66 మందితో బీజేపీ MLA అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. మాజీ సీఎం పోటీ అక్కడినుండే

66 మందితో బీజేపీ MLA అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. మాజీ సీఎం పోటీ అక్కడినుండే

రాంచీ: హర్యానాలో హ్యాట్రిక్ విజయంతో జోష్‎లో ఉన్న బీజేపీ.. వచ్చే నెల(నవంబర్)లో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల కంటే ముందే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. 2024, అక్టోబర్ 19వ తేదీన బీజేపీ 66 మందితో కూడిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కాషాయ పార్టీ విడుదల చేసింది. జార్ఖండ్‎లో మొత్తం 81 అసెంబ్లీ సీట్లు ఉండగా.. 68 చోట్ల పోటీ చేస్తోన్న బీజేపీ.. మిగిలిన 13 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది. సీట్ల షేరింగ్ ఫార్ములా ప్రకారం.. జార్ఖండ్‌లో బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ 2, ఎల్‌జేపీ-ఆర్‌వీ 1 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. 

బీజేపీ తమ 68 సీట్లకు గానూ తొలి జాబితాలో 66 స్థానాలకు అభ్యర్థులను పేర్లను ప్రకటించింది. మరో రెండు స్థానాలకు క్యాండిడేట్ల పేర్లను అనౌన్స్ చేయాల్సి ఉంది. ఫస్ట్ లిస్ట్‎లో కీలక నేతలకు కమలం పార్టీ ఎమ్మెల్యే టికెట్లు కన్ఫామ్ చేసింది. జార్ఖండ్  బీజేపీ చీఫ్, మాజీ సీఎం బాబూలాల్ మరాండీ ధన్వార్ స్థానం నుండి బరిలోకి దిగనున్నారు. అధికార జేఎంఎం పార్టీ అధినేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ జమ్తారా స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఇక, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల జేఎంఎం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సీనియర్ నేత చంపై సోరెన్ సరైకెల్లా స్థానం నుండి బరిలోకి దిగబోతున్నారు. 

ALSO READ | లెక్క తేలింది: జేఎంఎం, కాంగ్రెస్ సీట్ల షేరింగ్‎పై వీడిన ఉత్కంఠ

కోడెర్మా నుండి డాక్టర్ నీరా యాదవ్, జగన్నాథ్‌పూర్ నుండి గీతా కోడా, డియోఘర్ నుండి నారాయణ్ దాస్, బర్హి నుండి మనోజ్ యాదవ్, హజారీబాగ్ నుండి ప్రదీప్ ప్రసాద్, ఝరియా నుండి రాగిణి సింగ్ వంటి ప్రముఖులు తమ అదృష్టం పరిక్షించుకోబోతున్నారు. కాగా, 2024, అక్టోబర్ 15వ తేదీన  కేంద్ర ఎన్నికల సంఘం  జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. జార్ఖండ్ లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఈసారి రెండో దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల (నవంబర్) 13న ఫస్ట్ ఫేజ్, 20న సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. 23న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి.