జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గనుల లీజును తనకు తానే కేటాయించుకోవడం వివాదాస్పదమైంది. ఇది మరో లాభదాయకమైన పదవి పొందడం కిందికి వస్తుంది. ఈ విషయమై గవర్నర్ రమేశ్ బైస్ కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం కోరారు. ఈసీ తన అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో గవర్నర్కు పంపింది. భారత రాజ్యాంగం ప్రకారం ఈసీ నిర్ణయాన్ని గవర్నర్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇది కరెంట్ పాలిటీలో భాగం. పోటీ పరీక్షల దృష్ట్యా పార్లమెంట్, శాసనసభ సభ్యుల అనర్హతలు, రాజ్యాంగంలోని అధికరణలు, ప్రజాప్రాతినిధ్య చట్టం గురించి తెలుసుకుందాం.
ఆర్టికల్ 101 ప్రకారం ద్వంద్వ సభ్యత్వం నిషేధం
- 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం(ఆర్పీఏ–1951) ప్రకారం కింది పరిస్థితుల్లో ద్వంద్వ సభ్యత్వం ఉన్నప్పుడు ఒక సభ సీటు వదులుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి పార్లమెంట్లో ఉభయసభలకు ఎన్నికైతే 10 రోజుల్లోగా ఏ సభలో కొనసాగదల్చుకున్నాడో తెలియజేయకపోతే రాజ్యసభ సభ్యత్వం కోల్పోతారు. ప్రస్తుతం ఒక సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరో సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందితే అప్పుడు మొదటి సభలో సభ్యత్వం కోల్పోతారు. ఒక వ్యక్తి పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు రెండింటికి ఎన్నికయితే 14 రోజుల్లోగా రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకపోతే పార్లమెంట్ సభ్యత్వం కోల్పోతారు.
పార్లమెంట్ సభ్యుల అనర్హతలు( ఆర్టికల్ 102)
- రాజ్యాంగంలో ఉదహరించిన విధంగా కింది పేర్కొన్న ప్రాతిపదికలపై పార్లమెంట్ సభ్యత్వం రద్దవుతుంది.
- లాభదాయక ప్రభుత్వ పదవిని చేపట్టినప్పుడు
ఉదా: జయాబచ్చన్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(2006) కేసు తీర్పు ఫలితంగా యూపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్షురాలిగా ఉన్నందుకు జయాబచ్చన్ 2006లో పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయారు.
- మానసికంగా స్థిమితంగా లేడని న్యాయస్థానం పేర్కొన్నప్పుడు
- దివాళాకోరు అని ప్రకటించడం
- ఈ కారణంగా 2008లో రాజ్యసభ సభ్యురాలైన జయప్రద సభ్యత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. చెన్నైలో ఆమెకు గల రెండు థియేటర్లు 25 లక్షలకు పైగా మున్సిపల్ పన్ను బకాయి పడటంతో ఆ థియేటర్లకు సీజ్ చేశారు. వెంటనే ఆమె ఆ సొమ్ము చెల్లించారు. లేకపోతే జయప్రద పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయేవారు.
- భారత పౌరసత్వం పోవడం, పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం లేక విదేశాలకు విధేయుడై ఉంటాడని ప్రకటించడం.
- 2008లో సోనియాగాంధీ బెల్జియం ప్రభుత్వం నుంచి ఆర్డర్ ఆఫ్ లియోపోల్డ్ అవార్డు తీసుకున్నప్పుడు ఆ అవార్డు గ్రహీత ఆ దేశానికి విధేయత కలిగి ఉంటానని ప్రకటించడమే అవుతుంది. ఈ విషయమై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయగా, రాష్ట్రపతి ఆ అంశాన్ని ఎన్నికల సంఘానికి నివేదించగా 2009 ఏప్రిల్లో ఎన్నికల సంఘం 2:1 తేడాతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించాల్సిన అవసరం లేదని రాష్ట్రపతికి సలహా ఇచ్చింది.
అనర్హతలను నిర్దేశించవచ్చు
పార్లమెంట్ ప్రజాప్రాతినిధ్యం చట్టం – 1951 ఆధారంగా కింది అనర్హతలను నిర్దేశించింది.
1. ఎన్నికల్లో నేరాలకు పాల్పడినప్పుడు
2. రెండు లేక అంతకంటే ఎక్కువ సంవత్సరాలు చట్టపరంగా నిర్బంధించి ఉండటం, అయితే నిరోధక నిర్బంధ చట్టాల ఆధారంగా నిర్బంధిస్తే ఇది వర్తించదు.
3. ఎన్నికల ఖర్చులకు సంబంధించిన ఖాతాలను నిర్ణీత కాల పరిమితిలోగా ఎన్నికల సంఘానికి సమర్పించడంలో విఫలమైనప్పుడు
4. ప్రభుత్వ కాంట్రాక్టులు పొందినప్పుడు
5. ఏదైనా కనీసం 25శాతం ప్రభుత్వ వాటా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలో డైరెక్టర్లుగా గానీ మేనేజింగ్ ఏజెంట్గా గానీ పనిచేస్తున్నప్పుడు
6. అవినీతి, రాజ్యంపట్ల అవిధేయత కారణంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు
7. సమాజంలోని విభిన్న వర్గాల మధ్య విభేదాలను సృష్టించినప్పుడు
8. సామాజిక నేరాలను ప్రోత్సహించడం, ఆ నేరాలకు పాల్పడి జైలు శిక్షను అనుభవించినప్పుడు
పై అనర్హతల ఆధారంగా ఎన్నికల సంఘాన్ని సంప్రదించి ఒక పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి.
అనర్హతలపై అంతిమ నిర్ణయం
ఆర్టికల్ 192(2) ప్రకారం ఒక వ్యక్తి శాసనసభ సభ్యునిగా కొనసాగడానికి అర్హుడా కాదా అనే విషయం వివాదాస్పదమైనప్పుడు, ఆ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా గవర్నర్ను కోరుతారు. ఆ అంశంపై గవర్నర్ నిర్ణయానికి తిరుగులేదు. అయితే, పైన తెలిపిన విధంగా నిర్ణయాన్ని వెల్లడించడానికి ముందు గవర్నర్ సదరు అంశంపై ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకోవాలి. ఎన్నికల సంఘం అభిప్రాయానికి అనుగుణంగా గవర్నర్ వ్యవహరించాలి.
ద్వంద్వ సభ్యత్వం కోల్పోవడం
ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టికల్ 190 లో పేర్కొన్నారు. ఏ వ్యక్తి ఒకే సమయంలో శాసనసభ, శాసనమండలిలో సభ్యుడై ఉండరాదు. అందుకు సంబంధిం చిన ఒక శాసనాన్ని, శాసనసభ రూపొందిం చాల్సి ఉంటుంది. (శాసనసభ, శాసనమం డలి ఉన్న రాష్ట్రాలకు ఈ క్లాజు వర్తిస్తుంది). ఏ వ్యక్తి ఒకే సమయంలో రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్ర శాసనసభల్లో సభ్యుడై ఉండరాదు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్ర శాసనసభలకు ఎంపికైతే ఒక నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత ఆ వ్యక్తి సదరు సభ్యత్వాల న్నింటినీ కోల్పోయే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేస్తారు. అయితే ఈ లోపు ఆ వ్యక్తి ఒక శాసనసభ స్థానం తప్ప మిగిలిన స్థానాలకు రాజీనామా చేస్తే ఈ క్లాజు వర్తించదు.