టార్గెట్-65తో జార్ఖండ్ బరిలోకి బీజేపీ!

19 ఏళ్ల కింద బీహార్ నుంచి విడిపోయి ఏర్పడ్డ చిన్న  రాష్ట్రం జార్ఖండ్. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత జరగబోతున్న మూడో అసెంబ్లీ ఎన్నికలివి. అంతేకాదు ఈ ఏడాదికి ఇవే చివరి అసెంబ్లీ ఎన్నికలు. దీంతో జార్ఖండ్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండోసారి అధికారంలోకి రావడానికి పక్కా ప్లాన్​తో రెడీ అవుతోంది. మరోవైపు నుంచి కాంగ్రెస్ కూడా కసరత్తు మొదలెట్టింది. జార్ఖండ్​లో ఇప్పటివరకు ఆరుగురు సీఎంలైనా కాంగ్రెస్​ ఒక్కసారికూడా అధికారంలోకి రాలేదు.

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు పూర్తిగా ఒక కొలిక్కి రాకుండానే జార్ఖండ్​లో ఎన్నికలకు షెడ్యూల్​ విడుదలైంది. బీజేపీ అధికారంలో ఉన్నచోట ఎన్నికలు జరగడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. పైగా, ఈ ఏడాదికి ఇవే చివరి ఎన్నికలు. ప్రతి ఎన్నికలోనూ ఒక టార్గెట్​ పెట్టుకుని బీజేపీ బరిలో దిగుతుంది. హర్యానాలో టార్గెట్​–75, మహారాష్ట్రలో టార్గెట్​–220+ అనుకుని ఎలక్షన్స్​కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జార్ఖండ్  ఎన్నికల్లో టార్గెట్​–65 ఫిక్స్​ చేసుకుంది. జార్ఖండ్​లోని మొత్తం 81 సీట్లలో కనీసం 65 సీట్లను గెలుచుకోవాలనుకుంటోంది. ఈ టార్గెట్ సాధించడానికి ముఖ్యమంత్రి రఘువర్ దాస్ లోక్​సభ ఎన్నికలప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టారు. గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉన్న సీట్లలో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడానికి పక్కా ప్లాన్​తో  ముందుకెళ్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రం సహజంగా రాజకీయ అస్థిరతకు మారు పేరు. ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ ఇప్పటివరకు 10 ప్రభుత్వాలు ఏర్పడగా, ఆరుగురు సీఎంలయ్యారు. మూడుసార్లు రాష్ట్రపతి పాలన వచ్చింది. బీజేపీ తరఫున బాబూలాల్​ మరాండీ, అర్జున్​ ముండా గతంలో సీఎంలుగా పనిచేసినా, పూర్తిగా అయిదేళ్లు చేయలేదు. రఘువర్​ దాస్​ ప్రభుత్వమే అయిదేళ్ల కాలపరిమితిని విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది.

ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం అనేక రంగాల్లో విజయాలు సాధించిందని రఘువర్ దాస్ అంటున్నారు. అభివృద్దినే ప్రచారాస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నామని రఘువర్ చెబుతున్నారు. అవినీతిని చాలా వరకు తగ్గించామని, రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు అదుపులో ఉన్నాయని ధీమాగా ఉన్నారు. గిరిపుత్రులకు ఉద్యోగావకాశాలు కల్పించడంకూడా బీజేపీకి కలిసొచ్చే అంశమే. ఇవన్నీ ఎన్నికల్లో తమకు గెలుపును అందిస్తాయని రఘువర్ దాస్ నమ్మకంగా ఉన్నారు.

బీజేపీలోకి వలసలు

తాజా లోక్​సభ ఎన్నికల్లో మొత్తం 14 సీట్లకుగాను 12 సీట్లను బీజేపీనే గెలుచుకుంది. ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై తప్పక పడుతుందంటున్నారు ఎనలిస్టులు. నాలుగు కాలాలపాటు రాజకీయాల్లో కొనసాగాలనుకునే లీడర్లు ఇప్పటికే బీజేపీలోకి జంప్ చేయడం మొదలెట్టారు. సాదా సీదా లీడర్లే  కాదు, ఎమ్మెల్యేలు కూడా బీజేపీ కండువా కప్పుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించడానికి ముందే ప్రతిపక్షాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వీరిలో కాంగ్రెస్​కు చెందిన సుఖ్​దేవ్ సింగ్ భగత్, మనోజ్ యాదవ్ ఉన్నారు.  సుఖ్​దేవ్ సింగ్ గతంలో జార్కండ్​ పీసీసీ ప్రెసిడెంట్​గా పనిచేశారు. వీరితోపాటు జేఎంఎంకు చెందిన కునాల్ సారంగి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే భాను ప్రతాప్ సాహి కూడా బీజేపీలో చేరారు. జార్ఖండ్ మాజీ డీజీపీ దినేష్ కుమార్ పాండే, ఐఏఎస్ మాజీ అధికారి సుచిత్రా సిన్హా ఇటీవల కాషాయ కండువా కప్పుకోగా, పలువురు బ్యూరోక్రాట్లు కూడా లైన్​లో ఉన్నారు.

లేటెస్ట్​గా జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. హర్యానాలో కొత్త గా పుట్టుకొచ్చిన ‘జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ)’ మద్దతుతో మనోహర్​లాల్​ ఖట్టర్​ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమి మేజిక్ ఫిగర్​సాధించినా ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు. గతంతో పోలిస్తే బీజేపీకి సీట్లు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో జార్ఖండ్​లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతర్గత కుమ్ములాటల్లో కాంగ్రెస్

అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే జార్ఖండ్​లోనూ కాంగ్రెస్​ పార్టీ అంతర్గతంగా కుదురుగా లేదు. ఒకపక్క అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చినాగానీ కాంగ్రెస్ గందరగోళంగానే ఉంది. ఇక్కడ పార్టీని నడిపించే నాయకుడంటూ ఎవరూ కనిపించడం లేదు. కుమ్ములాటలు మైనస్ పాయింట్​గా మారొచ్చన్న అభిప్రాయం ఎనలిస్టుల్లో ఉంది.  అయితే, పరిస్థితి చక్కదిద్దడానికి  హైకమాండ్​ స్థాయిలో సీనియర్లు కృషి చేస్తున్నారు. పీసీసీ మాజీ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ సెప్టెంబరులో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరిపోయారు. ఇదిలాఉంటే, రఘువర్ దాస్  ప్రభుత్వ వైఫల్యాలే తమ ప్రచారానికి ఆయుధాలు అంటున్నారు జార్ఖండ్ పీసీసీ ప్రెసిడెంట్ రామేశ్వర్ ఓరాన్. ఐదేళ్లలో అన్ని రంగాల్లోనూ రఘువర్ ప్రభుత్వం ఫెయిలైందని ఆరోపించారు. ఛోటా నాగపూర్ కౌలు చట్టం, సంతాల్ పరగణా కౌలు చట్టాలను సవరించడానికి బీజేపీ సర్కార్ చేసిన ప్రయత్నాలు గిరిజనుల్లో వ్యతిరేకత పెంచాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

ఈ వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి శిబూ సోరెన్ నాయకత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)తో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగా జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరేన్​తో చర్చలు జరపాలని పీసీసీ ప్రెసిడెంట్ ఓరాన్ డిసైడయ్యారు. అయితే ఇప్పటివరకు వీటి మధ్య సీట్ల సర్దుబాటుపై అడుగు ముందుకు పడలేదు.

రాష్ట్రంలో ప్రధాన పార్టీలు

జార్ఖండ్​లో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ), కాంగ్రెస్, శిబూ సోరెన్ నాయకత్వాన గల జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), బాబూలాల్ మరాండీ నాయకత్వాన గల జార్ఖండ్ వికాస్ ముక్తి మోర్చా (జేవీఎం–ప్రజాతాంత్రిక్), రాష్ట్రీయ జనతాదళ్, లెఫ్ట్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. వీటిలో బీజేపీ, ఏజేఎస్యూ కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ కూటమిలో జేఎంఎం, జేవీఎంపీ చేరే అవకాశాలున్నాయి.

67 అసెంబ్లీ సీట్లలో మావోయిస్టుల ప్రభావం

రాష్ట్రంలో 67 అసెంబ్లీ సీట్లలో మావోయిస్టుల ప్రభావం బలంగా ఉంది. ఇక్కడి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులపై పట్టు పెంచుకోవడానికి మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ కారణంతో ఇక్కడ  ఐదు విడతల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.