జార్ఖండ్ అసెంబ్లీకి ఇంకా అయిదారు నెలల గడువుంది. మొన్నటి జనరల్ ఎలక్షన్స్‌లో బీజేపీ మొత్తం 14 ఎంపీ స్థానాల్లో 12 గెలుచుకుని తిరుగులేని శక్తిగా అవతరించింది. అయితే, ఎస్టీలకు రిజర్వు చేసిన అయిదు సీట్లలో ఓట్ల చీలిక బాగా జరిగింది. దీనికి కారణం ఆదివాసీ ప్రాంతాల్లోకి బయటి జనాలు వెల్లువెత్తడమే! ఇప్పుడు ఆదివాసీలకు, జార్ఖండ్‌లోకి వచ్చి చేరుతున్న ఇతర ప్రాంతాలవారికి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఒకరకంగా ఇక్కడి సహజ వనరులపైనా, అటవీ భూములపైనా గిరిజనేతరుల కబ్జా సాగుతోంది. అందుకే, జార్ఖండ్ సాధనోద్యమంలో పనిచేసిన జేఎంఎం, జేవిఎం వంటి పార్టీలు ‘బ్యాక్ టు బేసిక్స్’ అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలనాటికి జార్ఖండ్‌లో ట్రైబల్ రైట్స్ ప్రాతిపదికన అజెండా ఖరారు చేయనున్నాయి.
జార్ఖండ్‌లోని ట్రైబల్ పాలిటిక్స్ గురించి చర్చించాలంటే ముందుగా అక్కడి రిజర్వ్డ్ స్థానాల గురించి మాట్లాడుకోవాలి. ఆ రాష్ట్రంలో ఐదు ఎస్టీ రిజర్వుడ్ సీట్లు సహా మొత్తం 14 లోక్‌సభ సీట్లు ఉండగా, వాటిలో 12 బీజేపీ దక్కించుకుంది. ఎస్టీలకు రిజర్వ్ చేసిన ఐదు సెగ్మెంట్లలో మూడు బీజేపీ గెలవగా. రెండుచోట్ల కాంగ్రెస్ క్యాండిడేట్లు విజయం సాధించారు. ఈ రెండు మాత్రమే కాంగ్రెస్‌కి దక్కిన సీట్లు. కమలదళం సొంతం చేసుకున్న మూడు స్థానాల్లో ఒకటి సంథాల్ పరగణా రీజియన్‌కి, మరో రెండు సీట్లు ఛోటా నాగ్‌పూర్ ప్రాంతానికి చెందినవి. ఛోటా నాగ్‌పూర్‌లో బీజేపీ కైవసం చేసుకున్న రెండు సెగ్మెంట్లలో ఆ పార్టీ పొందిన మెజారిటీ చాలా తక్కువ. ముఖ్యంగా ఖుంతి నియోజకవర్గంలో పథల్గఢి మూమెంట్ ప్రభావంతో బీజేపీ క్యాండిడేట్లు నామమాత్రపు ఆధిక్యతను మాత్రమే (కేవలం 3,000 ఓట్లు) పొందగలిగారు. ఇక్కడ బీజేపీకి 45.97 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 45.80 శాతం పడ్డాయి.
ఈ రెండు పార్టీల అభ్యర్థులతోపాటు మరో తొమ్మిది మంది క్యాండిడేట్లు కూడా అక్కడ బరిలో నిలిచారు.వీళ్లవల్ల ఓట్ల చీలిక బాగా జరిగింది. 1,864 ఓట్ల నుంచి 10,989 వరకు ఇతర క్యాండిడేట్లు చీల్చగలిగారు. లోహర్దగా సెగ్మెంట్లోనూ బీజేపీది ఇదే పరిస్థితి. అక్కడ కమలదళానికి 45.45 శాతం మంది ఓటేయగా, హస్తం పార్టీకి ఒన్ పర్సెంట్ కన్నా తక్కువగా 44.18 శాతం మంది మద్దతు తెలిపారు. ఈ నియోజకవర్గంలోకూడా ఇతరులు 12 మంది వరకు పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చారు. ఇక్కడ ఈ క్యాండిడేట్లు తక్కువలో తక్కువగా 1,889 ఓట్ల నుంచి 10,989 వరకు ఓట్లు రాబట్టుకున్నారు. ఈ రెండు చోట్ల గ్రామీణ స్థాయిలో జరుగుతున్న ఉద్యమాలు బీజేపీకి భిన్నమైన అనుభవాన్ని, ఫలితాన్ని మిగిల్చాయి. ఒక రకంగా చెప్పాలంటే కమలనాథులకు చావు తప్పి కన్ను లొట్టబోయింది.
తగ్గుతున్న గిరిజనులు.. దూరమవుతున్న హక్కులు
ఈ సమస్యకు కారణం బయటకు కనిపిస్తున్నప్పటికీ, సమస్య తీవ్రతమాత్రం చాలా లోతైనది. జార్ఖండ్‌లోకి ఇతర రాష్ట్రాల వారు పెద్ద సంఖ్యలో వలస వస్తున్నారు. దీంతో ట్రైబల్ జనాభా తగ్గుముఖం పడుతోంది. ఎస్టీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లోనూ ఇదే పరస్థితి. ఇక్కడే పుట్టి పెరిగినవారికి భూములు, వనరులు, స్వయం పాలనకు సంబంధించి రాజ్యాంగపరంగా, లీగల్‌గా దక్కాల్సిన హక్కులు ఏవీ దక్కడం లేదు. బయటి ప్రాంతాల ప్రజలు వచ్చి చేరడంవల్ల తమకు కేంద్ర, రాష్ట్రాలనుంచి డెవలప్మెంట్ స్కీమ్‌లు దూరమవుతున్నాయనే బాధ వారిలో గూడు కట్టుకుంది. వాటి సాధనకోసం పోరు బాట పట్టాల్సి వస్తోంది.
దీనికితోడు ఇక్కడి ట్రైబల్ క్రిస్టియన్లు, ట్రైబల్ వర్గాల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు నెలకొన్నాయి. ట్రైబల్ జాతులు బీజేపీకి సపోర్ట్‌గా ఉంటున్నాయి. ఫలితంగా చర్చిలపైన, ట్రైబల్ క్రీస్టియన్లపైన నిరాటంకంగా దాడులు జరుగుతున్నాయి. ఈ రెండు వర్గాలకు 1960వ దశాబ్దం మధ్య నుంచే గొడవలు జరుగుతున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో సోషల్, కల్చరల్ అంశాలు ఉన్నాయి. రాజకీయాలు కూడా ఈ వివాదాలకు ఆజ్యం పోస్తున్నాయనే వాదనా వినిపిస్తోంది. . జార్ఖండ్ పాలిటిక్స్ ఎక్కువ శాతం ట్రైబల్ క్రీస్టియన్లకు ఎస్టీ స్టేటస్ ఇవ్వొద్దనే అంశం చుట్టూనే తిరుగుతాయి. చదువులు, రిజర్వేషన్లు వంటి విషయాల్లో ట్రైబల్ క్రీస్టియన్లు ముందంజలో ఉన్నారు. ట్రైబల్ జాతులు చాలా వెనకబడ్డాయి. స్టేట్, సెంట్రల్ సర్వీసుల్లో ట్రైబల్ క్రీస్టియన్ల హవా కొనసాగుతోంది. దీంతో వాళ్లను ఎస్టీలుగా గుర్తించొద్దనే డిమాండ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. దీన్నే ఇప్పుడు సంఘ్ పరివార్, దాని అనుబంధ సంస్థలు ప్రధాన అజెండాగా మలచుకున్నాయి.
కొత్త ఉద్యమానికి సోరేన్ సైరన్
అసెంబ్లీ సమరానికి జార్ఖండ్‌లో రెండో ప్రధాన పార్టీ అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కసరత్తు మొదలుపెట్టింది. జేఎంఎం ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మాజీ సీఎం హేమంత్ సోరెన్ పార్టీకి దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుత రాజకీయాలు, పార్టీ స్థితిగతులపై చర్చించారు. ఇతర పార్టీలతో పొత్తుల దిశగా కూడా ఆలోచనలు జరిపినట్లు తెలిపారు. జార్ఖండ్‌లో తమ ఫ్యామిలీకి అన్యాయం జరిగిందన్న ఆవేదన హేమంత్‌లో ఉంది., జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన తండ్రి శిబూ సోరెన్ పాత్ర కీలకమైంది. వడ్డీ వ్యాపారుల కోరల నుంచి ఆదివాసీల హక్కుల పరిరక్షణలో శిబూ సోరెన్ బాగా శ్రమించారు. కానీ, రాష్ట్రం ఏర్పడ్డాక శిబూకి ఛాన్స్ దక్కలేదు. 2005లో సీఎం కాగలిగారు. మొత్తంగా మూడుసార్లు శిబూ సీఎంగా పనిచేసినా 300 రోజులు పూర్తి చేయలేకపోయారు. అలాగే, హేమంత్ సోరేన్ ఏడాదిన్నర కాలమే జార్ఖండ్ సీఎంగా ఉన్నారు.
బీజేపీ అజెండా ఫిక్స్
2000లో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక మొదటి 14 ఏళ్లలో 9 సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయిదుగురు నాయకులే సీఎంలుగా పనిచేశారు. అర్జున్ ముండా, శిబూ సోరేన్ మూడేసిమార్లు; బాబూలాల్ మరాండీ, మధు కోడా, హేమంత్ సోరేన్ ఒక్కొక్కసారి ప్రభుత్వాన్నేర్పాటు చేశారు. ఈ తొమ్మిది ప్రభుత్వాల్లోనూ బీజేపీయే కీలక పాత్ర పోషించింది. అయితే, 2014లో జార్ఖండ్‌లోని 81సీట్లకుగాను 48 సీట్లు గెలిచి బీజేపీ సింగిల్‌గా అధికారంలోకి వచ్చింది. రఘువర్ దాస్ సీఎంగా అయిదేళ్లు గడిచిపోయాయి. జనరల్ ఎలక్షన్స్‌లో 12 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఉత్సాహంలో ఈసారి అసెంబ్లీలో 65 సీట్లు దక్కించుకోవాలని బీజేపీ అజెండా ఫిక్స్ చేసుకుంది.