నీతికథ.. అభిశంక

నీతికథ.. అభిశంక

శుభం కన్వెన్షన్​లో జువెలరీ ఎగ్జిబిషన్ పెట్టారు. చాలా కొత్త మోడల్స్ వచ్చాయట. వెళ్దామా?’ లో గొంతుకతో అడిగింది నీరజ, అచల వంక చూస్తూ.అచల ఆ మాటలు విని కూడా విననట్టే తల ఎత్తకుండా తన పని చేసుకుంటోంది. లంచ్ అవర్ కావటంతో బ్యాంకులో పెద్దగా కస్టమర్లు కూడా లేరు. ఆ రోజు క్యాషియర్ సెలవు పెట్టటంతో, మేనేజర్ రిక్వెస్ట్​ చేస్తే క్యాష్ కౌంటర్లో కూర్చోక తప్పలేదు అచలకి.

క్యాష్ కౌంటర్​ పక్క సీటు నీరజది. ‘‘ఏమే మొద్దు, ఏమిటి వింటున్నావా?” కౌంటర్ మీద పెన్నుతో చిన్నగా తడుతూ అంది.
వినపడుతోంది, ఒక్క నిమిషం’’ అంటూ నోట్లు లెక్కపెట్టటంలో మునిగిపోయింది.
ఒక అయిదు నిమిషాల తరువాత ‘‘ఇందాక ఏదో చెప్తున్నావు. ఏంటి?’’ అంది అచల నీరజ వంక చూస్తూ
జువెలరీ ఎగ్జిబిషన్ పెట్టారు. వెళ్దామా సాయంత్రం’’ ఈ సారి కొద్దిగా గొంతు పెంచింది నీరజ.
నాకు వాటి మీద పెద్దగా ఇంట్రెస్టు వుండదని తెలుసుగా నీకు?
నగలంటే ఏ ఆడపిల్లకు ఇష్టం ఉండదు! కానీ పరిస్థితుల వల్ల ఇష్టాయిష్టాలను చంపుకోవలసి వస్తుంది. ఇప్పుడు అచలది కూడా అదే పరిస్థితి. ‘‘తెలుసులే. నాకు తోడు రమ్మని అడుగుతున్నా. నాకంటే నువ్వు బాగా సెలక్షన్ చేస్తావని...”ఆ మాటకి పెద్దగా నవ్వాలి అనిపించింది. జీవితంలో అతి పెద్ద రాంగ్ సెలక్షన్ చేసిన నేనా బాగా సెలక్టు చేసేది అనుకుంది అచల.
‘‘సెలక్షనా? పాడా? నేనెప్పుడు నగలు కొన్నా?

అవునే పదేండ్ల నుండి నువ్వు నాకు పరిచయం. ఒక్క నగ కాని, చీర కాని కొన్నట్టు నేను చూడలేదు. నీ మెడలో సూత్రం తప్ప మరో నగ ఉండదు. గాజులు కూడా మట్టివే. మరీ అంత పిసినారి దానివేమే నువ్వు. అదేమంటే సింపుల్​గా ఉండటం అంటే ఇష్టం అంటావు. సంపాదించిందంతా ఏం చేస్తున్నావు?” అడిగింది నీరజ.
ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలని వున్నా అంతకు ముందు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పి చెప్పి అలసిపోయింది అచల. అందుకనే నీరజ వంక నిర్లిప్తంగా చూస్తూ జీవంలేని నవ్వు నవ్వి ఊరుకుంది. ఆ నవ్వుకు అర్థం ఏమిటో నీరజకు తెలుసు. ఇలా అడగటం మొదటిసారి కాదు చివరిసారి కాదు. ‘‘సరి సరి, ప్రతిదానికి ఓ నవ్వు నవ్వుతావు. నువ్వు, నీ సంపాదన, నీఇష్టం, నువ్వేం చేస్తే నాకెందుకు గాని, సాయంత్రం మాత్రం తప్పనిసరిగా నువ్వు నాతో రావాలి. నేనే మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటా.’’
‘‘ నీ కెందుకు శ్రమ? నేనే నేరుగా ఎగ్జిబిషన్ దగ్గరకి వచ్చేస్తా.’’ 
‘‘ఎలా వస్తావే? పోయిపోయి చౌకగా వస్తుందని ఊరికి దూరంగా ఇల్లు కట్టుకున్నావు. రావాలన్నా, పోవాలన్నా రెండు మూడు ఆటోలు మారాలి. అసలు నువ్వు ఆఫీసుకు ఎలా వస్తున్నావే ఇంత కష్టపడి?’’
‘‘అందులో కష్టమేముంది? మా ఇంటి నుండి సిటీలోకి వందల ఆటోలు. అక్కడి నుండి సిటీ బస్సులుంటాయి” అని అనటమైతే అన్నది కాని రోజు తను ఎంత కష్టపడుతుందో తలుచుకుంటే తన మీద తనకే జాలి వేస్తుంది. అప్రయత్నంగా కళ్ళ నుండి నీళ్ళు రాలాయి . బహుశా వాటికి కుడా అర్థమైందేమో తన బాధ .
‘‘అంత కష్టపడే బదులు ఒక స్కూటీ కొనుక్కుంటే సరిపోతుంది కదా? నీకు డ్రైవింగ్ వచ్చు కదా?’’ అంది నీరజ.
‘‘నీ అంత ధైర్యం నాకు లేదు” తన బేలతనాన్ని బయటపెట్టుకుంది అచల. అదే ఉండి ఉంటే తన బతుకు ఇలా ఎందుకు తగలడుతుంది అని మనసులో అనుకుంది.
 *   *   *
ఆఫీసులో పర్మిషన్ పెట్టి ఓ గంట ముందు బయల్దేరినా ఉపయోగంలేక పోయింది. బస్సు దొరక్క ఇంటికి వచ్చేసరికి ఆరయ్యింది. ఈ పాటికి నీరజ ఇంటి దగ్గర బయల్దేరి ఉంటుంది అనుకని బాత్రూంలోకెళ్ళి గబగబా రెండు చెంబుల నీళ్ళు గుమ్మరించుకుని బయటపడింది. చీర మార్చుకుని తయారవుతుంటే ‘ఎక్కడికి మళ్ళీ తయారవుతున్నావు? ఇప్పుడేగా ఆఫీసు నుంచి వచ్చావు?’ ఒక గున్న ఏనుగు లాంటి ఆకారం బెడ్ రూమ్​లోకి వస్తూ అడిగింది. ఆ ఆకారం పేరు వామనరావు. అచల మెడలో మూడు ముళ్ళు వేసిన మగాడు.

సమాధానం చెప్పకుండా అద్దంలో చూస్తూ బొట్టు పెట్టుకోసాగింది అచల. ‘‘నిన్నే అడిగేది. వినపడలేదా?’’  ఆ స్వరంలో ఆధిపత్య ధోరణి.
‘‘షాపింగ్​కు నీరజ తోడు రమ్మంది” ముక్తసరిగా జవాబిచ్చింది. 
‘‘ఇప్పుడు అదొక్కటి తక్కువయిందా?’’ ఈసారి బెదిరింపు ధోరణి.
‘‘రాననే చెప్పాను. ఇంటికొచ్చి మిమ్మల్ని అడిగే తీసుకెళ్తానంది” అనే ఆ మాటతో అహం చల్లబడిందేమో.. కాస్త మెత్తగా ‘‘వెళ్తే వెళ్ళావు. అడ్డమైనవి కొనకు. అసలే నెలాఖరు” అంటూ హెచ్చరించాడు.

మీరిచ్చే డబ్బులకి, ఆఫీసు నుంచి ఇంటికి కనీసం ఆటోలో కూడా రాలేక పోతున్నా. ఇంకేంటి నేను కొనేది’’ అని మనసులో అనుకుంది.
బయటకు మాత్రం‘‘ సరే” అంది అద్దం వైపు చూస్తూ. అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కనపడుతున్నాయి . తనని చూసి కాలేజీలో ఉన్నప్పుడు ఎంతమంది కుర్రాళ్లు వెంటపడ్డారో లెక్కలేదు. ఇప్పుడు చూస్తే... ఏదో అలికిడి కావడంతో వెనక్కి తిరిగింది. తన హ్యాండ్​బ్యాగ్ తీసుకుని దేనికోసమో వెతుకుతున్నాడు ఆ మనిషి.
‘‘ఏంకావాలి?” కొద్దిగా స్వరం పెంచింది. ‘‘ఎరియర్స్ వచ్చాయేమోన’’ని గొణిగాడు.

వస్తే మీకు తెలియకుండా వుంటుందా? ఒకటో తారీఖు జీతం రాగానే బ్యాంకు కొచ్చి మరీ పట్టుకెళుతున్నారుగా?’’ అంటూ భర్త చేతిలో బ్యాగు లాక్కుంది.
ఇద్దరివీ ప్రభుత్వ ఉద్యోగాలే. ఒక వెయ్యో, రెండు వేలో తనకే ఎక్కువ జీతం వస్తుంది. తన బ్యాంకు ఎకౌంటుకు అతని ఫోన్ నెంబరు లింక్ చేసుకున్నాడు. తన ఎకౌంట్​లో ఒక్కరూపాయి పడినా అతనికి మెసేజ్​ వెళ్తుంది. వెంటనే తన ఎకౌంట్లోకి మార్చుకుంటాడు. ఒకటో తారీఖు మాత్రం బ్యాంక్​కి వచ్చి తన జీతం డబ్బులు డ్రా చేయించి మరీ పట్టుకుపోతాడు.

 రెండు జీతాలేం చేస్తాడో ఇప్పటికీ తెలియదు. అప్పుడప్పుడు ఫోన్​లో విన్న మాటల్ని బట్టి వడ్డీలకు తిప్పుతున్నాడని అర్థమైంది. అతను పూర్తి డబ్బు మనిషి అని, పెళ్ళైన మొదటిరోజే తెలిసింది తనకు. శోభనం రోజూ ఎవరన్నా భార్యతో తీయగా మాట్లాడతారు. కానీ ఈ మనిషి నాతో మాట్లాడిన మొదటి మాట‘‘నీ జీతం ఎంత?’’ అని.
సరదాగా అడుగుతున్నాడేమో అనుకుని జవాబు చెప్పాను నవ్వుతూనే. ఎందుకంటే మా నాన్న కూడా ఏనాడూ ‘‘జీతం ఎంత?’’ అని అడగలేదు. ఆ ప్రశ్న మొదటిసారి వినటం. ఓ నిమిషం ఏదో ఆలోచిస్తున్న వాడిలా కళ్ళు మూసుకున్నాడు.. ‘‘ఏంటి ఈ మనిషి’’ అనుకుని దగ్గరకు జరగబోయాను.
‘‘ఉద్యోగం వచ్చి రెండేళ్ళు అయ్యింది కదా?” కళ్ళు మూసుకునే అడిగాడు. ‘‘అవును’’ అంటూ అతని చేతిని నా చేతిలోకి తీసుకోబోయా.
‘‘ఒక్క నిమిషం ఆగలేవా?’’ అంటూ తన చెయ్యి వెనక్కు లాక్కుంటూ కళ్ళు తెరిచాడు.
ఆ మాటతో నేను సిగ్గుతో చచ్చిపోయాను.


‘‘అంటే నీ దగ్గర ఐదారు లక్షల దాకా క్యాష్ ఉండాలే?” అన్నాడు.
ఒక్క నిమిషం అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు.
‘‘నెలకు నలభై వేలంటే.. ఖర్చులు పోను నెలకి ఒక పాతిక వేలన్నా వెనకేసి వుండాలి’’ ఇందాకటి మాటలు కొనసాగిస్తూ అన్నాడు..
అవునన్నట్లు మౌనంగా తల ఊపాను. 


‘‘ఆ డబ్బంతా ఏం చేశావు? ’’ ఏ ఆడపిల్లకు ఇటువంటి ప్రశ్నలు శోభనం రోజున ఎదురై ఉండవు.
‘‘శోభనం రోజున ఒక భర్త భార్యను అడిగే ప్రశ్నలా ఇవి. ఏమిటి ఇతగాడి వైఖరి” అనుకుంటుంటే.. ‘‘నిన్నే అడిగేది” అని గట్టిగా అరిచాడు.
ఆ అరుపుతో భయంగా అతనికి దూరంగా జరిగి ‘‘నాపెళ్ళికి ఖర్చయ్యింది’’ అని చెప్పాను. అదే నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు. ఆ రోజు భయపడిపోయాను. అలా భయపడిన భయం ఈ రోజుకీ  భయపడుతూనే ఉంది. ఆ రోజే ‘‘నా జీతం నా ఇష్టం. మీకెందుకు చెప్పాలి’’ అని ఎదిరించి ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో? బయట నుండి కారు హారన్ పెద్దగా మోగటంతో ఇద్దరం బెడ్​రూమ్​లో నుండి బయటకొచ్చాం. ఈ లోపు నీరజ ఇంట్లోకి రానే వచ్చింది. 
నావంక చూస్తూ ‘‘వెళ్దామా?’’ అన్నది.


‘‘ఎక్కడికి?’’ తెలియనట్లు అడిగాడతను.
‘‘ఏమే చెప్పలేదా అన్నయ్య గారికి”ఎదురు ప్రశ్న వేసింది నీరజ.
సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక ‘‘ఇప్పుడేగా వచ్చింది” అన్నాను అతని వంక చూస్తూ.
‘‘జువెలరీ ఎగ్జిబిషన్​కి వెళ్తున్నాం అన్నయ్యగారు. కొత్త మోడల్స్ వచ్చాయట”చెప్పింది నీరజ. అతను ‘‘ఓ... అలాగా నువ్వు కూడా ఏమన్నా కొనుక్కోవోయ్” అన్నాడు నావంక వెకిలి నవ్వు ఒకటి విసురుతూ.


 ‘‘నేనూ అదే చెపుతున్నాను అన్నయ్యగారు. వట్టి పిసినారిది” అంది నీరజ.
‘‘అవునండి ఎంత చెప్పినా వినదు. ఏదీ కొనటానికి మనసొప్పదు. డబ్బు ఉన్నప్పుడే అనుభవించాలి. డబ్బులేమన్నా మనతో కట్టుకుపోతామా?” అన్నాడు. అతని మాట నిజమనుకుని కొంటే ఏం జరుగుతుందో తెలిసిన దాన్ని కాబట్టి ‘‘ఇప్పుడెందుకు లెండి” అంటూ సున్నితంగా తిరస్కరించాను.

‘‘పర్వాలేదులే నీ దగ్గర క్రెడిట్ కార్డు వుంది కదా? నీకు నచ్చింది కొనుక్కో”అన్నాడు. పెళ్లయిన కొత్తలో ఇలాగే క్రెడిట్ కార్డు ఇచ్చి కొనుక్కోమంటే నిజమనుకుని షాపింగ్​కు వెళ్ళాను. తీరా బిల్లు కట్టేటప్పుడు తెలిసింది. ఎకౌంట్​ బ్లాక్ చేసి వుందని. ఆ రోజు నుండి చిన్నగా అర్థమవుతూ వచ్చింది అతని ఆంతర్యం. కోటీశ్వరుడు కావాలనే కలను నర నరాల్లో జీర్ణం చేసుకుని, అందుకోసం అమానవీయంగా ప్రవర్తిస్తుంటాడని. సొంత పెళ్ళానికి రూపాయి ఇవ్వని వాడికి పిల్లలెందుకు? అనుకున్నాడేమో ఆ భగవంతుడు మాకు పిల్లలు లేకుండా చేసాడు. అదీ ఒకందుకు మంచిదే? నేను కాబట్టి ఏ సుఖం, సంతోషం లేని జీవితం రాజీ పడిపోయి గడుపుతున్నా కానీ పిల్లలు అలా రాజీపడలేరు కదా?
 
‘‘అంటే మీ నాన్న నువ్వు సంపాదించిన డబ్బులతో నిన్ను వదిలించుకున్నాడన్న మాట’’.
ఆ మాటలకు మరొకళ్ళు మరొకళ్ళు అయితే ఏం చేసే వాళ్ళో తెలియదుకాని, నాకు మాత్రం ఎవరో గుండెల్లో నేరుగా గునపాలు దించినట్లనిపించింది. కని, పెంచి, చదువులు చెప్పించి, ఉద్యోగాలు వచ్చే దాకా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన కన్న తండ్రి కోసం- కూతురు రూపాయి ఖర్చుపెట్టే అధికారం లేదు.

ఎవడో ముక్కు మొఖం తెలియని వాడు మూడు ముళ్ళు వేసిన పాపానికి సర్వం దోచిపెట్టాలా? ఇదెక్కడి సంప్రదాయం? ఆ రాత్రి నాకు కాళరాత్రే అయ్యింది. కనీసం మంచీమర్యాద లేకుండా బంధువులందరిముందు నే సంపాదించిన డబ్బు గురించి పెద్ద పంచాయితీనే నడిచింది. వాళ్ళ నాన్న కూడా సిగ్గు లేకుండా కొడుకునే సమర్ధించాడు. ఒక దశలో నాన్న పెళ్ళి రద్దు చేసుకుందామన్నాడు. కానీ అమ్మ... ఆడపిల్ల వాళ్ళం ఇంత దూరం వచ్చిన తరువాత మళ్ళీ రేపు ఇంకొకరు చేసుకోవాలిగా. ఆ వచ్చేవాడు ఎలా ఉంటాడో తెలియదని నచ్చచెప్పటంతో ఐదులక్షలు తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు.

ఆ పరిస్థితుల్లో ఓ ఆడపిల్ల కన్న తండ్రి, మనో వేదన ఎలావుంటుందో అర్ధం చేసుకోలేని ఆ డబ్బు మనిషి మానాన్న చేత ఐదులక్షలకీ రెండు రూపాయల వడ్డీతో నోటు రాయించుకున్నాక కాని శోభనానికి ఒప్పుకోలేదు. ఆ రోజే నేను ధైర్యం చేసి, ‘‘ఇతను నాకొద్దు నాన్నా” అని గట్టిగా చెప్పి ఉంటే జీవితం ఇంకోలా ఉండేదేమో!? మనిషి నెమ్మదిగా మారతాడులే అని ఆరోజు రాజీపడటంతో జీవితం మొత్తం ముళ్ళ మీద నడకలా తయారైంది.

అతనికి ఏ చెడు అలవాట్లూ లేవు. చూసేవాళ్ళకు శ్రీరామచంద్రుడిలా కనపడతాడు. కానీ డబ్బు దగ్గర కొచ్చేసరికి మాత్రం రావణుడే. ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే. ఒక పూట కూర మిగిలినా, అన్నం మిగిలినా ఆ రోజు ఇంట్లో పెద్ద యుద్ధమే. కన్న తల్లిదండ్రులను ఒక పూట ఇంటికి పిలిచి ఒక ముద్ద పెట్టుకోలేని అసమర్ధత నాది. మొదట్లో నా భయానికి, అసమర్ధతకి నామీద నాకే అసహ్యం వేసేది. ఎందుకు ఎదురు తిరగలేకపోతున్నానో నాకే అర్ధమయ్యేది కాదు.

బహుశా సమాజానికి భయపడి కావచ్చేమో. నా తల్లిదండ్రుల గౌరవానికి భంగం కలిగించటం ఇష్టం లేక కూడా కావచ్చు. కారణం ఏదైతేనేం సర్దుకుపోవడం నేర్చుకున్నా. ఇప్పుడు నాకు డబ్బులతో పెద్దగా అవసరం. లేదు. ఒక దశలో ఉద్యోగం కూడా మానేద్దాం అనుకున్నా. కానీ ఆ డబ్బు మనిషి అన్నం కూడా పెట్టడేమోనని భయపడి కంటిన్యూ చేస్తున్నా.
 
కాలం మనకోసం ఆగదు కదా. ఏళ్ళు గడిచే కొద్దీ నాలో కూడా ధైర్యం పెరుగుతూ వచ్చింది. అతన్ని ఎప్పుడు వదిలించుకుందామా? అని రోజూ ఆలోచించే దాన్ని.
ఒకరోజు ఆఫీసులో పనిలో ఉండగా అటెండర్ వచ్చి ‘‘మేడమ్, మీ వారి ఆఫీస్​ నుంచి ఫోన్ వచ్చింది. సార్​కి హార్ట్ ఎటాక్ వచ్చిందట. హాస్పిటల్​కి తీసుకెళ్తున్నారట.  మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు’’ అంటూ చెప్పాడు.

ఇంకొకరి భార్య అయితే ఆ మాటలు విని కుప్పకూలిపోయేది. కాని నాకెందుకో ఏమి అనిపించలేదు. బహుశా ఆ వార్త ప్రతి రోజూ వినాలని కోరుకుందేమో నా మనసు నాకు తెలియకుండా. ఈ రోజుకు అది చెవులకు వినపడింది అంతే. అటెండర్ వంక చూస్తూ ‘‘సరే, నువ్వు వెళ్ళు” అని చేస్తున్న పని ఆపి పైకి లేచాను. 
అటెండర్ మాటలు విన్నదేమో ‘‘తోడు రమ్మంటావా?’’ ఏడుపు మొఖం పెట్టి అడిగింది నీరజ. నాకే ఏడుపు రావట్లేదు. పిచ్చిది పాపం నీరజ స్నేహం విలువ తెలిసింది కాబట్టి కళ్ళల్లో నీళ్ళు నింపుకుంది.

‘‘పర్వాలేదు. ఐ విల్ మేనేజ్” అంటూ తన భుజం మీద చెయ్యి వేసి మెత్తగా నొక్కాను. బ్యాగు సర్దుకుని, బయటకు నడిచాను. నేరుగా హాస్పిటల్ ఐసీయూకి చేరుకున్నా. నన్ను చూడగానే అక్కడ ఉన్న అతని కొలీగ్ ఒకతను నన్ను గుర్తుపట్టి ‘‘మేడమ్, మధ్యాహ్నం ఏదో ఫోన్ వచ్చింది. ఫోన్​లోనే అవతలి వ్యక్తితో పెద్దపెద్దగా గొడవపడ్డారు. ఆ తరువాత గంటకి గుండె నొప్పి అంటూ టేబుల్ మీద ఒరిగి పోయారు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

‘‘ఇప్పుడే వస్తాను” అని అతనితో చెప్పి ఐ.సి.యు. లోపలికెళ్ళాను. వెంటిలేటర్​ పెట్టారు. కళ్ళు మాత్రం తెరిచేఉన్నాయి. నావంకే చూస్తున్నట్టున్నాయి. నాకు తెలియకుండానే కళ్ళనుండి కన్నీరు కారింది. అది సంస్కారం అని నా మోడుబారిన గుండెకు కళ్ళు చెప్పుతున్నాయేమో? ఇంక అక్కడ వుండి చేసేదేమి లేక బయటికి వచ్చాను.
‘‘డాక్టరుగారు ఇందాక వచ్చి చూశారు. కష్టం అంటున్నారు’’ అన్నాడు కొలీగ్.
‘‘ఎందుకు గొడవ పడ్డారు” అడగకూడదు అనుకుంటూనే అడిగాను.

‘‘సార్, అందరికీ వడ్డీకి అప్పులిస్తారని తెలుసుగా మేడమ్. నాకు తెలిసినంత వరకు ఎవరో ఒక రాజకీయ నాయకుడికి పెద్ద మొత్తం అప్పిచ్చారు. అతనేమో ఎలక్షన్లలో ఓడిపోయాడు. బహుశా తీసుకున్న డబ్బు ఇవ్వను అనుంటాడు. వాళ్ళ మాటల్ని బట్టి నాకు అర్ధమైంది అదే మేడం. నాక్కూడా పూర్తిగా తెలియదు’’ తనకు తెలిసినంత వరకు చెప్పాడు.
నర్సు వచ్చి ‘‘డాక్టరు రమ్మంటున్నాడు’’ అంటే ఇద్దరం అక్కడకు వెళ్ళాం.
మమ్మల్ని చూడగానే ‘‘ మీరేనా ఆయన మిసెస్‘‘ అన్నాడు.

‘‘అవును” అన్నాను నిర్లిప్తంగా.
‘‘నా వాలకం చూసి ఏమనుకున్నాడో ఏమో? కండిషన్ క్రిటికల్​గానే ఉంది. ఓ నాలుగు రోజులు వెంటిలేటర్ మీద ఉంచితే కానీ ఏ విషయం చెప్పలేం” అన్నాడు.
‘‘ఎంతవుంటుంది రోజుకి’’ అని అనాలోచితంగా అడిగాను.


నా ప్రశ్న విని డాక్టరుతో పాటు, అతని కొలీగ్ కూడా నా వంక అదోలా చూశారు. ఇంకొకళ్ళయితే డాక్టరు మాటలకు భోరు భోరున ఏడ్చి, ఎలాగోలా బతికించమని వేడుకునే వాళ్ళు. తప్పో ఒప్పో నాకు మాత్రం ఎందుకో అలా అడగాలని అనిపించలేదు. ఈసారి మాత్రం నా మనసు చెప్పినట్టు నడుచుకోవాలి అనిపించింది. చాలా కాలంగా భయపడటం మానేశాను. ఎందుకంటే ఎప్పటి నుండో మానసికంగా ఒంటరి బతుకు బతుకుతున్నాను. అతను ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే... పెద్ద తేడా ఏమీ ఉండదు.
‘‘లక్ష వరకూ అవుతుంద’’ని గొణిగాడు డాక్టర్.

‘‘డిశ్చార్జ్ చెయ్యండి’’ అన్నాను.
‘‘ఓ రెండురోజులు వెంటిలేటర్ మీద ఉంచి చూస్తే..” అని నసిగాడు అతను నావంక చూస్తూ.
‘‘మీరు కడతారా ఆ డబ్బు’’ అని అతని ముఖంలోకి చూస్తూ అడిగాను.
నా ఆంతర్యం అర్ధమైన వాడిలా మౌనంగా తల దించుకున్నాడు. డాక్టరుకి కూడా అర్ధమై ఉండొచ్చు ‘‘ఓకే,  సిస్టర్ డిశ్చార్జి చెయ్యండి’’ అన్నాడు అక్కడి నుంచి కదులుతూ.
‘‘నాకో సాయం చేస్తారా?’’ మెడలో నుండి సూత్రం తీస్తూ అడిగాను అతని కొలీగ్​ని.
‘‘చెప్పండి.. ” అన్నాడు కాస్త సిగ్గుగా.

దీన్ని ఎక్కడన్నా అమ్మి, డబ్బు తెస్తారా?’’  దాని అవసరం ఇక లేదని మనసులో అనుకుంటూ అడిగాను.
అప్పటికి కాని నేను ఎందుకు డిశ్చార్జ్ చెయ్యమన్నానో అతనికి అర్థం కాలేదు. అతను దాన్ని అమ్మి డబ్బు తెచ్చేటప్పటికి ఓ గంట పట్టింది. ఈ లోపు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి, అతన్ని అంబులెన్సులోకి ఎక్కించారు. అక్కడి వర్కర్స్​లో ఒకతను హాస్పిటల్ బిల్ పే చేసి, మిగతా డబ్బు నా చేతికి ఇచ్చి ‘‘మీరు అంబులెన్సులో పదండి. నేను వెనకాల బండి మీద వస్తాను’’ అన్నాడు.
‘‘సరే’’ అన్నట్లు తలూపి అంబులెన్స్ ఎక్కి కూర్చున్నా. అంబులెన్స్​ బయల్దేరింది.

లోపల ఎ.సి. కావటంతో బయటి సౌండ్స్​ ఏవీ వినపడట్లేదు. అతను ఊపిరి తీయడం, వదలడం మాత్రం స్పష్టంగా వినపడుతోంది. ఆ శబ్దం నన్ను ఇంకా శాసించటానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. మౌనంగా, ధైర్యంగా అతని కళ్ళ వంకే చూస్తూ కూర్చున్నాను. భయపడ్డాడో, ఏమో శ్వాస తీసుకోవటం ఆపేశాడు. బహుశా అప్పటికి గాని అర్ధమై ఉండదు జీవితం వ్యాపారం కాదని. నిదానంగా అతని రెండు కళ్ళు మూతలు పడ్డాయి. ఈసారి నా కళ్ళు నా మనసుకు తెలియకుండా కన్నీళ్ళు రాల్చలేదు. బహుశా కళ్ళకు కూడా ధైర్యం నూరిపోసింది కాబోలు నా మనసు.

ఈదర శ్రీనివాసరెడ్డి  ఫోన్​: 7893111985