సివిల్ సర్వీసెస్ టాపర్ అనుమానాస్పద మృతి.. పక్క పక్క గదుల్లో సోదరుడు, తల్లి శవాలు

సివిల్ సర్వీసెస్ టాపర్ అనుమానాస్పద మృతి.. పక్క పక్క గదుల్లో సోదరుడు, తల్లి శవాలు

2003 జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) పరీక్షల్లో టాపర్‌ షాలిని విజయ్(35) అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. పక్కనే ఆమె సోదరుడు మనీష్ విజయ్(IRS అధికారి), తల్లి శకుంతల అగర్వాల్ శవాలు పడి ఉన్నాయి. కేరళ, కొచ్చిలోని ప్రభుత్వ వసతి గృహంలో వీరి శవాలు లభ్యమయ్యాయి. 

ముగ్గురి మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయి. షాలిని సోదరుడు మనీష్(42) సెంట్రల్ టాక్స్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఆఫీసులో అదనపు కమిషనర్‌. మనీష్, షాలిని మృతదేహాలు వేరు వేరు గదుల్లో ఉరికొయ్యలకు వేలాడుతూ ఉండగా.. తల్లి శకుంతల మరో గదిలో చనిపోయి పడి ఉంది. ఈ ముగ్గురివి ఆత్మహత్యలుగా కేరళ పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి చనిపోయాక కొడుకు, కూతురు ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఇతర కోణాలల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :- హోటల్ టెర్రస్పై మహిళపై గ్యాంగ్ రేప్

మనీష్ డైరీలో ఫిబ్రవరి 15 తేదీ రాసినట్లు ఉన్న సూసైడ్ నోట్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. అందులో ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న వారి చెల్లెలికి కొన్ని పత్రాలను అందజేయాలని రాసి ఉన్నట్లు వెల్లడించారు. ఆ నోట్‌లో ఆమె ఫోన్ నంబర్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె స్వదేశానికి వస్తే, వీరి మృతుల మిస్టరీ బయట పడుతుందేమో చూడాలి.

పరీక్షల అవకతవకలపై సీబీఐ దర్యాప్తు.. 

2003లో JPSC నిర్వహించిన కంబైన్డ్ పరీక్షల్లో రిక్రూట్ అయిన 64 మంది సివిల్ సర్వెంట్లలో షాలిని టాపర్‌గా నిలిచింది. కట్ చేస్తే.. కొంతమంది అభ్యర్థులు ఆ నియామక ప్రక్రియను హైకోర్టులో సవాలు చేశారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో చాలా మంది రాజకీయ నాయకులు లేదా అధికారులతో సంబంధం కలిగి ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దాంతో, ఝార్ఖండ్ హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. ఏళ్లు గడుస్తున్నా.. ఆ దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో 2022లో కేసును సీబీఐకి బదిలీ చేసింది.

షాలిని సహా ఇతర అభ్యర్థుల నియామకాలపై ఐపీసీ సెక్షన్లు 420 (మోసం), 423 (మోసపూరిత డాక్యుమెంటేషన్), 201 (సాక్ష్యాల ధ్వంసం) కింద, అవినీతి నిరోధక చట్టంలోని 13(2), 13(1)(డి) సెక్షన్లతో పాటు ఇతర నేరాల కింద సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల ఫిబ్రవరి 27కి జరగనుంది. ఇంతలోనే ఆమె శవమై కనిపించడం.. సీబీఐ దర్యాఫ్తు కారణమై ఉంటుందేమో అన్న మరో కోణాన్ని చూపుతోంది. అయితే, ఆమె సోదరుడు ఎందుకు చనిపోయారనేది అంతుపట్టని విషయం.