నేలరాలిన ఉద్యమ తార :జిట్టా బాలక్రిష్ణారెడ్డి

  •  శోక సంద్రంలో భువనగిరి
  • ఉద్యమ కారుడు కన్నుమూత
  • లోక్ సభ ఎన్నికల తర్వాత అస్వస్థత
  • పరిస్థితి విషమించడంతో మృతి
  • నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నేతలు

యాదాద్రి, వెలుగు : తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డి(52) కన్నుమూశారు. ఆయన మారణంతో భువనగిరి శోకసంద్రంలో మునిగిపోయింది. వేలాది మంది ఆయన అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో జిట్టా అస్వస్థతకు గురయ్యారు. రెండు నెలలుగా మెదడు సంబంధిత సమస్యలతో ఆయన బాధపడ్డారు. నెలకుపైగా సికింద్రాబాద్​లోని యశోద హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ పొందారు.  

కొన్ని రోజులుగా ఆయన బెడ్​కే పరిమితం కావడంతో ఆరోగ్యం మరింత దెబ్బతినడంతో వెంటిలేటర్​పైనే చికిత్స పొందారు. శుక్రవారం జిట్టా ఆరోగ్యం మరింత విషమించడంతో కన్నుమూశారు. ఆయనకు తండ్రి బాల్​రెడ్డి, భార్య సునీత, కుమారుడు వివేకానంద రెడ్డి, కూతురు ఝాన్సీ ఉన్నారు. తెలంగాణ సాధించాలన్న జిట్టా కల సాకారమైనా.. చట్టసభల్లో అడుగు పెట్టాలన్న కల నెరవేరకుండానే ఆయన మృతి చెందారు. జిట్టా మృతితో భువనగిరిలో విషాదచాయలు అలుముకున్నాయి. 

ఫాంహౌస్​కు భౌతికకాయం..

జిట్టా భౌతికదేహాన్ని యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని పలువురు డిమాండ్​ చేశారు. దీనిపై ఆందోళన నిర్వహించే ప్రయత్నం చేసినా పలువురు వారించడంతో విరమించుకున్నారు. అనంతరం ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికదేహాన్ని భువనగిరి శివారులోని ఫాంహౌస్​కు తరలించారు.

ఆయనను కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం జిట్టా భౌతికదేహాన్ని వేలాది మంది అభిమానుల మధ్య సొంత గ్రామమైన బొమ్మాయిపల్లికి తీసుకెళ్లారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి పాడె మోశారు.  కుమారుడు వివేకానంద రెడ్డి చితికి నిప్పంటించడంతో అంత్యక్రియలు ముగిశాయి. 

తరలివచ్చిన అభిమాన జనం..

జిట్టా మరణవార్త శుక్రవారం దావానంలా జిల్లాలో వ్యాపించింది. దీంతో పెద్ద ఎత్తున జనం భువనగిరికి తరలివచ్చారు. జిట్టా అమర్​రహే అంటూ భువనగిరిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనగా వెళ్లి జిట్టా భౌతికదేహానికి నివాళులర్పించారు. చీకటై వర్షం పడుతున్నా అంత్యక్రియలు ముగిసేవరకూ జనం ఉన్నారు. 

తరలివచ్చిన ప్రముఖులు..

జిట్టా భౌతికదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, మహబూబ్ నగర్​ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి​నివాళులర్పించారు.

జిట్టా భౌతికదేహానికి నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రులు హరీశ్​రావు, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, డాక్టర్​కుడుదుల నగేశ్, ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, క్యామ మల్లేశ్ ఉన్నారు. 

కేసీఆర్​ ఎందుకు రాలే : ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జిట్టా బాలక్రిష్ణారెడ్డి చనిపోతే కేసీఆర్ ఎందుకు రాలే అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని, జిట్టాను వేరు చేసిచూడలేమన్నారు.

జిట్టా కుటుంబానికి అండగా ఉంటాం :మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ కోసం పోరాడిన ముద్దుబిడ్డను కోల్పోయాం. జిట్టా లేడంటే నమ్మలేక పోతున్నాం. సుదీర్ఘకాలంగా ఆయన ఉద్యమంలో కొనసాగారు. రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరిచిపోలేం. ప్రజాప్రతినిధి కాకున్నా ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం, మేము అండగా నిలబడతాం. 

జిట్టాకు కేసీఆర్ అన్యాయం చేసిండు- : ఎమ్మెల్యే కుంభం

తెలంగాణ ఉద్యమం కోసం జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఆస్తులు అమ్మి ఊపిరి ఊదిండు. ఉద్యమానికి ఖర్చు ఎవరూ పెట్టకున్నా జిట్టా పెట్టిండు. అలాంటి జిట్టాకు కేసీఆర్​అన్యాయం చేసిండు. ఫ్లోరైడ్​వాటర్​సమస్య తీర్చడానికి ఊరూరా వాటర్​ప్లాంట్లను పెట్టిండు. ఆయనకు అన్యాయం జరిగింది.