రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్.. అతి పెద్ద టెలికాం కంపెనీలైన ఈ రెండింటి మధ్య పోటీ తత్వం ఎక్కువ. ఒక కంపెనీ ఏదేని రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసిందా..! మరో కంపెనీలో గుబులు మొదలైనట్లే.. తదుపరి రెండు మూడు రోజుల్లో మొదటి కంపెనీకి పోటీగా ప్లాన్ లాంచ్ చేయాల్సిందే. అలా అని చవకగా ఇస్తారనుకోకండి. లాభాల్లో ఏమాత్రం రాజీపడరు. ఏ ఒక్క రూపాయి ప్రజలకు పోనివ్వరు. మభ్యపెట్టేలా అంకెల గారడీ చేస్తాయి. అలా ఉంటది వారి మార్కెటింగ్ స్ట్రేటజీ. తాజాగా, అటువంటి అంకెల గారడీ మరోసారి జరిగింది.
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ రెండూనూ రూ. 666 విలువైన కొత్త రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకొచ్చాయి. ఇందులో రీఛార్జ్ ప్లాన్ ధర ఒకేలా ఉన్న వినియోగదారులకు అందే ప్రయోజనాల్లో మాత్రం చాలా తేడా ఉంది.
జియో రూ.666 ప్లాన్:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఈ వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం పొందవచ్చు. అలాగే, రోజుకు 1.5GB డేటా చొప్పున మొత్తం 84 రోజులకు 126GB డేటా అందిస్తోంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. వీటికి జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ సబ్‌స్క్రిప్షన్లు ఉచితం.
ఎయిర్‌టెల్ రూ.666 ప్లాన్:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 77 రోజులు. ఈ వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం పొందవచ్చు. అలాగే, రోజుకు 1.5GB డేటా చొప్పున మొత్తం 77 రోజులకు 115GB డేటా అందిస్తోంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. అయితే, ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్, వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్ వంటి సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తోంది.
దేశవ్యాప్తంగా రిలయన్స్ జియోకు 44 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉండగా.. ఎయిర్‌టెల్‌కు 37 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు.