పాట్నా: బీహార్ లో దారుణం జరిగింది. వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేశ్ సహానీ తండ్రి జితన్ సహానీని అతి కిరాతకంగా హత్య చేశారు. దర్భంగ జిల్లాలోని ఆయన ఇంట్లో ఈ ఘటన జరిగింది. మంగళవారం ఉదయం ఇంట్లో బెడ్ పై రక్తసిక్తమైన స్థితిలో జితన్ సహానీ మృతదేహం కనిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సీనియర్ పోలీస్ అధికారి జగన్నాథ్ రెడ్డి జితన్ సహానీని హత్య చేసినట్లు నిర్ధారించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆయన ఇంటికి పోలీస్ టీం వెళ్లింది. జితన్ సహానీ కుమారుడు, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేశ్ సహానీ బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా సేవలందించారు. ఓబీసీ కమ్యూనిటీలో ముఖేశ్ సహానీకి మంచి పట్టుంది. వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ ప్రస్తుతం ఆర్జేడీతో పొత్తులో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో కొనసాగుతోంది.
జితన్ సహానీ హత్యకు సంబంధించి సీనియర్ పోలీస్ అధికారి మనీష్ చంద్ర చౌదరి మీడియాతో మాట్లాడారు. జితన్ సహానీ ఒక్కరే ఉంటున్న ఆ ఇంటికి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో నిందితులు వెళ్లి ఉండొచ్చని తెలిపారు. దొంగలను గమనించి ఆయన ప్రతిఘటించడంతో హత్య చేసి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తు అనంతరం భావిస్తున్నట్లు మనీష్ చంద్ర చౌదరి మీడియాకు వివరించారు. ముగ్గురితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం జితన్ సహానీ హత్య కేసును విచారించే నిమిత్తం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై బీహార్ లో రాజకీయంగా కూడా కల్లోలం రేగింది.
ALSO READ : నిజామాబాద్ జిల్లాలో ఘోరం.. యువజంట ఆత్మహత్య
బీహార్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆర్జేడీ ఈ ఘటనపై నితీష్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి యాదవ్ మాట్లాడుతూ.. బీహార్ లో అసలేం జరుగుతోందని విస్మయం వ్యక్తం చేశారు. బీహార్ లో హత్య జరగని రోజంటూ లేకుండా పోయిందని, బుర్రలేని ప్రభుత్వం అధికారంలో ఉందని దుయ్యబట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జితన్ సహానీ హత్య దురదృష్టకరం అని బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.