![నాగబాబు మాటలు ఎవరి గురించి.. : సోషల్ మీడియాలో గోలగోల ఎందుకు..?](https://static.v6velugu.com/uploads/2024/09/jhony-master-episode-naga-babu-latest-tweet-gets-attention-grabbing-from-netizens_vbVq5NeTgt.jpg)
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న జనసేనలో జానీ క్రియాశీలకంగా వ్యవహరించడంతో ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. జానీ లైంగిక వేధింపుల కేసుపై ట్విటర్లో వైసీపీ, జనసేన మద్దతుదారుల మధ్య ఒక మినీ యుద్ధమే నడుస్తోంది. ఇదే సమయంలో ట్విటర్లో యాక్టివ్గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు తాజాగా చేసిన ట్వీట్స్ నెట్టింట చర్చకు దారితీశాయి.
No person can be considered guilty of a crime until he or she has been found guilty of that crime by a court of law.
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 19, 2024
:- Sir William Garrow
‘‘న్యాయ స్థానంలో నేరం రుజువయ్యేంత వరకూ ఏ ఒక్కరినీ నేరం చేసినట్టుగా పరిగణించకూడదు’’ అని సర్ విలియమ్ గ్యారో చెప్పిన మాటలను నాగబాబు గుర్తుచేశారు. అంతేకాదు.. మరో పోస్ట్ కూడా పెట్టారు. ‘‘విన్న ప్రతీ ఒక్క విషయాన్ని నమ్మకూడదు. ఎందుకంటే ప్రతీ కథకు మూడు భిన్న కోణాలు ఉంటాయి. నీ వెర్షన్, ఇతరులు చెప్పే వెర్షన్, అసలు వాస్తవం’’ అని రాబర్ట్ ఇవాన్స్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 19, 2024
నాగబాబు తన ‘ఎక్స్’ ఖాతాలో.. అదేనండి తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఈ రెండు సూక్తులు జానీకి పరోక్షంగా మద్దతు తెలిపినట్టుగా ఉన్నాయని వైసీపీ దుమ్మెత్తిపోసింది. లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి అండగా నిలవాల్సింది పోయి జనసేనలో కొనసాగుతున్నాడనే ఒకేఒక్క కారణంతో జానీకి మద్దతుగా పోస్టులు పెట్టడం ఏంటని వైసీపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. జానీ అరెస్ట్ వ్యవహారం కాస్తా రెండు రాజకీయ పార్టీల మద్దతుదారుల మధ్య పొలిటికల్ వార్కు దారితీసిన ఈ పరిస్థితుల్లో నాగబాబు ట్వీట్స్ సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి. వరసగా రెండు పోస్టులు చేసిన నాగబాబు.. కామెంట్లను బ్లాక్ చేసుకోవటం విశేషం. నెటిజన్ల రియాక్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఆయన.
ఇదిలా ఉండగా.. జానీని పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో జానీ మాస్టర్ని హాజరుపరచాలని పోలీసులు నిర్ణయించారు. గోవా కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్ కింద హైదరాబాద్కు జానీని తరలించనున్నారు. లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డు అందుకున్న జానీకి ఈ పరిణామం మాయని మచ్చగా మిగిలిపోయింది. ధనుష్ హీరోగా నటించిన ‘తిరుచిత్రంబళం’ తెలుగులో ‘తిరు’ పేరుతో విడుదలైన సినిమాకు గానూ జానీకి జాతీయ అవార్డు దక్కింది. ఈ సినిమాలోని ‘మేఘం కరిగేనా’ పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు జానీకి నేషనల్ అవార్డ్ వచ్చింది.
ALSO READ : గోవాలో కొరియోగ్రాఫర్ జానీ అరెస్ట్
సూపర్ హిట్ సాంగ్స్గా యూట్యూబ్లో ట్రెండ్ సృష్టించిన పలు సాంగ్స్కు జానీ కొరియోగ్రాఫర్గా వర్క్ చేశాడు. ‘అల వైకుంఠపురం’ సినిమాలోని ‘బుట్ట బొమ్మ’ సాంగ్ జానీకి ఓవర్ నైట్ స్టార్డమ్ తీసుకొచ్చింది.. పుష్ప సినిమాలోని శ్రీవల్లీ సాంగ్, బీస్ట్ సినిమాలోని ‘అరబిక్ కుత్తు’ సాంగ్స్ ఏ రేంజ్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాంచరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు జానీ ప్రస్తుతం పనిచేస్తున్నాడు.