ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

యాదగిరిగుట్ట, వెలుగు : ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండలస్పెషలాఫీసర్ జినుకల శ్యాంసుందర్ అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలం మాదాపూర్, మల్కాపూర్, తుర్కపల్లి గ్రామాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో 'అమ్మ ఆదర్శ పాఠశాలల' అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని  సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

 అందులో భాగంగా పాఠశాలల్లో మంచినీటి వసతులు, మైనర్ రిపేర్, మూత్రశాలలు రిపేర్, విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనుల పర్యవేక్షణ జరుగుతుందని, ఈ పనులను ఈనెల చివరిలోగా పూర్తిచేయాలని అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో ఝాన్సీలక్ష్మీబాయి, ఏఈ అమరేందర్, పలువురు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.