- ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ అరాధే
- హాజరైన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎం, మంత్రులు
- తెలంగాణకు రావడం సంతోషంగా ఉంది: గవర్నర్
- రుణమాఫీతో రైతులకు పెద్ద రిలీఫ్ అని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ ప్రమాణం చేశారు. బుధవారం రాజ్ భవన్ లో ఆయనతో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేబినెట్‌తో గవర్నర్ గ్రూఫ్ ఫొటో దిగారు.
అనంతరం గవర్నర్ తో చీఫ్ జస్టిస్, సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బాధ్యతల స్వీకరణ తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ గవర్నర్‌గా తనను నియమించి నందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నర్‌గా గురుతర బాధ్యత అప్పగించారన్నారు.
‘‘గొప్ప సంస్కృతి సంప్రదాయాలు ఉన్న తెలంగాణకు గవర్నర్ గా రావటం చాలా ఆనందంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి యంగ్ అండ్ డైనమిక్ సీఎం, సమర్థవంతమైన కేబినెట్ ఉందని తెలిపారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని గవర్నర్ పేర్కొన్నారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీలకు తెలంగాణ పెద్ద హబ్ గా ఉందని తెలిపారు.
ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం
అంతకుముందు కోల్ కతా నుంచి హైదరాబాద్ చేరుకున్న జిష్ణుదేవ్‌వర్మ దంపతులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాజ్ భవన్ చేరుకున్న తర్వాత గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేశారు.