సికింద్రాబాద్,వెలుగు: నగలు చోరీ చేసిన నిందితుడిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద రూ.20వేల విలువైన బంగారు (ఇయర్ రింగ్స్,మాటీలు) ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఓయూ డివిజన్ఏసీపీ జగన్మీడియాకు వివరాలు వెల్లడించారు. నార్త్ లాలాగూడ పరిధి ఇందిరానగర్ కు చెందిన వి.శాంతమ్మ (65) ఈనెల27న లాలాపేటలోని కల్లు దుకాణానికి వెళ్లి తాగింది.
ఆ తర్వాత మత్తులో కళ్లు తిరగడంతో తార్నాక వైపు వెళ్లి, అక్కడి నుంచి అడిక్ మెట్ వైపు నడుచుకుంటూ వెళ్లింది. సాయంత్రం 5 గంటల వరకు అడిక్మెట్ లోనే అటూ ఇటూ తిరిగిన ఆమె మత్తు వదలగానే తిరిగి మాణికేశ్వరీ నగర్ కు వెళ్తుంది. హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో మాణికేశ్వరినగర్ కు చెందిన ఓర్సు గిరి (38) ఆమె చెవి రింగులు, మాటీలను లాక్కొని పారిపోయాడు. దీంతో శాంతమ్మ చెవులకు గాయాలై రక్తం కారడంతో పెట్రోల్ బంక్ వద్ద స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు108లో గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం నిందితుని ఇంటి వద్ద అరెస్ట్ చేసి పీఎస్ కు తీసుకొచ్చి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు లేబర్ కావడంతో మద్యానికి అలవాటు పడి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. గిరిని అరెస్టు చేసి దొంగిలించిన ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ జగన్ తెలిపారు. ఓయూ ఇన్ స్పెక్టర్ రాజేందర్, డీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రవికుమార్ తదితరులు ఉన్నారు.