బీజేపీపై సంచలన కామెంట్స్ చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి

యాదాద్రి-భువనగిరి జిల్లా : బీజేపీపై ఆ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను మానసికంగా ఎప్పుడో బీజేపీ పార్టీకి దూరమయ్యానని, కార్యకర్తగా మాత్రమే ఉన్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తారని తాను బీజేపీలో చేరానని, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఆకాంక్ష బీజేపీతో నెరవేరదని అర్థమైందన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను మార్చడంపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని వ్యాఖ్యానించారు జిట్టా బాలకృష్ణారెడ్డి. గత16 నెలలగా బీజేపీలో ఉన్నా..తనను ఏ ఒక్క కార్యక్రమం చేయనివ్వలేదన్నారు. బండి సంజయ్ ను తొలగించడం హీనమైన చర్య అని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ సర్కార్ పని చేయడం లేదన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలంటే.. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. తనను చాలామంది కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్నారని, కార్యకర్తలతో సమావేశమైన తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. 

ముగ్గురు రియల్టర్ల చేతుల్లోనే భువనగిరి రాజకీయాలు ఉన్నాయని కామెంట్స్ చేశారు జిట్టా బాలకృష్ణారెడ్డి. మూడు పార్టీల అధ్యక్షులు బెంగళూరు బ్రదర్స్ అంటూ ఆరోపించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నిందించే స్థాయి కుంభం అనిల్ కు లేదన్నారు. తనతో చాలామంది నాయకులు టచ్ లోనే ఉన్నారని చెప్పారు. రాజకీయంగా కాకుండా.. వ్యక్తిగతంగా తనతో సంబంధాలు ఉన్నాయన్నారు.