సరస్వతి దేవీ అగర్వాల్ వయసు ఎనభై ఏండ్లు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పరిధిలోని కరమ్ తాండ్ ఆమె నివాసం. రాముడంటే ఆమెకి అమితమైన భక్తి. ఈమె భర్త దేవ్కీ నందన్. వీళ్లకు ముగ్గురు సంతానం. సరస్వతి చదువుకోలేదు. పెండ్లయ్యాక భర్త దేవ్కీ నందన్ ఆమెకి చదవడం, రాయడం నేర్పించాడు. దానివల్ల ‘రామ్ చరిత్ మానస్’తోపాటు ఇతర గ్రంథాలు చదవగలిగింది ఆమె. మొదటిసారి1992, మేలో భర్తతో కలిసి అయోధ్యకు వెళ్లింది.
అక్కడ రామజన్మ భూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్‌ను కలిసిందామె. ఆయన స్ఫూర్తితో మౌనవ్రతం మొదలుపెట్టింది. రామాలయం పూర్తయ్యే వరకు మౌనవ్రతం చేయాలి అని నిర్ణయించుకుంది. అందుకు ఆమె పిల్లలు కూడా సహకరించారు. ఆమె రోజులో ఒకసారి సాత్విక ఆహారం తీసుకుంటుంది. ఏదైనా చెప్పాలంటే పెన్ను, పేపర్ మీద రాస్తుంది. ఇంట్లో వాళ్లతో సైగలతో మాట్లాడుతుంది. అయితే 30 ఏండ్ల తర్వాత ఆమె కల నెరవేరింది. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందింది.
మహంత్ గోపాల్ దాస్ శిష్యులు మనీష్ దాస్, శశి దాస్ ఆమెకు అయోధ్యలో స్వాగతం పలికారు. జనవరి 22న ‘రామ్.. సీతారామ్’ అంటూ మౌనవ్రతాన్ని విరమించబోతోంది. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి కావడంతో నా జీవితం ధన్యమైంది. ఇకపై అయోధ్యలోని మహంత్ గోపాల్ దాస్ ఆశ్రమానికి వెళ్లి, అక్కడే ఉండాలి అనుకుంటున్నా’ అని తన మనసులోని ఆలోచనలను పేపర్ మీద రాసి చూపించింది.