటులతో కలిసి నటించడం ఉత్సాహంగా ఉండేది. వాళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా.

నేను లోకల్

ముంబైలో పుట్టా. నాన్న హేమంత్ వింగెట్, మహారాష్ట్ర క్రిస్టియన్. ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్​లో పని చేసేవారు. అమ్మ ప్రభా వింగెట్, పంజాబీ. హోమ్ మేకర్. నా పేరు చూసి చాలామంది ఫారిన్ యాక్ట్రెస్ అనుకుంటారు. ఇప్పటికీ చాలామంది నన్ను ‘మీరు హిందీ మాట్లాడతారా?’ అని అడుగుతారు. నేను పదహారు, పదిహేడేండ్లుగా టీవీలో యాక్ట్ చేస్తున్నా. అయినా నా పేరును బట్టి వీళ్లెందుకు ఇలా అడుగుతున్నారని ఆశ్చర్యపోతుంటా. ముంబైలో ఉన్న సెయింట్ జేవియర్ హైస్కూల్లో చదువుకున్నా. చిన్నప్పుడు సైలెంట్​గా ఉండేదాన్ని. ఎవ్వరితో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. అప్పట్లో నాకు రెండు డ్రీమ్స్ ఉండేవి. ఒకటి ఎయిర్ హోస్టెస్, రెండోది పోలీస్ కావడం. కానీ, కొంచెం పెద్దయ్యాక యూనిఫామ్ జాబ్స్ బోరింగ్​గా ఉంటాయనిపించింది. అందుకే క్రియేటివ్​గా ఉండే, గ్లామర్ ఫీల్డ్​లో అడుగుపెట్టాలనుకున్నా. ముంబైలోనే కె.జె సోమయా కాలేజీలో బీకామ్ చదివా. కట్ చేస్తే, ఇప్పుడు నాకు ఇష్టమైన ప్రొఫెషన్​లో ఉన్నా.

చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి...

‘అకేలే హమ్ అకేలే తుమ్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్​గా చేశా. అది1995లో. ఆ తరువాత నా 15 ఏండ్ల వయసులో అంటే 2000 సంవత్సరంలో విడుదలైన ‘రాజా కో రాణి సే ప్యార్ హో గయా’ సినిమాతో నా యాక్టింగ్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత మూడేండ్లకు ‘కుచ్ నా కహో’లో సపోర్టింగ్ రోల్​ చేశా. ఆ తర్వాత టీవీ సీరియల్స్​లో అవకాశం వచ్చి, అటువైపు వెళ్లా. 2002లో వచ్చిన ‘షక లక బూమ్ బూమ్‌‌’ హిందీ సీరియల్లో నటించా. ‘కసౌటి జిందగీ కె’ లో చేసిన స్నేహా బజాజ్ పాత్ర, ‘దిల్ మిల్ గయే’లో చేసిన డాక్టర్ రిధిమా గుప్తా పాత్రలు గుర్తింపు తెచ్చాయి. దాంతోపాటు ఇండియన్ టెలివిజన్​లో నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాయి. 2013లో సంజయ్ లీలా భన్సాలీ టెలివిజన్ సీరియల్ ‘సరస్వతీ చంద్ర‘లో గౌతమ్ రోడేకి జంటగా కుముద్ దేశాయ్ పాత్రలో నటించా. ఆ సీరియల్‌‌కి  ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు వచ్చింది. 2016లో, సోనీ టీవీలో వచ్చిన ‘బేహద్‌‌’లో మాయా మెల్హోత్రా పాత్రకి  విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. అందులో చాలా రకాల ఎమోషన్స్ పలికించే అవకాశం దొరికింది. 2018లో కలర్స్ టీవీలో వచ్చిన ‘బేపనాహ్‘లో హర్షద్ జోయా సిద్ధిఖీ పాత్ర,  2020లో సోనీ టీవీ ‘బేహద్-2‘లో జైసింగ్ పాత్ర నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ‘సరస్వతీచంద్ర, ‘బేహద్‌‌’  ‘బేపనాహ్ సీరియల్స్ టీవీ ఇండస్ట్రీలో నాకు స్టార్​డమ్ తెచ్చిపెట్టాయి. 

 నేను ఎమోషనల్

నాకు ఎమోషనల్ సీన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, నేను రియల్ లైఫ్ లో కూడా ఎమోషనల్ పర్సన్.  సెట్​లో నేను పర్ఫార్మెన్స్ చేసినప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు క్లాప్స్ కొడుతుంటే... చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది టీఆర్పీ, కలెక్షన్స్, అవార్డ్స్ కంటే కూడా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. యాక్టర్స్ అందరూ గుర్తింపు కోసమే పని చేస్తారు. ఫ్యాన్స్ నుంచి లభించే ప్రేమ, ఫీడ్ బ్యాక్ మన బాధ్యతతో పాటు, స్థాయిని పెంచుతాయి.
నా విషయంలోనే ఎందుకు?
‘సరస్వతీ చంద్ర’ చేస్తున్న టైంలో జెన్నిఫర్ ఇంటిమేట్ సీన్స్ చెయ్యదని చాలా రూమర్స్ వచ్చాయి. అయితే, అందులో ఉండే గౌతమ్, కుముద్ పాత్రలు కొత్తగా పెళ్లయిన జంట. వాళ్లు పొసెసివ్​గా ఉంటారు. లిప్ మీద కిస్ పెట్టడం గురించి మాత్రమే షరతులు పెట్టా. అందులో చాలా ఇంటిమేట్ సీన్స్​లో నటించా. కానీ, దాన్ని ఒక సమస్యగా, నెగెటివ్​గా ప్రొజెక్ట్ చేశారు. హీరో సల్మాన్ ఖాన్ లిప్ కిస్ సీన్స్ చేయరు. అదెప్పుడూ సమస్య కాలేదు. కానీ, నా విషయంలో మాత్రం ఎందుకు సమస్య అవుతుందో అర్థం కాదు.

మంచి యాక్టర్ కావాలని..

ఆరేడేండ్ల కింద వెబ్ సీరిస్​ల మీద అంత అవగాహన ఎవరికీ లేదు. మిలెన్నియల్స్​కి ఇంటర్నెట్ యాక్సెస్ పెరగడంతో సమాచారం అంతా అరచేతిలోకి వచ్చింది. నాకు ‘కోడ్ ఎమ్​’ సీజన్ వన్ ఆఫర్ వచ్చినప్పుడు టీవీ నుంచి ఓటీటీ ట్రాన్సిషన్ పీరియడ్. ప్యాండెమిక్ ల వల్ల ఓటీటీలు పాపులర్ కావడంతో, సిరీస్​ల రీచ్ ఇంకా పెరిగింది. ‘కోడ్ ఎమ్’ సూపర్ హిట్ అయింది. 2016 తర్వాత అసలు నేనేం చేస్తున్నా అని నన్ను నేనే ప్రశ్నించుకున్నా. ఎన్ని అవకాశాలు వచ్చినా నాకు నచ్చిన రోల్స్ మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యా. ఫ్యూచర్​లో నా యాక్టింగ్​ని గుర్తుంచుకోవాలి. అందుకే, మంచి యాక్టర్ కావాలనుకున్నా. అప్పటి నుంచి నేను ఆ ప్రాసెస్​ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టా. అప్పటినుంచి నేను చేయాలనుకున్నవి మాత్రమే  చేస్తున్నా. ఆ ప్రాసెస్​లో ఐదారేండ్లుగా ఏం చేసినా... అందులో ఛాలెంజెస్ అయినా ఉండాలి లేదా ఏదైనా నేర్చుకునేదైనా ఉండాలి. లేదంటే ఆ ఆఫర్ ఒప్పుకోవడంలేదు.


నేను టీవీ గర్ల్


నా కెరీర్​లో టీవీ ఒక గేమ్ చేంజర్. నేను టీవీ గర్ల్ అని చెప్పుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడతా. ఏదేమైనా సరే ఈ రోజుకి కూడా టీవీకి ఎక్కువమంది ప్రేక్షకులు ఉన్నారు. ఉదాహరణకు రోజూ రాత్రి ఎనిమిదిన్నరకు ఒక సీరియల్ టెలికాస్ట్​ అవుతుందనుకోండి... ఆ సీరియల్​ చూస్తున్న ఫ్యామిలీలో మనం భాగమైపోతాం. ఇక వెబ్ సిరీస్​కి మరో ప్రత్యేకత ఉంది. దీనికి బడ్జెట్ బాగుంటుంది. కథ బాగుంటుంది. బాగా తీస్తారు. కాబట్టి, సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. అలాగని టీవీ నుంచి ఓటీటీకి రావడం కష్టమా అంటే... మళ్లీ అది వేరే విషయం. ఎందుకంటే, టీవీకి ఒక విధంగా నటిస్తే, ఓటీటీకి మరోలా నటించాలి. ఒక టీవీ సీరియల్ కనీసం సంవత్సరం అయినా నడుస్తుంది. వెబ్ సిరీస్ తీసుకుంటే... 9 ఎపిసోడ్లు ఉంది అనుకుందాం. దానికి ఒక మొదలు, ఒక ముగింపు సరిగ్గా ఉంటాయి. అంటే, దాని గ్రాఫ్ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంటుంది. కానీ, సీరియల్ ముందుకు వెళ్లే కొద్దీ, స్క్రిప్ట్ మారిపోతుంటుంది. ఓటీటీలో ఏం  చూపించాలనుకుంటున్నాం? మన క్యారెక్టర్ ఏంటి? అనేవిషయాలు నటీనటులకు ముందే తెలుస్తాయి. క్లియర్ విజన్ ఉంటుంది. కాబట్టి, సీరియల్​తో పోలిస్తే ఓటీటీ చేయడమే ఈజీ అనిపిస్తుంది నాకైతే. 

 ప్రేమకు కొదవలేదు

కరణ్ సింగ్ గ్రోవర్‌‌ని 2012లో పెళ్లి చేసుకున్నా. కానీ, కొన్ని పొరపొచ్చాల వల్ల రెండేండ్లకే విడిపోయాం. ఒక రిలేషన్ కోసం చాలా కష్టపడి, చాలా టైం దానికోసం పెట్టి...  అది ఫెయిల్ అయిందనడం చాలా కష్టం. అయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ప్రేమను కేవలం ఒక పార్ట్​నర్​కే ఎందుకు పరిమితం చేయాలి? నా జీవితంలో ప్రేమకు కొదువ లేదు. అలాగని నాకు అతని మీద పగ కూడా లేదు. మనుషులం ఎవ్వరం పర్ఫెక్ట్​గా ఉండం. తప్పులు చేయకుండా ఎలా నేర్చుకోగలం? నాకు పుట్టబోయే పిల్లలకి కూడా తప్పులు చేయమనే చెప్తా. లేదంటే వాళ్లెలా నేర్చుకుంటారు? ఐడియల్ అబ్బాయి.. ఐడియల్ అమ్మాయి అంటూ ఎవ్వరూ ఉండరు. ఈ విషయంలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు. ఇంకా చెప్పాలంటే ఆ ఫెయిల్యూర్​ని ఒక ఆశీర్వాదంలా భావిస్తా. ఆ అనుభవం వల్ల నేను ఇంకా  బెటర్​గా, స్ట్రాంగ్​గా మారా. నా బలమేంటో తెలుసుకునేలా చేసినందుకు కరణ్​కి థ్యాంక్స్.

టీవీ వాళ్లకు అవకాశాలు

టీవీ స్టార్స్​కి బాలీవుడ్​లో అవకాశాలు దొరకడం కష్టం అనేది ఒకప్పటిమాట. ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీవీ యాక్టర్స్​ని చూసే కోణం మారింది. అలాగని మొత్తం మారిందని కాదు. కానీ, నెమ్మదిగా మారుతోంది. ఇంకా సవాళ్లు ఉన్నాయి. ‘ఇది టీవీ వాళ్లు చేయలేరు’ అని లైట్ తీసుకొని, రిజెక్ట్ చేస్తున్నవాళ్లు ఇంకా ఉన్నారు. వాళ్ల అభిప్రాయాలు వాళ్లవి. వాళ్లను జడ్జ్ చేయను. కొంతమంది డైరెక్టర్స్ మాత్రం టీవీ యాక్టర్స్ టాలెంట్ చూసి పెద్ద అవకాశాలు ఇస్తున్నారు. వాళ్లంటే నాకు చాలా గౌరవం. టీవీ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన యాక్టర్స్​కి భవిష్యత్తులో ఇంకా అవకాశాలు పెరగాలని కోరుకుంటున్నా.’’

బ్యూటీ సీక్రెట్

‘నీ బ్యూటీ సీక్రెట్ ఏంటి?’ అని చాలామంది అడుగుతుంటారు. దానికి నా సమాధానం- నిద్ర. నిద్ర పోవాలనుకుంటే చాలు వెంటనే నిద్రపోతా. షూటింగ్ లేని రోజుల్లో ఎక్కువసేపు నిద్రపోతా. పానీ పూరీ అంటే చాలా ఇష్టం. నిద్రలో నుంచి లేపి, పానీపూరీ తినమన్నా.. తింటా. మినిమిలిస్టిక్ జీవితం నాది. అందుకే ఇంట్లో చాలా తక్కువ వస్తువులు ఉంటాయి. మొక్కలు పెంచడం నా హాబీ. 

 గుణ