ఉత్తరప్రదేశ్: శుక్రవారం(నవంబర్ 15) రాత్రి 10.45 గంటల ప్రాంతంలో ఝాన్సీ జిల్లాలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీ పిల్లల వార్డులో మంటలు వ్యాపించి 10 మంది శిశువులు సజీవదహనమయ్యారు. మరో 16 మంది పిల్లలు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. 24 గంటల్లో నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
మరణించిన 10 మంది నవజాత శిశువుల్లో 7 మందిని గుర్తించారు. ముగ్గురి వివరాలు ఇంకా గుర్తించాల్సి ఉంది. అవసరమైతే ఈ ముగ్గురికి DNA పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ. 5లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల పరిహారం ప్రకటించింది యూపీ ప్రభుత్వం.
ALSO READ : ఆస్పత్రిలో మంటలు.. 10 మంది చిన్నారులు మృతి
ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లోపల..!
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తేల్చారు. ప్రధానంగా, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లోపల షార్ట్ సర్క్యూట్ అయ్యిండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట సైతం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ముర్ము
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో 10 మంది మంది నవజాత శిశువులు మరణించారనే వార్త తనను కలిచివేసిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులకు, కుటుంబాలకు దేవుడు మరో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. గాయపడిన శిశువులు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.