శాన్ ఫ్రాన్సిస్కో: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నియంతేనని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మరోసారి కామెంట్ చేశారు. యాన్యువల్ ఆసియా -పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు జిన్‌పింగ్ అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా చైనా, అమెరికా మధ్య ఏర్పడిన వాణిజ్య పరమైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు బుధవారం ఆయన బైడెన్‌తో సమావేశమయ్యారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫిలోలీ ఎస్టేట్ గ్రౌండ్ లో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ మీటింగ్ అనంతరం బైడెన్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా 'జిన్‌పింగ్ ను మీరు ఇంకా నియంతగానే భావిస్తున్నారా..?' అని జర్నలిస్టులు ప్రశ్నించారు. దీనికి బైడెన్ బదులిస్తూ.."అవును. ఆయన నియంతే. కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని విశ్వసించే దేశానికి జిన్‌పింగ్ పగ్గాలు చేపట్టాడు. అతని ప్రభుత్వం యూఎస్ ప్రభుత్వానికి భిన్నమైనది. అందుకే నేను నా కామెంటుకు కట్టుబడి ఉన్నాను." అని పేర్కొన్నారు.
ALSO READ: ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేంద్రం నుంచి..ఉప్పల్ కు నిధులు తీసుకొస్త : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఈ ఏడాది జూన్ లోనూ చైనా అధ్యక్షుడిని నియంత అని బైడెన్ అన్నారు. దాంతో అమెరికా అధ్యక్షుడి కామెంట్లపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. బైడెన్ మాటలు బాధ్యతారాహిత్యమని పేర్కొంది. అయితే, ఆయన మళ్లీ చేసిన అదే కామెంట్స్ చైనాను మరోసారి అసహనానికి గురిచేసేలా కనిపిస్తున్నాయి.