వరద సాయం కాదది.. ఓటుకు నోటు

వరద సాయం కాదది.. ఓటుకు నోటు

శతాబ్దాల చరిత్ర గల హైదరాబాద్ నగరంలో నేడు కార్పొరేషన్ ఎన్నికల సందడి షురువయ్యింది. తరతరాలుగా స్థిర నివాసం ఉన్న వారితోపాటు దేశ నలుమూలల నుంచి బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన లక్షలాది మందికి అన్నం పెట్టిన భాగ్యనగరం ఇప్పుడు తన అస్థిత్వాన్ని
తానే ప్రశ్నించుకుంటోంది. నివాసయోగ్యమైన నగరాల్లో అగ్రగామిగా అందుకున్న అవార్డుల డొల్లతనాన్ని మొన్నటి వరదలు వెలికితీసాయి. భాగ్యనగర మెరుపుల వెనక బస్తీల్లో మురికి ఆరేండ్లయినా అలాగే ఉంది. సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగుపడనంత కాలం, మధ్యతరగతికి ఆర్థిక భద్రత లేనంత కాలం హైదరాబాద్ నివాసయోగ్యమైన నగరం ఎలా అవుతుంది?

ఆంధ్ర పాలకుల వివక్ష, ఈర్ష్య వల్ల హైదరాబాద్​ తన అస్థిత్వాన్ని కోల్పోతోందని, తెలంగాణ సంస్కృతిని హైదరాబాద్​కు దూరం చేస్తున్నారని ఉద్యమ సమయంలో పదే పదే జనాలను రెచ్చగొట్టిన కేసీఆర్.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడు అదే హైదరాబాద్​లో కనీసం జనం బతకలేని స్థితిలోకి నెట్టేశారు. నాలుగు చినుకులు పడితేనే హైదరాబాద్ చెరువవుతోందన్న కేసీఆర్.. చిత్తశుద్ధి లేని పాలనతో ఇవాళ అవే నాలుగు చినుకులకు హైదరాబాద్ సముద్రమయ్యే స్థితికి తీసుకువచ్చారు. తెలంగాణ వచ్చాక, జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలిచి మేయర్ పీఠం అధిరోహించిందే తడవుగా పాలనను గాలికొదిలేసి ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, రియల్ దందాలు చేస్తూ రూలింగ్​ పార్టీ పెద్దలకు పర్సెంటేజీలు ఇస్తూ కోట్లకు పడగెత్తారు. చెరువులు, కుంటలు, భూములు ఇలా గజం జాగా కూడా వదలకుండా ఆక్రమించిన పాప ఫలితమే నిన్నటి వాన నీరు వరదై ఎటూ వెళ్లే దారిలేక నగరాన్ని ముంచెత్తింది. పైగా ‘వానొస్తే నీళ్లు రాకుంటే మంటొస్తదా’ అని మంత్రులు మాట్లాడిన వెకిలి మాటలు వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.

అభివృద్ధి కాదు.. అన్నీ అబద్ధాలే

హైదరాబాద్ ను డల్లాస్ చేస్తం, పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తమంటిరి. వెయ్యి కోట్లతో హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థను మార్చి, ఎంత పెద్ద వానొచ్చినా చుక్క నీరు రోడ్డు మీద ఆగనియ్యమంటిరి. తీరా చూస్తే చుక్క నీరు బయటికి పోకుండా నాలాలు కబ్జాపెడ్తిరి. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకముందే వరద సాయం పేరిట జనాన్ని రోడ్ల మీద రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబెట్టడం రూలింగ్​ పార్టీ నేతల అహంకారానికి తార్కాణం. హైదరాబాద్ కంటే ముందే వరంగల్ ను వరదలు ముంచెత్తాయి. స్వయంగా ఓ ఎమ్మెల్యేనే క్యాంప్ ఆఫీస్ ను నాలా మీద కట్టడం అధికార పార్టీ అక్రమాలకు సాక్ష్యం. వరంగల్ ప్రజలైనా, హైదరాబాద్ ప్రజలైనా వరద నష్టం అందరికీ సమానమే. కానీ సాయంలో ఎందుకీ వివక్ష. జీహెచ్ఎంసీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓటుకు నోటు ఇలా పంచుతున్నారు. ఈ విషయం హైదరాబాద్​ ప్రజలు తెలుసుకోవాలి. లివింగ్ కండిషన్స్ లో హైదరాబాద్ బెస్ట్ సిటీ అని, నగరాన్ని ఇంత అభివృద్ధి చేశాం..- అంత అభివృద్ధి చేశాం అంటూ కోట్లు ఖర్చు పెట్టి వేయించుకున్న ప్రకటనలు నీటిమూటలేనని రుజువు చేస్తున్నాయి.

లక్ష గుంతలు కనపడలేదా

హైదరాబాద్ ను పశ్చిమ వైపు మాత్రమే అభివృద్ధి చేసి మీరు, మీ బంధుగణం, మీ బినామీలు కలిసికట్టుగా భూములన్నీ ఆక్రమించుకుని ఇపుడు వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి ఎల్ఆర్ఎస్​ పేరుతో సామాన్యులపై భారం మోపుతున్నారు. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన తమ ఆస్తులకు ప్రజలెందుకు ఇంత సొమ్ము చెల్లించాలి. ఖజానాలో డబ్బులేదని ఇలా జనాన్ని పీడిస్తూ, మీ విలాసాలకు రూ.550 కోట్లతో కొత్త సెక్రటేరియెట్ ఎందుకు? 2015లో జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రోడ్ల మీద గుంత కనపడితే వెయ్యి రూపాయలు ఇస్తనన్న కేసీఆర్ లక్ష గుంతలు కనబడ్డా నోరుమెదపలేదు. మొన్నటికి మొన్న కరోనా సమయంలో రోడ్ల సుందరీకరణ పేరు చెప్పి కోట్లకు కోట్లు మీ బినామీ మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చి వేసిన రోడ్లు.. నెల తిరగక ముందే భారీ వర్షాలకు పాడైపోయాయి. దీనికి ఎవరు మూల్యం చెల్లిస్తారు?

మూసీ నీళ్లు మారలేదు
కొబ్బరి నీళ్లతో నింపుతామన్న హుస్సేన్ సాగర్ ఇంకా మురికినీళ్లతో డ్రైనేజీ కంపు కొడుతూ ప్రగతి భవన్ దిక్కు చూస్తోంది. హైదరాబాద్ నుంచి వాడపల్లి దాకా కాలుష్య కంపును మూసీ మోసుకుపోతోంది . ‘‘మూసీ రివర్ ఫ్రంట్’’ పేరుతో కోట్లు ఖర్చయ్యాయి కానీ మూసీ మాత్రం మారలేదు. పరిశ్రమల్లో
లోకల్ రిజర్వేషన్ యాక్ట్ అమలు చేయకపోవడంతో పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వస్తున్న తెలంగాణ యువతకు ఉపాధి దక్కడం లేదు. తెలంగాణ వస్తే ఆంధ్రోళ్ల చేతిలోంచి తెలంగాణ ఆస్తులు లాక్కుంటామని నమ్మించి.. ఇప్పుడు అదే ఆంధ్రోళ్లతో కేసీఆర్ దోస్తానా చేస్తున్నా రు. ఒకప్పుడు గురుకుల ట్రస్ట్ భూముల ఆక్రమణలపై గొంతెత్తిన కేసీఆర్, ఇప్పుడు కూల్చివేతల బూచి చూపి, బ్లాక్ మెయిల్ చేసి ఆ భూముల ఆక్రమణదారులైన కొందరు సినీ
ప్రముఖులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

ప్రజాసేవ చేసే వారినే గెలిపిద్దాం..

ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అటు ఆంధ్రోళ్లు, ఇటు ఉద్యమ ద్రోహులు, ఇతర రాష్ట్రాల నుంచి వలసొచ్చిన ఓటర్లను కావలిచ్చుకుంటే సరిపోతది. తెలంగాణ జనాలకి నాలుగు పైసలిస్తే ఓట్లు ఏస్తరని అనుకుంటున్నారు. టీఆర్ఎస్ కల్లబొల్లి మాటలకు మోసపోతే గోస వడ్తరు. అందుకే ప్రజలారా.. బహుపరాక్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ పోటీ చేయడం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్ర, హైదరాబాద్ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ, అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడిద్దాం. మన బిడ్డల భవిష్యత్ కోసం నిజాయితీ, నిబద్దత కలిగి, ప్రజాసేవ చేసే వారిని గెలిపిద్దాం.

– జిట్టా బాలకృష్ణారెడ్డి, అధ్యక్షుడు, యువ తెలంగాణ పార్టీ

For More News..

ట్రంప్ కాదన్నడు.. బైడెన్ యెస్ అన్నడు 

టెక్నికల్​ స్టూడెంట్స్​కు.. జాబ్​ గ్యారంటీ కోర్సులు

ఇండియాకు గుడ్​ చాన్స్‌.. ఐపీఎల్‌‌లో ఆడిన ప్లేయర్లు మంచి రిథమ్‌‌లో ఉన్నారు