జెట్టి ఈశ్వరీ బాయి అణగారిన వర్గాల గొంతుక

జెట్టి ఈశ్వరీ బాయి అణగారిన వర్గాల గొంతుక

తరతరాలుగా వెట్టి, వెలివేతను అనుభవిస్తూ.. నలుగుతున్న జీవితాల్లో వేగుచుక్కయి వెలిగిన కాంతి రేఖ జెట్టి ఈశ్వరీబాయి. అంటరానితనం అనే సాంఘిక దురాచారం ఒకవైపు, స్త్రీ- పురుష అసమానతలతో కూడిన అణచివేత మరో వైపు సమాజాన్ని పీడిస్తున్న ఆ రోజుల్లో విధిని ఎదిరించిన ధీరోదాత్త మహిళ ఆమె. అంటరాని గుడిసె నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి ఆధిపత్య కులాల కుట్రలను ధైర్యంగా ఎదుర్కొన్న ధీశాలి. పదవుల కోసం ఆమె ఏనాడూ పాకులాడలేదు. కాంగ్రెస్ లాంటి పార్టీలో చేరి ఉంటే కేంద్ర మంత్రి కూడా అయ్యేవారు. కానీ అంబేద్కర్ ఆలోచనల పునాదులపై ఏర్పడ్డ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి ఎవరి సాయం లేకుండానే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అంబేద్కర్ నిజమైన వారసురాలుగా గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆమె నిరాడంబర జీవితాన్ని గడిపారు. తుది శ్వాసవరకు దళితులు, మహిళలు అణగారిన వర్గాల గొంతుకగా కొట్లాడిన జెట్టి ఈశ్వరీ బాయి వర్ధంతి నేడు.

జెట్టి ఈశ్వరీబాయి1918 డిసెంబర్1న సికింద్రాబాద్ లోని చిలకలగూడ ప్రాంతంలో సామాన్య మాల కులానికి చెందిన బల్లెపు బలరామస్వామి, రాములమ్మ దంపతులకు జన్మించారు. ఆమె జననం సామాన్యమైనదే కానీ మరణం మాత్రం అసామాన్యమైనది. ఇప్పటి నాయకుల వలే కోటాను కోట్ల రూపాయలు, వందలు, వేల ఎకరాలు భూములు సంపాదించుకోకుండా అణగారిన ప్రజలను ఆదరించి, అక్కున చేర్చుకొని వారి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి ఆమె. కోట్లాది మంది అభిమానాన్ని పొంది 1991 ఫిబ్రవరి 24న తుది శ్వాస విడిచారు. ఆమె జీవితాన్ని పరిశీలిస్తే కులం కోసమో, ఒక వర్గం కోసమో పోరాడిన నాయకురాలిగా కాకుండా సబ్బండ వర్గాల శ్రేయస్సును కాంక్షించిన నాయకురాలిగా కనిపిస్తారు. సికింద్రాబాద్ ఎస్పీజీ మిషన్ స్కూల్​లో ఈశ్వరీబాయి ప్రాథమిక విద్య, కీస్ హైస్కూల్​లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషల్లో పట్టు సాధించారు. తన13వ ఏట డా.జె.లక్ష్మీనారాయణతో పెండ్లయ్యింది. భర్త హఠాన్మరణంతో ఈశ్వరీబాయి తన కూతురు డాక్టర్ జె.గీతారెడ్డితోపాటు పుట్టింటికి చేరారు. అప్పటి నుంచి సొంత కాళ్లపై నిలబడటం అలవాటు చేసుకున్నారు. తొలుత సికింద్రాబాద్ లోని ఒక స్కూల్లో టీచర్‌‌‌‌‌‌‌‌గా జీవితం ప్రారంభించారు. తర్వాత పౌరసరఫరాల శాఖలో ఉద్యోగం వచ్చింది. కొద్దిరోజులకు చిలకలగూడలో ‘గీతా విద్యాలయం’ స్థాపించి, ఆ  ప్రాంతంలో వెనుకబడిన మహిళలను చేరదీసి వారికి చదువు చెప్పడంతోపాటు చేతి వృత్తుల్లో శిక్షణ ఇప్పించి సొంత కాళ్లపై నిలబడేలా చేశారు. అదే సమయంలో తెలుగు నేలపై దళితోద్యమానికి పునాదులు వేసి, మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో హైదరాబాద్‌‌‌‌లో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను స్థాపించిన దళితోద్యమ ధ్రువతార మాదరి భాగ్యరెడ్డి వర్మ, హైదరాబాద్ అంబేద్కర్‌‌‌‌గా కీర్తి పొందిన బి.ఎస్.వెంకట్రావు, అరిగే రామస్వామి, జే.హెచ్.సుబ్బయ్య, బత్తుల శ్యాం సుందర్ లాంటి వారు ‘ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్’ ద్వారా చేస్తున్న దళితోద్ధారక కృషిలో ఆమె భాగస్వామి అయ్యారు. దేశ వ్యాప్తంగా డాక్టర్ అంబేడ్కర్ నిర్వహిస్తున్న ఉద్యమాలను గమనిస్తూ, ఆయన సిద్ధాంతాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకుని ఆచరణలోకి తీసుకెళ్లారు.

రాజకీయాల్లోకి..

సమాజంలో పేరుకుపోయిన అసమానతలు, అణచివేతలు, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఉద్యమాల్లో ఉవ్వెత్తున పాల్గొన్న ఆమె, క్షేత్ర స్థాయిలో పోరాడటం ఎంత ముఖ్యమో చట్టాలు చేసే చట్ట సభల్లో గొంతెత్తడం కూడా అంతే ముఖ్యమని భావించారు. అంబేద్కర్​ మాటల నుంచి స్ఫూర్తి పొంది రాజకీయ రంగప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే పేరు మోసిన కాంగ్రెస్, లేదా ఇతర అగ్రకులాల ఆధిపత్య భావజాలంలో నడుస్తున్న పార్టీల్లో ఆమె చేరలేదు. ఎవరికీ తలవంచకుండా, స్వాభిమానంతో, స్వతంత్రంగా రాజకీయాలు చేయాలని1952లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేటర్ పదవికి పోటీ చేసి విజయం సాధించారు. అలా ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఒక దళిత మహిళ, స్వతంత్రంగా రాజకీయ శక్తిగా ఎదగడాన్ని సహించలేని కొందరు దాడులకు దిగడం, హత్యా ప్రయత్నాల్లాంటివి చేసినా.. ఆమె వెనకడుగు వేయలేదు. 1962లో ఆమె రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి టి.ఎస్.సదాలక్ష్మిపై నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. తెలంగాణ గడ్డపై నీలిరంగు జెండాను రెప రెపలాడించిన నిజమైన అంబేద్కర్ వారసురాలు ఈశ్వరీ బాయి. 1972లో జరిగిన ఎన్నికల్లో నంది ఎల్లయ్యపై గెలుపొంది మొదటిసారి గెలుపు గాలివాటం కాదని నిరూపించారు. 

తెలంగాణ ఉద్యమంలో..

1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈశ్వరీబాయి పోషించిన పాత్ర మరువలేనిది. చెన్నారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితికి ఆమె వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. తెలంగాణ పది జిల్లాల్లో పర్యటించి వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను అధ్యయనం చేసి ఆంధ్రా పాలకుల కుట్రలను ఆధారాలతో సహా అసెంబ్లీ వేదికగా గళమెత్తి నినదించిన తెలంగాణ ఫైర్ బ్రాండ్ ఈశ్వరీబాయి. ప్రధాన నాయకత్వం మొత్తం జైలు పాలయినప్పుడు ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఎమ్మెల్యేగా ఆమె అణగారిన ప్రజల అభివృద్ధి కోసం ఆరాటపడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలన అన్యాయం జరిగినా అక్కడ బాధితుల పక్షాన నిలువెత్తు ధైర్యమై నిలబడింది. కంచికచెర్ల కోటేసు సజీవదహనం విషయంలో అగ్రకుల పాలకులపై అసెంబ్లీలో ఆమె గర్జించిన తీరు అనిర్వచనీయం. తెలుగు నేలపై ఆమె తనకంటూ ఏర్పరుచుకున్న బ్రాండ్ నేటి యువతకు, సామాజిక ఉద్యమకారులకు, రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు గీటురాయి లాంటిది.

మహిళా వర్సిటీకి ఈశ్వరీబాయి పేరు పెట్టాలి

ప్రస్తుత ప్రజా ప్రతినిధుల వలె పెద్ద పెద్ద మేడలు, ఫామ్​హౌస్ ల్లో ఈశ్వరీబాయి ఉండలేదు. నిరంతరం పేద ప్రజల మధ్య ఉంటూ, వారి గుడిసెల్లో సేద తీరుతూ వారు తినే కారం బువ్వ, పచ్చడి మెతుకులే ఆమె తిన్నారు. వారి అభివృద్ధే తన అభివృద్ధిగా, వారి సంక్షేమమే తన సంక్షేమంగా భావించి అంతిమ శ్వాస వరకు అంబేద్కర్ అడుగుజాడల్లో అతి సామాన్యమైన జీవితాన్ని గడిపిన పేద ప్రజల గుండెచప్పుడు ఈశ్వరీ బాయి. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఉద్యమానికి ఊపిరిపోసిన ఆమెను స్వయంపాలనలో తెలంగాణ ప్రభుత్వం గౌరవించుకుంటూ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించడం హర్షణీయం. ఆమెను గౌరవించుకోవడం అంటే తెలంగాణ తనను తాను గౌరవించుకోవడమే కాబట్టి ఆమె స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయబోతున్న మహిళా యూనివర్సిటీకి ఈశ్వరీ బాయి పేరు పెట్టి గౌరవించాల్సిన అవసరం ఉంది.

- మంచాల లింగస్వామి, రీసెర్చ్ స్కాలర్, ఓయూ